‘నీట్’ ని నిలిపేయండి!
జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణ పట్ల, దేశ నలుమూలల్లోనూ విద్యార్థులు, తల్లిదండ్రులలో రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతుంది.
జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణ పట్ల, దేశ నలుమూలల్లోనూ విద్యార్థులు, తల్లిదండ్రులలో రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతుంది. జాతీయ స్థాయిలో ఎన్‌టీఏ నిర్వహించే నీట్ పరీక్ష, సేవ చేసే వైద్యుల కంటే ఎక్కువగా.. డబ్బును ఆశించే వైద్యులను మాత్రమే తయారు చేస్తున్నదన్న విమర్శలు ఎదుర్కొంటుంది. మనదేశంలో పేదవాడు డాక్టర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.
దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష నిర్వహణ పట్ల, దేశ నలుమూలల్లోనూ విద్యార్థులు, తల్లిదండ్రులలో రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతుంది. ఆ పరీక్ష నిర్వహణ పట్ల గడియారం తిరిగే కొద్దీ అనేక అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో తమిళనాడులో ర్యాంకుల్లో గందరగోళం కారణంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ నీట్ పరీక్షను తమ రాష్ట్రంలో అనుమతించబోమని తీర్మానించింది, ఇంటర్మీడియట్ మార్కుల ప్రాతిపదికన మెడికల్ సీట్లు కేటాయిస్తామని తేల్చి చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో పేలవ నిర్వహణ, నిర్లక్ష్యం, పేపర్ లీకేజీలు చూస్తే అనుమానాలు వాస్తవమని అనాల్సిందే.
పరీక్షకు రెండు రోజుల ముందు..
ప్రతీ సంవత్సరం ఇద్దరు లేదా ముగ్గురు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించే నీట్ పరీక్షలో ఈ సారి ఏకంగా 67 మంది ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దీంతో ఈ సంవత్సరం నీట్ పరీక్ష పెద్ద స్కాం అని ఆరోపణలూ ఎక్కువయ్యాయి. ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని, ఇతర దేశాల్లోని 14 నగరాల్లోని పరీక్షా కేంద్రాల్లో 23 లక్షల మందికి పైగా నీట్ అభ్యర్థులకు ఈ జరిగింది. కానీ దీనికి రెండు రోజుల ముందే 'నీట్ చీటింగ్ స్కాం' బయటకు వచ్చింది. ఈ స్కాం ప్రకారం ఓ ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని పరుశురాం రాయ్, స్కూల్ టీచర్ తుషార్ భట్ కలిసి నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా చేస్తామని గుజరాత్ కు చెందిన 16 మంది విద్యార్థులకు హామీ ఇచ్చి ఒక్కొక్కరి నుండి 10 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి, ఇక పరీక్ష రోజున కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
67 మందికి ఫుల్ మార్కులు..
మొదట నీట్ పరీక్ష ఫలితాలను జూన్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు. నిజానికి పరీక్ష నిర్వహణలో కొన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి ఫలితాలు ఆలస్యం కావాలి. కానీ చెప్పిన తేదీ కంటే పది రోజులు ముందే ఎన్నికల సమయానికి సరిగ్గా ఓ రోజు ముందు హడావిడిగా జూన్ 4న ఎలాంటి సమాచారం లేకుండా ఫలితాలు విడుదల చేశారు. ప్రతి సంవత్సరం ఒకరు లేదా ఇద్దరికి 720 మార్కులకు 720 మార్కులు వస్తే, ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులకు 720 కు 720 ఫుల్ మార్కులు వచ్చాయి, అందులో ఎక్కువ మంది ఉత్తర భారతదేశం నుంచే ఉన్నారు. ఇక టాప్ ర్యాంకర్స్‌లో 8 మంది హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాశారు. అదే పరీక్ష కేంద్రంలో 718, 719 మార్కులు సాధించిన విద్యార్థులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నీట్ పరీక్షలో 180 ప్రశ్నలుంటాయి, ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి, తప్పుడు జవాబుకు ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. ఏదైనా విద్యార్థి 180 ప్రశ్నలలో ఓ ప్రశ్నకు తప్పుడు జవాబు ఇస్తే 715 మార్కులు వస్తాయి, ఏదైనా విద్యార్థి ఓ ప్రశ్నను వదిలేసి 179 ప్రశ్నలకు సమాధానాలిస్తే 716 మార్కులు వస్తాయి కానీ కొందరు విద్యార్థులకు 718, 719 మార్కులు రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఎన్‌టీఏ వాదన అనుమానాస్పదం!
ప్రస్తుతం జరుగుతున్న వివాదంపై ఎన్‌టీఏ స్పందించి, పరీక్షలో సమయం కోల్పోయినట్లు అభ్యర్థనలు పంపిన విద్యార్థులకు జూన్ 13, 2018 కేసు నెంబర్ 551 సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా సమయం కోల్పోయిన వారికి గ్రేస్ మార్కులు ఇవ్వడం కారణంగా 718, 719 మార్కులు వచ్చాయనీ చెబుతోంది. ఎన్‌సీఈఆర్టీ పుస్తకం ప్రకారం ఓ ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉన్నాయనీ, రెండు ఆప్షన్లను సరైన వాటిగా ప్రకటించి, 44 మంది విద్యార్థుల మార్కులు 715 నుంచి 720కు పెంచామని వెల్లడించారు. అయితే,గ్రేస్ మార్కులు కలపడం గూర్చి పరీక్ష రాసిన 23 లక్షల మంది విద్యార్థులు ముందస్తుగా ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు.
పేదలకు వైద్య విద్య దూరమవుతుందా?
దేశవ్యాప్తంగా మెడిసిన్ చదువాలనుకునే విద్యార్థులకు ఒకే పరీక్ష కావడంతో అనేక సమస్యలు వెలుగుచూస్తున్నాయి, పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించే ఎన్‌టీఏ సంస్థను రద్దు చేయాలని, నీట్ ఎత్తివేయాలని, రాష్ట్రాలకే మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ అప్పగించాలని విద్యార్థులు గొంతు కలుపుతున్నారు. మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ ముందుకొచ్చింది. కొందరైతే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. కానీ ఫలితాల ప్రకటనను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసును తిరిగి సమీక్షించడానికి మాత్రం అంగీకరించింది. ఏదేమైనా మెరిట్ విద్యార్థులను ఈ స్కాం తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తోంది, ఆత్మహత్యలకు కారణమవుతోంది. సమానత్వం, సామాజిక న్యాయానికి తూట్లు పొడిచే నీట్ పరీక్షలు నిలిపివేయడమే మంచిది.
బి వీరభద్రం
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
94929 30835