తెలుగు రాష్ట్రాలకు విలువైన బడ్జెట్!

ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులు తెలుగు రాష్ట్రాలకు ఊరట కలిగించాయి. ఏపీకి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పూర్తి, వెనుకబడిన

Update: 2024-08-01 00:45 GMT

ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులు తెలుగు రాష్ట్రాలకు ఊరట కలిగించాయి. ఏపీకి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పూర్తి, వెనుకబడిన జిల్లాల ప్రగతికి చేయూత, పారిశ్రామిక అభివృద్ధికి సహకారం వంటివి అందించింది కేంద్రం. ఇక తెలంగాణకి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు నిధులు, అమృత్‌ పథకానికి, ఆవాస్ యోజన పథకాలకు నిధులు పెంపు, ఐటీ అప్‌గ్రేడేషన్, ఏకలవ్య పాఠశాలలకు భారీగా నిధులు కేటాయించారు. మొత్తంగా చూస్తే ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో కన్నా తెలంగాణకి అధికంగా కేటాయింపులు జరిగాయి.

భారతదేశం ప్రపంచంలోని అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. గత మూడు సంవత్సరాలుగా 8 శాతం నిరంతర వృద్ధి రేటు సాధించడం గర్వించదగిన విషయం. ఈ బడ్జెట్ రాబోయే ఐదేళ్లకు మార్గాన్ని నిర్దేశించటమే కాకుండా, 2047 నాటికి భారతదేశం స్వాతంత్ర్యం పొంది 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే సమయానికి అభివృద్ధి చెందిన భారత్‌గా రూపాంతరం చెందడానికి మార్గనిర్దేశకంగా ఉన్న అమృత్ కాల్ బడ్జెట్.

140 కోట్ల ప్రజల అమృత్ కాల్ బడ్జెట్

ఈ బడ్జెట్ వికసిత్ భారత్ కోసమని స్పష్టమవుతోంది. తొమ్మిది కీలక ఆవిష్కరణల ద్వారా, స్వల్పకాలిక ప్రాధాన్యతలను కోల్పోకుండా దేశ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడానికి ఇది రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. వికసిత్ భారత్ కలలో ప్రతి భారత పౌరుడు వాటాదారుగా ఉండేలా కేంద్ర‌ బడ్జెట్ నిర్ధారిస్తుంది. దీని ప్రకారం నిధులు అన్ని వర్గాల ప్రజల వద్దకు చేరుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న బహుముఖ సమస్యలు పరిష్కరించబడ్డాయి. రైతులు, మధ్యతరగతి, యువత, మహిళలు, ఎంఎస్‌ఎంఈలు, బలహీన వర్గాల వారందరినీ బడ్జెట్ ప్రకటనల్లో చేర్చటం హర్షణీయం. ఈ బడ్జెట్‌లో, సాహసోపేతమైన వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి ఊపందుకుంటుంది. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడంలో కీలకమైన వ్యవసాయరంగంపై వ్యయంలో పెనుగంతు ఉపశమనం ఇస్తుంది.

తెలుగు రాష్ట్రాలపై వివక్ష లేదు!

ఈ బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాలకు విలువైనది. విభజన అనంతరం గత పదేళ్లలో ఈసారి కేంద్ర బడ్జెట్లో జరిగిన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్‌కి ఊరట కలిగించేవిగా ఉన్నాయి. రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పూర్తి, వెనుకబడిన జిల్లాల ప్రగతికి చేయూత, పారిశ్రామిక అభివృద్ధికి సహకారం తదితర నిర్ణయాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సహకారం ఉందనే సంకేతం స్పష్టమయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించడమే కాకుండా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం శుభపరిణామం. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది 15 వేల కోట్లు రూపాయలు కేటాయించడం, దేశీయ విదేశీయ ఏజెన్సీల ద్వారా ఆర్థిక వనరులను రాజధాని నిర్మాణానికి సమకూరుస్తామని ప్రకటించడం హర్షణీయం. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక వాడల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు సమకూర్చడం ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు రావడానికి ఈ బడ్జెట్ ఊతం ఇస్తుంది.

ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి వస్తే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు నిధులు, అమృత్‌ పథకానికి నిధుల పెంపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు పెంపు, మారుమూల ప్రాంతాలకు రోడ్లు, రాష్ట్రంలో ఐటీ అప్‌గ్రేడేషన్, థీమ్ బేస్ట్ టూరిస్ట్ సర్క్యూట్లకు నిధులు, ఏకలవ్య పాఠశాలలకు భారీగా నిధులు, జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో కన్నా తెలంగాణకి అధికంగా కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది.

భారీగా రైల్వే కేటాయింపులు..

ఇక రైల్వే కేటాయింపులు గమనిస్తే, ఈ బ‌డ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రైల్వేల‌కు భారీగా నిధులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించారు. వంద శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగింది. రూ.73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగు తున్నాయి. అమృత్‌ పథకం కింద 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతుంది. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. అమరావతిని అనుసంధానిస్తూ 56 కి.మీ మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు కేటాయింపు. ఇక విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తదితర అంశాలు ఆంధ్రప్రదేశ్‌కి దక్కాయి. తెలంగాణకి వస్తే తెలంగాణలో రైల్వే లైన్ల విద్యుద్దీకరణ వంద శాతం పూర్తయింది. రూ.32,946 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అమృత్‌ పథకం కింద 40 రైల్వే స్టేషన్లు పూర్తిగా అభివృద్ధి జరిగాయి. తెలంగాణ పూర్తిగా 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే లైన్లు ఉన్న రాష్ట్రంగా రూపాంతరం చెందింది. 437 అండర్ పాస్ ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ నిర్మాణ ప‌నులు పూర్తి అయ్యాయి. మొత్తంగా చూస్తే తెలంగాణకు రైల్వే బడ్జెట్ రూ. 5,336 కోట్లు కేటాయించడం హర్షణీయం.

-రవికాంత్ నూతలపాటి

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

97044 44108

Tags:    

Similar News