లోకో పైలట్ల నైట్ డ్యూటీల వల్లే ప్రమాదాలు..

2024 జూన్ 17 ఉదయం జరిగిన కాంచన్‌జంగా రైలు ప్రమాదంలో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లోకో పైలట్, రైలు మేనేజర్‌తో సహా

Update: 2024-07-02 00:30 GMT

2024 జూన్ 17 ఉదయం జరిగిన కాంచన్‌జంగా రైలు ప్రమాదంలో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లోకో పైలట్, రైలు మేనేజర్‌తో సహా వందలాది మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి స్టేషన్‌లో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఎప్పటిలాగే రైల్వే అధికారులు లోకో పైలట్ల వలన జరిగిందని తప్పుపట్టారు. స్టేషన్ మాస్టర్ మాన్యువల్ ఆపరేషన్‌పై ఆధారపడాల్సి వచ్చింది. ఈ స్టేషన్‌లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌ను నియమించలేదు. రద్దీగా ఉండే మార్గాలలో, మాన్యువల్‌గా ఆపరేట్ చేయడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో స్టేషన్ మాస్టర్‌ డ్యూటీలో సహాయం చేయడానికి అత్యవసర సమయంలో ప్రమాదం నివారించడానికి తగిన సూచనలు చేసేందుకు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ లేడు.

అధిక ఒత్తిడికి గురికావడం వల్ల

గతంలో స్టేషన్ మాస్టర్‌లను క్రమానుగతంగా 45 రోజుల పాటు రిఫ్రెషర్ శిక్షణకు పంపేవారు, దానిని 18 రోజులకు తగ్గించారు. సిబ్బంది తగ్గింపు పేరుతో రైల్వే అధికారులు నిరాకరిస్తున్న స్టేషన్‌ మాస్టర్లతో సహా సేఫ్టీ కేటగిరీ పోస్టులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2023 అక్టోబరు 29న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ఇలాంటి ప్రమాదం జరిగింది. ఇందులో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడంతో 14 మంది మరణించారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ వివరణాత్మక విచారణ తర్వాత, ఇది మళ్లీ సిగ్నల్ వైఫల్యం వలన ఆ ప్రమాదం జరిగిందని తేలింది. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు తమను వరుసగా రెండు కంటే ఎక్కువ నైట్ డ్యూటీలు చేయించకూడదని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. జూన్ 2న పంజాబ్‌లోని అంబాలా వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును, మరో గూడ్స్ రైలు ఢీకొనడంతో మరో ప్రమాదం జరిగింది. ఇక్కడ కూడా లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ వరుసగా మూడవ రాత్రి డ్యూటీ చేస్తున్నారు. లోకో పైలట్లు, స్టేషన్ మేనేజర్లు, సిగ్నల్, టెలికమ్యూనికేషన్ మెయింటెనెన్స్ సిబ్బంది, ట్రాక్ మెయింటెయినర్లు, రైలు మేనేజర్లు అధిక ఒత్తిడికి గురికావడం వల్ల, అన్ని భద్రతా కేటగిరీ స్థానాలను భర్తీ చేయడంలో రైల్వే అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. రైల్వే శాఖ విస్మరిస్తున్న, నిర్లక్ష్యం చేస్తున్న తప్పనిసరి నియామకాలను ఇకనైనా చేపట్టకపోతే ఇలాంటి అవాంఛనీయ ప్రమాదాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయని గుర్తించాలి.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Tags:    

Similar News