317 జీవో సంకెళ్లు తెంచండి!

గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం విడుదల చేసిన 317 ఉత్తర్వుల బలవంతపు బదిలీలు ఉద్యోగ ఉపాధ్యాయులకు అయిన వాళ్లని దూరం చేసి పొరుగు జిల్లాలో

Update: 2024-08-01 00:45 GMT

గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం విడుదల చేసిన 317 ఉత్తర్వుల బలవంతపు బదిలీలు ఉద్యోగ ఉపాధ్యాయులకు అయిన వాళ్లని దూరం చేసి పొరుగు జిల్లాలో పరాయి వారీగా ఉద్యోగ బాధ్యతలు కొనసాగించేటట్లు చేసింది. స్థానికేతరులను తరిమేందుకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసిన వారిని స్థానికేతరులను చేసింది. కన్నీరు లేని తెలంగాణ కావాలనుకుంటే కట్టుబట్టలతో వేరే జిల్లాలకు వెళ్లేటట్టు చేసింది. జీవితం కోసం చేసే ఉద్యోగం కేవలం జీతం కోసమే చేసే విధంగా పరిస్థితులను కల్పించింది.

ఈ జీవో స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా కేవలం సీనియార్టీని ఆధారంగా చేసుకొని నూతన జిల్లాలకు జూనియర్ ఉద్యోగ ఉపాధ్యాయులను బలవంతంగా అలకేషన్ చేశారు. ఈ ఉత్తర్వును రద్దు చేయాలని గత రెండేళ్లుగా బాధితులు అనేక రూపాలలో పోరాటం చేస్తున్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 317 జీవో సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినది. ఈ సందర్భంగా జీవో 317ను రద్దుచేసి ఉద్యోగ ఉపాధ్యాయులను తమ స్థానిక జిల్లాలకు కేటాయించాలని బాధితులు కోరుతున్నారు.

స్థానికత ప్రస్తావన లేకుండానే..

గత రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేస్తూ నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్-18 ని 2018 ఆగస్టు 29న వెలువరించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు నెంబర్ 128ని విడుదల చేసి 33 జిల్లాలతో కూడిన నూతన జోనల్ వ్యవస్థను ఏప్రిల్ 2021 నుండి అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ శాఖల వారీగా పోస్టులు, లోకల్ క్యాడర్ క్లాసిఫికేషన్ ఉత్తర్వులు విడుదల చేసింది. సీనియారిటీ ప్రాతిపదికన 2021 డిసెంబర్ 6న జీవో 317ను అమలుకు తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయుల నిరసన, అసంతృప్తి, ఆవేదన, ఆందోళన మధ్య అలకేషన్ ప్రక్రియ పూర్తి చేసింది. ఉద్యోగ ఉపాధ్యాయుల నుండి ఒక్కరోజులో ఆప్షన్లు తీసుకొని సీనియార్టీ జాబితాలు సమగ్రంగా తయారు చేయకుండానే అలకేషన్ ప్రక్రియ చేపట్టడంతో స్థానికేతర జిల్లాల్లో ఆ రోజు నుండి బాధితులకు కష్టాలు మొదలయ్యాయి. 317 బాధితులలో చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు రోజు ఉదయం 4-5 గంటలకు బయలుదేరి సుమారు 100-300 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాత్రి 8-9 గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో వారి పిల్లల ఆలనా పాలన చూసేవారు కరువయ్యారు. ఆరోగ్యం సరిగా లేని తల్లిదండ్రులు అత్తమామలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా దూర ప్రయాణం వలన అలసట వెరసి బోధన సామర్థ్యం నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ జీవో కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపుగా 36 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు తనువు చాలించారు. దీనిని రద్దు చేయ మని గత ప్రభుత్వ హయాంలో మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదు.

అప్పుడే ప్రశాంతంగా పని చేయగలరు!

317 బాధితుల ఆందోళనలను గమనించిన నూతన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన రీతిలో చర్యలు చేపడుతున్నది. ఎన్నికల సమయంలో 317 సమస్యను మ్యానిఫెస్టోలో ఒక అంశంగా చేర్చిన నూతన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ చైర్మన్‌గా, మరో ఇద్దరు మంత్రులైన శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను సభ్యులుగా చేర్చి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ మొదటి సమావేశంలోనే 317 జీవో బాధితుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ పోర్టల్ రూపొందించింది. జూన్ 30 వరకు బాధితులు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. అన్నీ కేటగిరీల్లో మొత్తం 52,235 దరఖాస్తులు బదిలీ చేయమని వచ్చాయి. ఇందులో విద్యాశాఖకు సంబంధించినవే 20,209 దరఖాస్తులు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసం విడుదలైన 124లోని పేర-4లో 1-7 అంశాల వరకు పేర్కొన్న విషయాలలో స్థానికత అంశం ఉంది. కావున ఉద్యోగ ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు కేటాయించాలని బాధితులు కోరుతున్నారు. స్పౌజ్, నాన్ స్పౌజ్ అనే తేడా లేకుండా స్థానిక జిల్లాలకు దూరమైన ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ అవసరమైతే సూపర్ న్యూమ రరీ పోస్టులు మంజూరు చేసి సొంత జిల్లాలకు తిరిగి పంపించాలి. ఉద్యోగ ఉపాధ్యాయులు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్ర మే సంతోషంగా పనిచేయగలరు. వారిని ప్రశాంతంగా పనిచేసేటట్లు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకొని 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.

- అంకం నరేష్

6301650324

Tags:    

Similar News