ఏడు దశాబ్దాల కళాఖండం.. 'దేవదాసు'

Update: 2023-06-09 23:30 GMT

"జగమే మాయ.. బ్రతుకే మాయ.. వేదాలలో సారమింతెనయా..", "పల్లెకు పోదాం.. పారును చూద్దాం చలో చలో..", "అంతా భ్రాంతియేనా..", 'కల ఇదనీ, నిజమిదనీ తెలిసెనులే బ్రతుకింతేనని' కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..

ఈ పాటలు ఏ సినిమాలోనివని వర్తమానంలో ఎవరిని అడిగినా చెబుతారు. అంతగా ఈ పాటలు జనంలో నిలిచిపోయాయి. గీత రచయిత సముద్రాల, సంగీతం సి.ఆర్. సుబ్బరామన్‌లను నేటికీ లక్షల మంది హృదయాల్లో నిలిపిన ఈ గీతాలున్న చిత్రం 'దేవదాసు'. 'వినోదా' పతాకంపై డి.ఎల్. నారాయణ నిర్మించగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. 'దేవదాసు' బెంగాలీ నవల. రచయిత శరత్ చంద్ర చటర్జీ. శరత్ అంటే మనందరికీ తెలుసు. శరత్ నవలలు తెలుగులో సినిమాలుగా వచ్చి విజయం సాధించాయి. ఆ రోజుల్లో తెలుగువారిని మీకు ఇష్టమైన తెలుగు రచయిత ఎవరని అడిగితే శరత్ అనే టక్కున చెప్పేవారు. అంతగా ఆయనను తెలుగువారు మమేకం చేసుకున్నారు.

ఎవరీ శరత్..

వానలో తడియని వారు, శరత్ రచనలు చదవని తెలుగు పాఠకులు లేరంటే అతిశయోక్తి కాదు. శరత్ రచనల్లో దేవదాసు 'ఒక లిరిక్' వంటిది. నిజానికి ఈ రచన చేసిన తరువాత ('కన్యాశుల్కం' రచించిన గురజాడ వారిలా) శరత్‌కు సహితం 'నవల' పట్ల సదాభిప్రాయం లేదు. చెడును ఆకర్షణీయంగా చిత్రించి తప్పు చేశానేమోనని చింతించాడు. అతనికి దేవదాసు రచన ప్రచురించడం కూడా ఇష్టం లేదు. కానీ ఆయన మిత్రుడు సౌరేంద్ర చటర్జీ శరత్‌కు తెలియకుండా 'దేవదాసు' నవలను 'యమునా' అనే పత్రికకు పంపారు. ప్రచురణ జరిగింది. అటు బెంగాలీ, ఇటు తెలుగు పాఠకులు బ్రహ్మరథం పట్టారు. శరత్ చంద్ర చటర్జీ 1876 వ సంవత్సరంలో సెప్టెంబర్ 15వ తేదీన బెంగాల్లోని 'హుగ్లీ' జిల్లాలోని దేవానందపురం అనే కుగ్రామంలో జన్మించారు. తండ్రి మోతిలాల్ ఛటోపాధ్యాయ.తల్లి భువన మోహిని దేవి. దేవదాసు రచనలో పూర్వభాగం అంతా శరత్ బాల్య జీవితమే...

ఎన్ని దేవదాసులు..

ఎన్నో దేవదాసులు విఫల ప్రేమను అందంగా అందరూ మెచ్చుకునే విధంగా శరత్ దేవదాసు ఉంటుంది. అంతే వ్యధతో చిత్ర పరిశ్రమ 'దేవదాసు'ను ప్రేక్షకుల దగ్గరకు చేర్చింది. ఐదు భాషల్లో 12 (ఒక మూకీతో కలిపి) చిత్రాలు వచ్చాయి. 1935 నుంచి 2002 వరకు వచ్చిన అన్ని 'దేవదాసులు' ప్రేక్షకులను అలరించాయి. భగ్న ప్రేమికులకు బ్రాండ్ అంబాసిడర్‌గా 'దేవదాసు' పాత్రను చిరంజీవిని చేశారు పాఠకులు, ప్రేక్షకులు. ఇదే అలవరసలో వచ్చిన అనేక చిత్రాలు (దేవదాసు మళ్లీ పుట్టాడు నుంచి ప్రేమాభిషేకం) విజయం కావటం విశేషం.

దేశం మెచ్చిన తెలుగు 'దేవదాసు'..

తెలుగు 'దేవదాసు' మాత్రం దేశం మెచ్చిన సినిమాగా నిలిచింది. దిలీప్ కుమార్ వంటి నటులు సహితం అక్కినేని నాగేశ్వరరావు నటనను మెచ్చుకున్నారు. ఈ క్రెడిట్ దర్శక నిర్మాతలదేనని చెప్పాలి. ముఖ్యంగా శరత్ చంద్ర కలం నుంచి పుట్టిన' దేవదాసు' ఆత్మను వేదాంతం రాఘవయ్య అందిపుచ్చుకున్నట్లుగా మరో భాషా దర్శకుడు పట్టుకోలేదంటే అతిశయోక్తి కాదు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రులను మాత్రమే దేవదా పార్వతీలుగా జనం గుర్తించారు. గుండెల్లో పెట్టుకున్నారు. పాటలు, సంగీతం, ఛాయాగ్రహణం వంటివి... రామాపురంకు దేవదాసు వర్షంలో ప్రయాణమవ్వటం, చంద్రముఖి నుంచి దేవదాసు వీడ్కోలు తీసుకోవడం, దేవదాసు మరణం వంటి సన్నివేశాలు గుండెను నలిపేసే విధంగా వేదాంతం చిత్రించిన తీరు 'నభూతో'…అనక తప్పదు. వేదాంతంలోని దర్శక ప్రతిభను అన్ని కోణాల నుంచి వెలికి తీసిన చిత్రం 'దేవదాసు'. ఈ చిత్రం తర్వాత వేదాంతం వారి 'అన్నదాత' చిత్రం పరాజయం పాలైంది. దేవదాసు విజయానికి అదృష్టం కూడా తోడైందనే సినీ విమర్శకులు ఉన్నారు.

విఫల ప్రేమకు నైతిక విజయం..

'దేవదాసు' చిత్రం 1953 జూన్ 26వ తేదీన విడుదలైంది. గొప్ప విజయాన్ని అందుకుంది. నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా అనేక చానల్స్ ప్రసారమవుతూ నేటికీ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నది. “ఏముంది చిత్రంలో” అని ప్రశ్నించుకుంటే- 'పసుపు తాడు కట్టినంత మాత్రాన వివాహం కాదని, విఫల ప్రేమకు నైతిక విజయం ఉందని' చెప్పిన శరత్ అంతరంగ కథనాన్ని అంతే ఉదాత్తంగా చిత్రించారు వేదాంతం రాఘవయ్య. అక్కినేని, సావిత్రి, పేకేటి, లలిత, (రాగిణి, పద్మిని, లలిత సిస్టర్స్) ఎస్.వి.ఆర్., సి.ఎస్.ఆర్., ఆర్.నాగేశ్వరరావు, అన్నపూర్ణ వంటి నటుల నటనా ప్రతిభ, సముద్రాల పాటలు, సుబ్బరామన్ సంగీతం, లలిత నాట్యం, ఘంటసాల గాత్రం, ఛాయాగ్రహణం, (బి.ఎస్.రంగా) తదితర సాంకేతిక నిపుణుల నైపుణ్యం వెరసి 'దేవదాసు' విజయం.

పాటకు పట్టం కట్టిన దేవదాసు..

'దేవదాసు' విషయంలో ప్రధాన పాత్ర పాటలదే. ఘంటసాల, లీల తదితరుల గాత్రం, సముద్రాల (వీరి వెనుకనున్న మల్లాది వారి నీడ), సి. ఆర్. సుబ్బ రామన్ వంటి వారి 'ఘనత' విస్మరించలేనిది. ప్రముఖ సంగీత విమర్శకులు, విశ్లేషకులు వి. ఏ.కె.రంగారావు చెప్పిన ముచ్చట ఒకటి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. దేవదాసు చిత్రం కోసం రికార్డు చేసిన 'ఏరు నవ్విందోయ్.. ఊరు నవ్విందోయ్' అనే గీతం చిత్రంలో లేదు. పాడినవారు మాధవ పెద్ది సత్యం. ‘ఎందుకు లేదు’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. విచిత్రం ఏమిటంటే ఇదే గీతాన్ని అనిశెట్టి వారి రచన 'పల్లెపడుచు' (నాటకం)ను సినిమాగా తీసి, అందులో పెట్టుకున్నారు నిర్మాత బోళ్ళ సుబ్బారావు. ఇది ఆయన ప్రథమ ప్రయత్నం. చిత్రసీమ 'విచిత్ర' సీమ కూడా అనేందుకు ఇదో ఉదాహరణ.

ఏడు దశాబ్దాలు గడిచినా, మరో పది దశాబ్దాలు గడిచినా తెలుగు 'దేవదాసు' అజరామర దృశ్య కావ్యంగా నిలిచి ఉంటుందటంలో సందేహం లేదు. శరత్‌ను తెలుగు రచయిత గానే గుర్తిస్తారు.

భమిడి పాటి గౌరీశంకర్

94928 58395





Similar News