సిద్దిపేటలో జరిగిన ‘జీవనహిందోళం’ పుస్తకావిష్కరణకు వెళ్ళాను. బంధుమిత్రులతో, సాహితీ బంధువులతో సభ కిక్కిరిసింది. సభానంతర భోజన కార్యక్రమం ఆత్మీయంగా సాగింది. తన తండ్రి గారి పట్ల గల భక్తిశ్రద్దలకు, ప్రేమానురాగాలకు ఆనాటి సభ ఒక సాక్ష్యం. ప్రొఫెసర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి తన తండ్రి ప్రసిద్ధ అవధాని గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ శర్మ ‘జీవితం-అవధానం’ అనే అంశాలను ప్రాతిపదికగా చేసుకొని జీవన హిందోళం అనే పుస్తకాన్ని రచించారు. ఈ జ్ఞాపకమంతా ఆనాటి వేడుక గురించి పుస్తకం చదివాక చాలా విషయాల్లో తండ్రీ కొడుకులకు గల సారూప్యత గోచరించి ఆశ్చర్యపోయాను. అందుకే మూర్తి జీవన హిందోళం రాయగలగాడనిపించింది. ఆత్మకధ, జీవిత చరిత్ర రెంటి లక్షణాల్ని మేళవించి రాసిన జ్ఞాపిక ఇది.
బాలశ్రీనివాస్‌కి కాలక్షేపం గిట్టదు. సొల్లుకబుర్లు ఉండవు. దాని పర్యవసానంగా కరోనాకాలంలో జీవన హిందోళం పలికింది. తన తండ్రి ఘనపాఠి అని తెలుసు కనుకనే ఆస్తిపాస్తులకు బదులు ఆత్మకథ చెప్పమని అడిగాడు. తాత, తండ్రుల నుండి నరసింహశర్మ గారికి ఆస్తిపాస్తులు అందలేదు. ఆ స్థితి నుండి బాలశ్రీనివాస్ కోరిక పుట్టింది. తండ్రి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు. తను విశ్వవిద్యాలయ ఆచార్యుడు బోధన వీరి జీవలక్షణం. అపశబ్దాల్ని, విషమోచ్చారణను విని సహించలేని లక్షణం తండ్రిది. సంపాదకుడిగా అక్షర దోషాల్ని సరిచేసి, వాక్యాన్ని సరిదిద్దిన ఘనత కుమారుడిది. అవధానిగా ఆనౌచిత్యాన్ని గుర్తించడంలో శర్మగారిది సునిశిత దృష్టి. మూర్తి విమర్శ వ్యాసాల్లో ఈ లక్షణం పుష్కలం. సమస్యాపూరణం, అప్రస్తుత ప్రసంగాలకు శర్మగారు ఇచ్చిన జవాబులు చమత్కారంగా ఉండేవి. ప్రధాన వక్తగా మూర్తిమాటలు సభారంజకంగా ఉండేవి. అవధానం కోసం తండ్రి, ప్రసంగం కోసం కొడుకు దూరభారాన్ని లెక్కచేయక వెళ్ళడం తెలిసినదే.
ఊర్లలో పౌరోహిత్యం అదనపు ఆధారం. దీన్ని తెలంగాణ బ్రాహ్మలు అద్భుతంగా సంస్కృతీకరించి ‘గ్రామాశ్రయత్వం’ అనే పేరును దాఖలు చేశారు అనే వాక్యం మూర్తిగారి పరిశోధనా దృష్టిని పట్టిస్తుంది. అన్నా, అక్కా, తమ్మి అంటూ పిలిచే మూర్తి తండ్రిలాగే కలుపుగోలు మనిషి. చేస్తున్న పని పట్ల, నమ్మిన భావనల పట్ల ఇద్దరికీ ఒకే రకమైన అంకితభావం ఉంది. నాన్నది నిర్మలమైన సాహిత్య వాతావరణం అంటాడొకచోట. తన చుట్టూ ఉన్న వాతావరణంలో ఇతడు నిబద్ధంగా, నిర్మలంగా ఉన్నాడు. వెనకటివాళ్ళు ఉన్నంతలో సహాయం చేసేవాళ్ళు, లేకుంటే మాటసాయం అయినా చేసి వ్యవహర్తలుగా జీవించారు. ఈ లక్షణం తండ్రీ కొడుకులలో కనబడింది.
తండ్రి అవధాన పరంపర అప్రతిహతం. తనయుడి ప్రసంగపాటవం శిఖర సమానం. సంపాదకులకు రచయితల కంటే ఎక్కువ తెలివితేటలుండాలి అని శర్మ అభిప్రాయం. దాన్ని మూర్తి రుజువుపరిచారు. ప్రతిభా పురస్కారాలు ఇద్దరినీ వరించాయి. మెప్పుపొందిన అవధాని ఒకరు. ఖ్యాతిగాంచిన వక్త మరొకరు. తండ్రి పంచ కావ్యాలను రచించాడు. విమర్శ, జీవిత చరిత్ర, ఆత్మకథ, సంపాదకత్వాలను ఒంటిచేత్తో నడిపిన మూర్తి తండ్రికి తగ్గ తనయుడు. ‘నువ్వు నాకన్నా ఎదగాలి’ అని ఆకాంక్షించిన తండ్రి మాటను నిజం చేసి చూపించాడు.
బాలశ్రీనివాసమూర్తిలో నాకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. అన్నా అని నోరారా పిలిచాడు. నా రచనల్నీ, నన్ను అమితంగా ఇష్టపడేవాడు. 2021 సంవత్సరంలో వెలువడిన 'జీవన హిందోళం'కు ఆ సంవత్సర గండ్ర హన్మంతరావు స్మారక పురస్కారం వరించింది. అది తెలిసి సంతోషించాడు. ఒకసారి బాలన్న కామారెడ్డి బస్టాండ్‌లో కలిసాడు. ఆ కొద్ది సమయంలో ఎన్నో సాహిత్య విషయాల్ని పంచుకున్నాము. కాలాన్ని, కష్టాల్ని అధిగమించి ఉన్నత స్థాయికి ఎదిగిన ధీరుడు. అన్ని విషయాల్లో తండ్రిని మించిన తనయుడిగా నిలిచాడు. బతికిన కాలం చూస్తే వెనకబడ్డాడు. తండ్రిది సుమారు డెబ్బయి ఆరు సంవత్సరాల జీవితకాలం. తనయుడిది సుమారు యాభై ఏడు సంవత్సరాల బతుకుపోరు. అలసి నిష్క్రమించావా మిత్రమా? ఇలా రాయాల్సివస్తుందని అనుకోలేదు.
కాలం కాటుకు బలియైన మిత్రమా, నీకు కన్నీటి నివాళి.
డా. బి.వి.ఎన్. స్వామి,
92478 17732