సస్పెన్షన్లు సరే.. శిక్షలు పడతాయా!

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఏసీబీ దాడులు పెరిగిపోయాయి. ఆరు నెలల్లోనే 70 మందికి పైగా లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. మరికొందరి

Update: 2024-07-10 01:00 GMT

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఏసీబీ దాడులు పెరిగిపోయాయి. ఆరు నెలల్లోనే 70 మందికి పైగా లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. మరికొందరిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు చేస్తున్నారు. సాక్ష్యాధారాల కోసం వీడియోలు రికార్డు చేస్తున్నారు. అరెస్టులతో సరిపెట్టకుండా వారి ఆస్తులు, బినామీల వివరాలు ఆరా తీస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు, బంగారం, భూములు, స్థిర చరాస్తులను లెక్కగడుతున్నారు.

ఏసీబీ కేసు నమోదు కాగానే సంబంధిత శాఖలు వారిని సస్పెండ్ చేస్తున్నాయి. అయితే ఏసీబీ కేసుల చరిత్రను పరిశీలిస్తే... అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన వారిలో కొందరికి మాత్రమే శిక్షలు పడుతుండగా.. మరికొందరు ఎలాంటి చర్యలు లేకుండా మళ్లీ ఉద్యోగంలో చేరుతున్నట్లు తెలుస్తున్నది. మరికొందరిపై విచారణకు అసలు ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వడం లేదు. దీంతో లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ వారిపై కచ్చితంగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం, ఏసీబీ వ్యవహారించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.

రెండు రకాల కేసులు..

సాధారణంగా ఏసీబీ అధికారులు రెండు రకాల కేసులు నమోదు చేస్తారు. ఇందులో మొదటిది.. లంచం అడుగుతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. సంబంధిత ఉద్యోగులను లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం. దీన్ని ట్రాప్ కేసు అని పిలుస్తారు. రెండోది ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. అవినీతి చేసి ఆస్తులు సంపాదించినట్టు కంప్లైంట్ వస్తే మొదట వివరాలు సేకరించి.. ఆ తర్వాత వారి ఇండ్లు, బంధువులు, బినామీల ఇండ్లపై ఒకేసారి దాడులు చేశారు. డబ్బు, పత్రాలు, బంగారం అన్నీ స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత వారి జీతం, ఇతర అధికారిక ఆదాయాలూ అన్నీ లెక్కవేసి, అంతకంటే ఎక్కువ ఉంటే అది ఎలా వచ్చిందో విచారణ జరుపుతారు. సరైన కారణాలు చెప్పకుంటే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని కేసు పెడతారు.

శిక్షలు పడుతున్నది కొందరికేనా!

లంచం తీసుకుంటూ లేదా ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో చాలా మందికి శిక్షలు పడడం లేదనే చర్చ జరుగుతున్నది. సగం మందిపైనే నేర నిరూపణ జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. అప్పటికప్పుడు శాఖాపరంగా సస్పెన్షన్ కు గురైనా.. ఆ తర్వాత ఏడాదికో, రెండేళ్లకో ఎలాగోలా విధుల్లో చేరుతున్నట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వంద మందిలో 52 మందిపై కేసులు రుజువు అవుతుండగా.. తెలంగాణలో వందలో 63 మంది కేసులు రుజువు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ట్రాప్ కేసుల్లో 65 శాతం శిక్షలు పడుతుంటే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 12 శాతం కూడా శిక్షలు పడనట్లు తెలుస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రెండు వేలకు పైగా ఏసీబీ కేసులు పెండింగ్ లో ఇంకా పెండింగులోనే ఉండడం గమనార్హం. ఏసీబీ కేసుల్లో చిన్నస్థాయి ఉద్యోగులకే శిక్షలు పడుతున్నాయని, వారిపైనే చర్యలు తీసుకుంటున్నారనే అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వ అధికారులపై ప్రాసిక్యూషన్ జరపాలంటే సర్కారు అనుమతి కావాలన్న నిబంధన కొందరికి వరంగా మారుతున్నదని, ఏసీబీకి పట్టుబడిన వారు తమ పలుకుబడిని ఉపయోగించి, రాజకీయ నేతల ద్వారా ఒత్తిళ్లు చేయించి ఉన్నతాధికారులు ప్రాసిక్యూషన్కు అనుమతివ్వకుండా చూసుకుంటున్నారనే చర్చ సైతం ఉన్నది. దీనివల్ల కేసులు ఏండ్ల తరబడి పెండింగ్లో పడిపోతున్నాయి. కొన్ని కేసులైతే కోర్టు విచారణకు వెళ్లకుండానే మూసివేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో ఒక్క రెవెన్యూ శాఖలోనే 50కి పైగా ఏసీబీ కేసులను మూసివేశారనే చర్చ ఉన్నది.

విచారణ ఆలస్యమవుతుండడంతో..

నిబంధనల ప్రకారం ఏసీబీ నివేదికపై ట్రాప్‌ కేసులో పట్టుబడ్డ వారిపై మూడు నెలల్లో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆరు నెలల్లో ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో నెలల తరబడి విచారణ సాగుతుండడంతో చాలా మంది తప్పించుకుంటున్నారనే చర్చ ఉన్నది. ఏడాదికి పైగా విచారణ కొనసాగితే కేసు వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాక్ష్యాలు తారుమారు కావడం, సాక్ష్యులు ఎటో వెళ్లిపోవడం, బాధితులు, నిందితుల మధ్య ఒప్పందాలు కుదరడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విచారణను ప్రభావితం చేయగలగడం.. ఇలా అనేక కారణాలతో కేసులు నీరుగారిపోతాయని పేర్కొంటున్నారు.

ఇలా చేస్తేనే ప్రయోజనం..

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1064 సేవలు ప్రస్తుతం 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయి. లంచం కోసం అధికారులు వేధిస్తే.. ఈ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏటేటా తమ ఆస్తిపాస్తులను రిటర్న్స్ రూపంలో చూపించాల్సి ఉండగా.. అది జరగడం లేదు. దీన్ని కచ్చితంగా పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడే అధికారులను శాశ్వతంగా ఉద్యోగం నుండి తీసివేసే చట్టం తీసుకురావాలనే డిమాండ్ సైతం ఉన్నది.

-ఫిరోజ్ ఖాన్,

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,

96404 66464

Tags:    

Similar News