ప్రత్యేక ల్యాండ్ ట్రిబ్యునల్ అవశ్యం

తెలంగాణ రాష్ట్రంలో వివిధ భూ వివాదాలకు సంబంధించి అనేక చట్టాలు, అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పడి తమ పరిధిలో వాటిని పరిష్కరిస్తున్నాయి.

Update: 2024-06-18 00:00 GMT

తెలంగాణ రాష్ట్రంలో వివిధ భూ వివాదాలకు సంబంధించి అనేక చట్టాలు, అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పడి తమ పరిధిలో వాటిని పరిష్కరిస్తున్నాయి. కానీ ధరణి పోర్టల్ అవకతవకలతో సహా అనేక భూ వివాదాలను పరిష్కరించడానికి ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చాలా అవసరం. స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు ద్వారా చిత్తశుద్ధితో పనిచేస్తే తక్కువ కాలంలోనే అన్ని భూ వివాదాలను పరిష్కరించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పుద్వారా తగు చర్యలు చేపడితే లక్షలాదిమంది రైతులకు న్యాయం జరుగుతుంది.

గత ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన తెలంగాణ రికార్డ్స్ ఆఫ్ రైట్స్, పట్టాదారు పాసు పుస్తకం చట్టం, 2020 ముందు ఆర్ఓఆర్‌కి సంబంధించిన భూ వివాదాలన్నీ రెవిన్యూ కోర్టుల ద్వారా పరిష్కృతమయ్యేవి. అలాగే ఇనాం భూములకు, టెన్నసీ భూములకు, ఇతర భూముల వివాదాలు పరిష్కరించడానికి ఆయా చట్టాల ద్వారా సంక్రమించిన అధికారాల ప్రకారం, ఆయా స్థాయి అధికారులు విచారణ జరిపి పరిష్కరించేవారు. అయితే నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ యాక్ట్ 2020 ద్వారా రెవిన్యూ కోర్టులను రద్దు చేయడమే కాకుండా, పాత చట్టమైన ఆర్ఓఆర్ యాక్ట్ 1971 ప్రకారం వివిధ స్థాయిల్లో పెండింగులో ఉన్న కేసులను, స్పెషల్ ట్రిబ్యునల్‌కు బదిలీ చేశారు. ఈ స్పెషల్ ట్రిబ్యునల్స్ సరిగ్గా కేసులను పరిష్కరించలేదు. అంతే కాకుండా 7-9-2020 నాడు సీసీఎల్ఏ గారు జారీ చేసిన మెమోను ఆసరాగా చేసుకుని రెవిన్యూ అధికారులు ఆర్ఓఆర్ చట్టం, ఇతర చట్టాలకు చెందిన కేసులపై కూడా విచారణ చేపట్టలేదు. అయితే గౌరవనీయ హైకోర్టులో కొన్ని కేసులలో ఇచ్చిన ఆదేశాల మేరకు అలాంటి కేసులపై ఇప్పుడు విచారణ జరుపుతున్నారు.

వెసులుబాటు లేని కొత్త చట్టం

అయితే గత చట్టం యాక్ట్ 1971 ప్రకారం అనేక భూవివాదాలు పెండింగులో ఉండగా, కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టం 2020 ద్వారా జరిగే అన్యాయాలను పరిష్కరించుకోవడానికి, కొత్త చట్టంలో ఎలాంటి వెసలుబాటు కల్పించకపోవడంతో గౌరవ హైకోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇలా అనేక కేసుల ద్వారా హైకోర్టుపై అధిక భారం కలుగుతుంది. ఏదైనా అన్యాయం జరిగితే చట్టంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వెసులుబాటు నూతన చట్టంలో అవకాశం లేకపోవడం శోచనీయం. అంతేకాక 14 సంవత్సరాల తర్వాత కూడా ఆ చట్టానికి ఇంతవరకు రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడం మరింత శోచనీయం. ఇదిలా ఉండగా, ధరణి పోర్టల్ ద్వారా జాయింట్ సబ్ రిజిస్ట్రార్/తహసిల్దార్‌లు చేస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా అన్యాయానికి గురైన వారికి, అలాగే ధరణి పోర్టల్ పార్ట్-బి కి సంబంధించిన భూవివాదాల భూములకు ఇంతవరకు మార్గదర్శకాలు రూపొందించక పోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరం అవుతోంది.

పెండింగులో లక్షల దరఖాస్తులు

ధరణి పోర్టల్ ద్వారా వివాద రహిత భూములకు (పార్ట్-ఏ కి సంబంధించినవి) జారీ చేసిన పాస్ బుక్‌లో, పోర్టల్‌లో ఎంట్రీస్ సరిచేసుకోవడానికి ఎన్నో మోడ్యుల్స్ ప్రవేశపెట్టినా ఇంకా కొన్ని లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఒక రకంగా నూతన చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం భూరికార్డులు గందరగోళంగా తయారవడంతో అర్హులయిన రైతులకు సరైన న్యాయం దొరకకపోవడంతో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను పొందలేకపోతున్నారు.

ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు తప్పనిసరి

రాష్ట్రంలోని పట్టా భూముల (వివాదంలో ఉన్నవి) విస్తీర్ణంతో పోలిస్తే దేవాదాయ శాఖ, వక్భ్ బోర్డుకు సంబంధించిన భూవివాదాల విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడానికి, ఎండోమెంట్ ట్రిబ్యునల్, వక్ఫ్ ట్రిబ్యునల్ ఉన్నాయి. అలాగే లేఅవుట్స్ మరియు బిల్డింగ్ పర్మిషన్స్‌కి రేరా చట్టం, దానిపై అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ ల్యాండ్ ట్రిబ్యునల్స్ లేకపోవడం అత్యంత శోచనీయమైన విషయం. విశ్రాంత జడ్డి, మరియు విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ లేదా స్పెషల్ గవర్నమెంట్ డిప్యూటీ కలెక్టర్‌లతో కూడిన స్పెషల్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేసి, అన్ని భూ వివాదాలను, (ధరణి పోర్టల్‌లో జరిగిన అవకతవకలను కూడా) రోజువారీ ప్రొసీడింగ్స్ ద్వారా ఒక సంవత్సరలో అన్ని భూవివాదాలను పరిష్కరించే అవకాశం ఉంటుంది. స్పెషల్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పుపై హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించే విధంగా, చట్టంలో మార్పులు తీసుకువస్తే తప్ప, ప్రస్తుతం భూవివాదాలకు, కొత్తగా వచ్చే భూ వివాదాలకు మోక్షం దొరకదు. స్పెషల్ ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు విషయంలో ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పు చేసి తగు చర్యలు తీసుకునే విధంగా ముందడుగు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే రైతుల ధర్మాగ్రహాన్ని చూడవలసి ఉంటుంది.

- సురేష్ పోద్దార్

విశ్రాంత సంయుక్త కలెక్టర్,

80080 63605


Similar News