అక్షర కర్షకుడు కాళోజీ
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా !? అన్ని భాషలు నేర్చుకో, నీ మాతృభాషను తప్పకుండా నేర్చుకో' అని
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా !? అన్ని భాషలు నేర్చుకో, నీ మాతృభాషను తప్పకుండా నేర్చుకో' అని చెప్పిన మహానుభావుడు కాళోజీ నారాయణరావు. ఆదర్శవాది, మానవతావాది. సృజనశీలి. సామాజిక తత్వవేత్త, ఆలోచనాపరుడు, దార్శనికుడు. ఎల్లకాలాలలో ప్రజాకవిగా కానవచ్చే నిష్టాగరిష్టుడు. పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామరాజ్ కాళోజీ. కర్ణాటక రాష్ట్రంలోని రట్టహళ్లి గ్రామంలో 9 సెప్టెంబర్ 1914 న జన్మించారు. తెలుగు ప్రజలకు ఆయన 'కాళన్న' గా సుపరిచితులు.
వ్యవహారిక భాషతో
కాళోజీ రాజకీయ, సాంఘిక చైతన్యం కలిగి హక్కులడిగిన ప్రజల మనిషి. విద్యార్థి జీవితం నుంచే విప్లవ స్పృహ కలిగిన ఉద్యమ జీవి. తెలంగాణ జీవిత చలనశీలి. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి. పుట్టుక, చావులు కాకుండా, బతుకంతా తెలంగాణకు ఇచ్చిన మహనీయుడు. ఆయన సేవలను గుర్తించి కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో గౌరవించింది. 1992లో కేంద్రం 'పద్మభూషణ్'ను ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ప్రభుత్వం కాళోజీ నారాయణరావు శతజయంతి సందర్భంగా 9 సెప్టెంబర్‌ని 'తెలంగాణ భాషా దినోత్సవంగా' ప్రకటించింది.
2015 నుంచి సాహితీవేత్తలకు కాళోజీ పురస్కారాలను అందజేస్తోంది. కాళోజీ తెలంగాణ భాష, యాసను తరతరాలకు తెలియజేసే విధంగా అనేక రచనలు చేశారు. ఇంగ్లిష్, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషలలోనూ ఆయన రచనలు కొనసాగాయి. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో దిట్ట. తన కవితల ద్వారా తెలంగాణ ప్రజల ఆవేదనను, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. 'నా గొడవ' సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను నిర్మొహమాటంగా ప్రస్తావించారు. పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా నిలిచారు.
నిరంతర చైతన్యం
తన కవిత్వాలు, గేయాలతో ప్రజలను నిద్ర లేపిన చైతన్యశీలి కాళోజీ. తెలంగాణ యాసపై విపరీత అభిమానం. అందుకే ఆయన ధిక్కార స్వరమంతా తెలంగాణ మాండలికంలోనే సాగింది. 'బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష గావాలె'నని నినదించిన అక్షర కర్షకుడు. 'నేను ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని' అంటూ ఒక్కమాటలో తన వస్తుతత్వాన్ని చెప్పారు. 'నవ యుగంబున నాజీ నగ్న నృత్యం ఇంకెన్నాళ్లు? హింస పాపమని ఎంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్లు?' అంటూ నిలదాశారు. 'అన్నపు రాశులు ఒకచోట, ఆకలి చావులు ఒకచోట' అంటూ బడుగులకు బాసటగా నిలిచి, భూస్వామ్యవాదాన్ని తిరస్కరించిన ప్రజావాది. ఆయనది కమ్యూనికేటివ్ కవిత్వం. రక్త మాంసాలున్న మనుషులందరికి అర్ధమయ్యే భాష ఆయనది.
'అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు' అని తేల్చి చెప్పిన కలేజా కాళోజీది. మొహమాటం లేకుండా తన అభిప్రాయం జీవితంలోనూ. కవిత్వంలో చెప్పేవారు. 'దోపిడి చేసే ప్రాంతేతరులను తన్ని తరుముతం, ప్రాంతంవారే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం' అని హెచ్చరించారు. విశిష్ట కవి కాళోజీ నారాయణరావు గారికి శత సహస్ర వందన చందనములతో తెలంగాణ సాహిత్య కళాపీఠం 'కాళన్న యాదిలో' 226 మంది కవులతో కవితా సంకలనం వెలువరించింది. 12 మంది తెలుగు ప్రముఖులకు 'ప్రజాకవి కాళోజీ జాతీయ పురస్కారాల'కు ఎంపిక చేసి, 28 ఆగస్టు 2022న సిద్ధిపేటలో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అందించింది. కాళోజీ 13 నవంబర్ 2002న భౌతికంగా ఈ నేలను వీడినా, ప్రతి తెలంగాణ వాడి గుండెలో బతికే ఉంటారు.
Also Read : ప్రభుత్వానికి కాళోజీపై ఎందుకింత కక్ష!
Also Read : తెలంగాణ భాషకు పట్టమెపుడు?
(నేడు కాళోజీ జయంతి)
దాసరి (జంగిటి) శాంతకుమారి
వ్యవస్థాపక అధ్యక్షురాలు
తెలంగాణ సాహిత్య కళాపీఠం
బొప్పాపూర్, సిద్దిపేట జిల్లా
96524 83644