ప్లాస్టిక్ లేని ప్రపంచం కోసం...

ప్లాస్టిక్ లేని ప్రపంచం కోసం... a world without plastic possible

Update: 2023-04-19 23:15 GMT

1970 ఏప్రిల్‌ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం అమెరికాలో జరిగింది. ప్రజలంతా ధరిత్రిని రక్షించుకునేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రమాణాలు చేసారు. ఇలా ప్రారంభమైన ఈ ఉత్సవం ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 1970 నుండి ప్రతియేటా ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అలాగే, 1992లో పర్యావరణ పరిరక్షణ కోసం యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ రియో డి జెనిరోలో ఎర్త్ సమ్మిట్ పేరుతో 178 ప్రపంచ దేశాలు పాల్గొని పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో మార్గదర్శకాలు రూపొందించారు.. ఎన్నో అగ్రిమెంట్‌లపై సంతకాలు చేశారు. దశాబ్దాలు గడిచాయి... అంతరించిపోతున్న జీవరాశులు... అంతరిస్తూనే ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూనే ఉంది. వివిధ దేశాలు మొక్కుబడిగా సమావేశాలు పెట్టి తీర్మానాలు చేసినంత మాత్రాన ఏమి సాధించేది లేదని తేలిపోయింది.

పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అణ్వాయుధీకరణ, ప్రపంచీకరణ, కంప్యూటరీకరణ వెరసి కాలుష్యంతో ధరిత్రి సతమతమవుతుంది. కాలుష్య ప్రభావంతో అనేక విపరీత పరిణామాలు కలుగుతున్నాయి. కాలుష్య నియంత్రణకు ఉద్దేశించిన వ్యవస్థలు చేతులు ముడుచుకొని కూర్చున్నాయి. అభివృద్ధి, నాగరికతల పేరుతో మనం కూర్చున్న కొమ్మనే మనం నరుక్కుంటున్నాము. ప్రపంచంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. యూజ్ అండ్ త్రో సంస్కృతి బాగా పెచ్చుమీరింది. ప్రతి వస్తువు ప్లాస్టిక్ మయం అయ్యింది. మానవుడి చర్యలకు పశు పక్ష్యాదులు బలి అవుతున్నాయి. ఆవులు, మేకలు, చేపలు ఇతర జంతు కాలం ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల అవి మరణిస్తున్నాయి.

భూమిపైనా, లోపలా విధ్వంసం

పెట్రోలియం ఉత్పత్తుల నుండి ఉత్పన్నమయ్యే ప్లాస్టిక్ అవశేషాలు సులభంగా విచ్ఛిన్నం కావు, అందుకే భూమిలో కలిసి పోవు. విచక్షణా రహితంగా చుట్టు పక్కల, మైదానాలలో, తమ పరిసరాలలో పాటు ఎక్కడ పడిలే అక్కడ ప్లాస్టిక్ ఉత్పత్తులను పారేయడం వల్ల గుట్టల కొద్దీ చెత్త పేరుకుపోతుంది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అధిక జనసాంద్రత గల నగరాలు, పట్టణాలు, దర్శనీయ స్థలాలు కాలుష్య కేంద్రాలుగా రూపొందుతున్నాయి. చివరికి ఈ వ్యర్థాలు సముద్రాలను చేరి, జలచరాలను జీవ కోటినీ అతలాకుతలం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో మానవులు చేస్తున్న ఘోర తప్పిదాలు మానవాళి మనుగడకే ముప్పు తెస్తున్నాయి.

భూమికి ప్లాస్టిక్ చేసే వినాశనం

నాలుగు దశాబ్దాల క్రితం ఏ ప్లాస్టిక్ వస్తువు కనిపించేది కాదు.. ప్లాస్టిక్ బిందెల రంగ ప్రవేశంతో మహిళలు సంబరపడిపోయారు...దానికి కారణం ఇత్తడి బిందెల బరువు మాయమైందని. 1907లో లియో హెండ్రిక్ బేక్ లాండ్ అనే శాస్త్రవేత్త ఈ ప్లాస్టిక్ రూపొందించారు. ఆయన రూపొందించిన ఈ ప్లాస్టిక్ ఇరవయ్యవ శతాబ్ది అంతానికి ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం గణనీయంగా పెరగడంతో పాటు ఎవరెస్ట్ నుండి సముద్ర గర్భం దాకా విస్తరించి అనంత జీవ కోటినీ అతలాకుతలం చేస్తూ జీవరాశి మనుగడకు పెనుసవాల్‌గా పరిణమించింది. ప్రతి పుట్టిన ప్రాణికీ ఒక జీవిత కాలం ఉంటుంది.. ప్రతి నిర్జీవికి, ప్రతి కృత్రిమ వస్తువుకి ఒక మనుగడ కాలం ఉంటుంది. ప్రాణ కోటి, సహజ నిర్జీవ పదార్థాలు కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోతాయి... అయితే ఈ మానవ తయారీ ప్లాస్టిక్ ఉత్పత్తుల జీవిత కాలం వందల సంవత్సరాలు. ఒక రకంగా చెప్పాలంటే ప్లాస్టిక్ ఒక అద్భుత ఆవిష్కరణ... ప్లాస్టిక్‌ను నాశనం చేయలేము కానీ వివిధ పునరుత్పత్తి వస్తువులను తయారు చేయవచ్చు. వాడేసిన ప్లాస్టిక్ భూమిలో కలిసిపోదు, కుళ్ళిపోదు. అయితే మానవుల విచక్షణా రహిత చర్యల మూలాన నీరు, భూమి, గాలి ఈ ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా కలుషితం అవుతున్నాయి.

ధరిత్రిని ఎలా రక్షించుకోవాలి

ఒక సారి బాధ్యతగా ఆలోచిద్దాం, కాలుష్య రహిత సమాజం వైపు అడుగేద్దాం. ప్లాస్టిక్ వినియోగం తప్పదు.. కానీ ఉపయోగించాక తగిన రీతిలో వాటిని పూడ్చిపెట్టాలి. రేడియో ధార్మికత పదార్థాలను ఎలా సంగ్రహిస్తారో అలా ప్రభుత్వాలు ప్లాస్టిక్ వృధాను సంగ్రహించాలి. లేదా పునర్ వినియోగానికి, ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించాలి. అతి తక్కువ మందం 50 మైక్రాన్ లకన్న తక్కువ మందం గల ప్లాస్టిక్ సంచులను వాడరాదు. వాటిని నిషేధించాలి. అవి రీసైక్లింగ్‌కి పనికి రావు.. కాలుష్యానికి పెద్దపీట వేస్తాయి. అలాగే వాడి పారేసే డిస్పోసబుల్ వాడ రాదు. సింథటిక్ వస్త్రాల బదులు కాటన్, ఉన్ని దుస్తులు ధరించాలి. ప్లాస్టిక్ వృధాతో రోడ్ల నిర్మాణం చేపట్టాలి. రీసైక్లింగ్ కి పనికి రాని ప్లాస్టిక్ వృధాను భూమి, నీరు కలుషితం కాకుండా పెద్ద పెద్ద గోతులలో పాతి పెట్టాలి. ఆసుపత్రి వ్యర్థాలను, జీవ సంబంధ వ్యర్థాలను సరిగ్గా నిర్వహించాలి. ప్లాస్టిక్ కి బదులు రాగి, గాజు, మట్టి పాత్రలను వాడాలి. మురుగు నీటిని శుద్ది చేసి వ్యవసాయ, ఉద్యాన వన నిర్వహణకు వాడాలి. నదులలోకి వ్యర్థాలను విడుదల చేసే వారికి కఠిన శిక్షలు విధించాలి. పరిశ్రమల లైసెన్సులు రద్దు చెయ్యాలి. స్వయంప్రతిపత్తి కలిగిన కాలుష్య నివారణ బోర్డ్ నిక్కచ్చిగా పని చేయాలి. వారికి విశేష అధికారాలు ఇవ్వాలి. అవినీతి అధికారుల శిక్షించాలి. ప్రతి పౌరుడు తాను ఉత్పత్తి చేసే వ్యర్థాలకి జవాబుదారి కావాలి. రేపటి తరాలకు ఒక జీవావరణం కలిగిన ధరిత్రిని అందించడం మన ముందున్న కర్తవ్యం. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చట్టాలు సరిగ్గా అమలు పరచాలి.

(ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం)

శిరందాసు శ్రీనివాస్

Tags:    

Similar News