విషాదం ఆలపించిన నవజీవన గీతం ‘2018’
A 2018 film, a realistic treat from Kerala
'ప్రకృతిని మనం ఎంత దెబ్బతీస్తే ప్రకృతి కూడా మనల్ని అంత గట్టిగా దెబ్బతీస్తుంది.' ఇది '2018' సినిమాలో వినిపించే తొలి డైలాగ్. ప్రకృతిపై పైచేయి సాధించామని వ్యవస్థ విర్రవీగి ప్రకృతిని ధ్వంసం చేసిన ప్రతి దిశలోనూ ఆ ప్రకృతి తన ప్రతీకారాన్ని ఏ స్థాయిలో తీర్చుకుంటుందో చూపిన సినిమా 2018. విషాదకరమైన అంశం ఏమిటంటే వ్యవస్థ చేసే ప్రతి తప్పుకూ, ప్రతీ ప్రకృతి విధ్వంసానికి బలయింది, బలవుతున్నది సామాన్యులే మరి. ప్రకృతిని ఇష్టం వచ్చినట్లుగా ధ్వంసం చేస్తున్న పాలకవర్గాల దుర్నీతికి ప్రపంచవ్యాప్తంగా జనమే బలవుతున్నారు. ప్రకృతి ప్రకోపించినప్పుడు 2018లో కేరళలో సంభవించిన ఆ విధ్వంసం కొన్ని తరాలపాటు అక్కడి ప్రజలు మర్చిపోలేరు. నాలుగేళ్ల క్రితం కేరళ సమాజాన్ని క్రక్కదిలించివేసిన వాస్తవ ఘటనకు అద్దం పట్టిన నిరుపమాన చిత్రం '2018'.వందల మంది ప్రాణాల్ని హరించిన 2018 నాటి వరదల్ని తలచుకుంటే కేరళ ప్రజలు ఇప్పటికీ ఉలిక్కిపడతారు. వాళ్లందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా తీయడమే ఈ సినిమా అసామాన్య విజయానికి కారణం. ప్రతి వర్షాకాలంలోనూ దేశంలో ఏదో ఒక రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ కోణంలో చూసినా ఇది అందరికీ కనెక్ట్ అయ్యే అంశమే.
మానవ జీవితాన్ని, ఘోరమైన కష్టంలో చిక్కుకున్న సామూహిక జీవన విషాదాన్ని ఇంత పరిపూర్ణంగా చూపించడం సినిమా కళకు సాధ్యమవుతుందా? అనేది చాలా కాలంగా నా సందేహం. కానీ 2018 సినిమా చూశాక వినమ్రంగా నా అభిప్రాయం తప్పు అని ఒప్పుకుంటున్నాను. సినిమా అంటే కల్పన అని అందరి భావన. కానీ తుఫాన్ బీభత్సాన్ని ఆ బీభత్సంలో చిక్కుకున్న ఒక మారుమూల సమాజ జీవితాన్ని ఇంత సహజంగా, ఇంత సమగ్రంగా, ఇంత వాస్తవికంగా చూపించడం సాధ్యమేనని '2018' సినిమా మనందరి అనుభవంలోకి తీసుకొచ్చింది.
కేరళ ప్రకృతి సౌందర్యాన్ని ఈ సినిమా తొలి షాట్‌లోనే ఎంత గ్రీనరీగా, సహజాతిసహజంగా చూపారంటే జీవిక కోసం ప్రయత్నంలో పల్లెలకు దూరమైన మనం మళ్లీ పల్లెను చూస్తున్న సంతోషం ముప్పిరిగొంటుంది. సముద్రం మధ్యలో ప్రాణాలు దక్కవని అర్థమై జాలరి వేసే గావుకేకలు గుండె జలదరింప జేస్తాయి. సముద్రంపై మృత్యు హేల ఇంత భయంకరంగా ఉంటుందా అని వణుకు పుడుతుంది. సుదూరంలో లైటు వెలుతురు కనిపిస్తే చాలు.. ఇక బతికిపోయినట్లే అంటూ ఆ వ్యక్తి పెట్టే అరుపులు, సముద్ర కల్లోలం ఏ హాలీవుడ్ సినిమాలోనో చూస్తున్నట్లు భీతావహంగా కనిపిస్తుంటే ప్రాణం పిడచకట్టుకుపోతుంది మనకు. సినిమా మొత్తంగా వెంటాడే వాన శబ్దం క్షణ క్షణం రాబోయే ఉత్పాతాన్ని తలపింపజేస్తూ గుండెలు అదరగొడుతుంటుంది. మేకప్ లేని మనుషులు. నగర జీవితపు గ్లామర్ సోకులు లేని పరిసరాలు, ఏ ఇంటిని చూసినా మన సొంత ఇళ్లు అట్టే గుర్తుకొస్తుంటాయి. సోషలిస్టు రియలిజం అంటే ఏమిటో ఇప్పుడు అందరం మర్చిపోయి ఉండవచ్చు కానీ పల్లె జీవితాన్ని ఇంత వాస్తవికంగా చూపటం సాధ్యమా అనిపిస్తుంది.
ప్రాణ సదృశమైన డైలాగ్
''పగలు ఇంట్లోంచి బయటకు వెళ్లినా ఈ ఇంటికి తాళాలు వేయరు. దానర్థం ఇంట్లో బంగారం ఏమీ లేదని కాదు. మన కూడా ఉండే మనుషులపైన నమ్మకం.. వర్షాలు వస్తే మీకు క్యాంప్ తప్ప గతే లేదన్నాడు. అవన్నీ ఆ మనిషికేం అర్థమవుతాయి మామయ్య.. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే ఆయనకూ తెలుస్తుంది...'' ఇల్లు కూడా లేని మీ ఇంటికి నా కూతురును ఎలా ఇస్తాను అంటూ ధిక్కరించిన సంపన్నుడిపై ఒక ఇంటి కోడలు అనే మాటలివి. చివరకు ఆమె అన్న మాటలే నిజమై ఆ పరిస్థితి తుఫాను వరద రూపంలో బీభత్సం సృష్టించినప్పుడు మనుషుల జీవితాలే తల్లకిందులైపోతాయి. ''తుఫానులొస్తే క్యాంపులో అందరూ కూడటంలో తప్పేంటి. మనకేమైన ఆపద వస్తే వందమంది మనకు తోడుగా వస్తారు. ఆ మనిషికి కష్టం వస్తే ఎవరు సాయం వస్తారో చూద్దాం మరి'' అంటూ ఆ ఇంటి కోడలన్న మాటలు మొత్తం సినిమాకే హైలైట్‌గా మారాయి. ''...నిజమే మనం ఆయన లాగా ఉన్నోళ్లమేమీ కాదు. చేపలు పట్టుకునే వాళ్లం.. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయన మనకన్నా తక్కువే. సాటి మనిషిని ప్రేమించడంలో..'' అంటూ ఆ ఇంటి కోడలు చెప్పిన ఈ మాట... మనిషిని కష్టాల్లో ఉన్నప్పుడు ప్రేమించాలని, దగ్గరకు తీసుకోవాలని ప్రబోధించిన సామ్యవాద వాస్తవికతను విశ్వ చలన సంగీతంలా వినిపించింది.
ఈ సినిమాను ఎందుకు చూడాలంటే?
మృత్యు వాసన ఎలా ఉంటుందో, మిత్తి సహస్రబాహువులు చాచి జీవితంపై ఎలా విరుచుకుపడుతుందో అనుభూతి చెందలేకపోతే ఈ సినిమాను దయచేసి చూడకండి. కామ నరాలను ఉద్రేకపరిచే దృశ్యాలను, కైపెక్కించే పాటలు, దృశ్యాలను మాత్రమే చూస్తూ మనలోని రహస్య కాక్షలను తీర్చుకోవాలనుకుంటే దయచేసి ఈ సినిమాను చూడకండి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నీళ్లు నిలువునా ముంచేస్తున్నప్పుడు సాయం చేసే ఆపన్న హస్తాలకు, ముఖ్యంగా తమ చుట్టూ ఉన్న వారి ప్రాణాలను కాపాడటానికి నాలుగేళ్ల క్రితం హోరుమని కురుస్తున్న భయంకరమైన వర్షంలోనే తమ తమ బోట్లను తీసుకొచ్చి వందలాది మంది ప్రాణాలను కాపాడే క్రమంలో తమ ప్రాణాలొడ్డిన కేరళ జాలర్లకు రెండు చేతులెత్తి మొక్కాలనిపిస్తే ఈ సినిమాను చూడండి. తుఫాను, వరద దెబ్బకు క్రక్కదిలిపోతున్న జీవితాలను కాపాడటానికి తమకు చేతనైనంత సాయం చేయడానికి నేలమీదనుంచి, ఆఫీసుల్లోంచి, గగన మార్గంలోంచి కాపాడటానికి తమ రెండు చేతులడ్డు పట్టిన మాన్య మహనీయ ఆపన్న హృదయాలను ఆర్తితో పలకరించాలనుకుంటే మాత్రమే 2018 ని చూడండి. ఈ సినిమా చూస్తూ హృదయం బద్దలయ్యేలా మనం రోదించలేకపోతే మనం మనుషులుగా బండబారిపోయినట్లే.
వాస్తవికతకు నిలువెత్తు దర్పణం
ఆశ్చర్యకరంగా 2018 సినిమాలో హీరోలు లేరు. హీరోయిన్‍లూ లేరు. పాత్రలు మాత్రమే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కథాంశంగా సోవియట్ రష్యా అప్పట్లో తీసిన డజన్ల కొద్దీ యుద్ధ సినిమాల్లో ఒక్క సినిమాలో కూడా మనం హీరోలను చూడం. మనలాగే రక్తమాంసాలు కలిగిన సామాన్య మానవులు సంక్షోభ సమయాల్లో ప్రదర్శించే నిరుపమాన ధీరోదాత్తతకు తిరుగులేని సంకేతంగా నిలిచిన నాటి సోవియట్ యుద్ధ సినిమాలను ఈ 2023లో సైతం ప్రపంచ సినీ అభిమానులు నివ్వెరపాటుతో చూస్తున్నారంటే, హాలీవుడ్ సినిమాల్లోని కృతక హీరోయిజనాన్ని తిట్టిపోస్తున్నారంటే అది సామ్యవాద వాస్తవికత ప్రపంచ సినిమాపై వేసిన తిరుగులేని ముద్ర అని చెప్పాలి. 2018లో కేరళను వందేళ్ల తర్వాత ముంచెత్తిన వరదలు కథాంశంగా తీసిన ఈ సినిమాలో ముఖ్యపాత్ర టోవినో థామస్ ఏ రూపంలోనైనా మానవత్వం గెలుస్తుందని నిరూపించే పాత్రలో తాదాత్మ్యం పొంది సినిమా ప్రేమికులు విలపించేలా చేశాడు. ఉన్నట్లుండి కాళ్లకింది భూమి, తాము ప్రాణాధికంగా ప్రేమించిన ప్రపంచం నీటిలో మునిగిపోయినప్పుడు బయటినుంచి సహాయం అందడం గగనమైపోయిన విపత్కర పరిస్థితుల్లో సహాయం చేయడానికి ఆ ప్రాంత సమాజం ఎలా ముందుకు వచ్చిందనేది ఈ సినిమా కథాంశం.
టన్నుల కొద్దీ భావోద్వేగాలు...!
భారతీయ సినిమా ఇప్పుడు నమూనాపరంగానే ఒక గొప్ప మార్పును చూస్తోందనడానికి ఈ సినిమా చక్కటి ఉదాహరణ. ప్రభుత్వంతో పాటు వ్యవస్థకి వ్యవస్థే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వరదల్లో చిక్కుకుపోయిన ఒక కొండ ప్రాంతం స్థానికులు తమ ప్రపంచాన్ని రక్షించుకోవడంలో ప్రదర్శించిన మానవతా ప్రదర్శనే 2018 సినిమా. ఊరు జీవితాన్ని, అక్కడ ప్రకృతి దృశ్యాలను చూపడానికే ఈ సినిమాకు గంట సమయం పట్టగా ఆ తర్వాత 90 నిమిషాల్లో మనం చూసే సినిమా, ఆకస్మిక విషాదాన్ని భరిస్తున్న, ఎదుర్కొంటున్న ఒక కారుణ్య భరితమైన ప్రపంచాన్ని మనముందు ఆవిష్కరిస్తుంది. కృత్రిమ గ్రాఫిక్స్‌తో వందలకోట్లు ఖర్చు పెట్టి ఊహలకు అవాస్తవికపు రెక్కలు తొడుగుతున్న అతి భారీ సినిమాలతో పోలిస్తే 2018 సినిమా... సాధారణ మనుషులు ఆకస్మిక విపత్తులో చిక్కుకుపోయినప్పడు పరస్పరం సహకరించుకునే క్రమంలో రూపొందే టన్నుల కొద్దీ భావోద్వేగాలను నిరుపమాన రీతిలో ప్రదర్శించింది. కుల, వర్ణ, జాతి, లింగ భేదాలు లేకుండా తోటి మానవుల పక్షాన నిలబడడంలోని మహనీయ గుణాన్ని ఎత్తి చూపడంలో సినీ నిర్మాణంలో ఉన్న సకల హద్దులను ఈ సినిమా చెరిపివేసిందంటే అతిశయోక్తి కాదు. కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు విషాదాన్ని, కష్టం తొలగిన తర్వాత పచ్చగా మళ్లీ చిగురిస్తున్న జీవితానందాన్ని పరికించాలంటే మనం చూసి తీరవలసిన సినిమా 2018.
కేరళలో మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అతి త్వరలోనే దేశమంతటా వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. చూసిన వారు సరే.. ఇప్పటికీ చూడలేకపోయిన వారు మీ జీవితంలో ఒక రెండున్నర గంటల సమయాన్ని ఈ సినిమాను చూడటం అనే మంచి పనికి వెచ్చించండి చాలు.
కె. రాజశేఖర్ రాజు
73964 94557
Also Read: ఈ వారం థియేటర్, ఓటిటీలో సందడి చేసే సినిమాలు ఇవే..