24 ఫ్రేమ్స్ :మదిని తడిమిన బిమల్‌రాయ్
సినిమా గురించి ఆలోచించడం, అర్థం చేసుకోవడం మొదలైనప్పటి నుంచీ అనేక మాటలు వింటూ వస్తున్నాను. ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా, ప్రధాన స్రవంతి సినిమా (మెయిన్ స్ట్రీమ్), సమాంతర సినిమా( పారలల్),
40వ దశాబ్దం చివరలో యుద్ధం, దేశ విభజన నేపథ్యంలో అనేక మంది బెంగాలీ దర్శకులు బాంబేకు తరలిపోయారు. బిమల్‌రాయ్ కూడా తన బృందాన్ని తీసుకొని బాంబే వెళ్లాడు. అప్పటి ఆయన బృందంలో హ్రిషికేశ్ ముఖర్జీ (ఎడిటర్), నబేదు ఘోష్ (రచయిత), సలీల్ చౌదరి (సంగీత దర్శకుడు), కమల్ బోస్ (సినిమాటోగ్రాఫర్) ఉన్నారు. బాంబేలో మొదటి సినిమాగా బాంబే టాకీస్ కోసం 1952లో 'మా' నిర్మించాడు. తర్వాత తానే బిమల్‌రాయ్ ప్రొడక్షన్స్ స్థాపించి 'దో బీఘా జమీన్' తీసాడు. ప్రముఖ రచయిత శరత్‌చంద్ర నవల 'పరిణీత'ను అదే పేరుతో సినిమాగా రూపొందించాడు. అశోక్‌కుమార్, మీనాకుమారి ప్రధాన పాత్రలను పోషించిన పరిణీత గొప్ప సినిమాగా ప్రశంసించబడింది. మీనా కుమారి పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
సినిమా గురించి ఆలోచించడం, అర్థం చేసుకోవడం మొదలైనప్పటి నుంచీ అనేక మాటలు వింటూ వస్తున్నాను. ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా, ప్రధాన స్రవంతి సినిమా (మెయిన్ స్ట్రీమ్), సమాంతర సినిమా( పారలల్), ఊహాజనిత సినిమా (మీనింగ్‌లెస్), అర్థవంత సినిమా (మీనింగ్‌ఫుల్) ఇట్లా భారతీయ సినిమా గురించి ఎన్నో మాటలు అభిప్రాయాలు, చర్చలు సాగుతూ వచ్చాయి. చివరికి 'గుడ్ సినిమా-బ్యాడ్ సినిమా' అన్న చోట నిలబడిపోయాం. ప్రధాన స్రవంతి సినిమా ఉధృతంగా ఉండగానే దానికి సమాంతరంగా కళాత్మక సినిమా ఒక ఉద్యమంగానే సాగింది. ఈ నేపథ్యంలోనే మరో భావన మొదలైంది. అది మధ్యేవాద (మిడిల్) సినిమా. అవి పక్కా కమర్షియల్ కావు. అట్లని పూర్తి స్థాయి కళాత్మక సినిమాలూ కావు. హాయిగా సాగిపోతూ జీవితాలను ఆవిష్కరిస్తూ ప్రేమలనూ, ఆప్యాయతలనూ విలువలనూ చాటిన వాటిని మిడిల్ సినిమా అన్నారు.
నవ్య సినిమా ధోరణికి పాదులు వేసి నడిపించిన సత్యజిత్ రే, మృణాల్‌సేన్, రిత్విక్ ఘటక్‌కు ముందే భారతీయ సినిమాకు కవితాత్మకతను జోడించి, కళాత్మకతతో హృదయాలను స్పృశించిన తొలి తరం దర్శకుడు బిమల్‌రాయ్. 1950లలో ప్రపంచవ్యాప్తంగా వెల్లివిరిసిన వాస్తవిక సినిమా ఉద్యమ ప్రభావంలో సినిమాలు తీసిన బిమల్‌రాయ్ వాటికి భారతీయతను జోడించి విజయవంతమయ్యాడు. మేలంకోలిక్ అప్రోచ్‌తో సినిమాలకు తనదైన ఒక ధోరణిని ఏర్పరచుకున్నాడు. ఆయన సినిమాల కథలలో కుటుంబమూ, సంబంధాలు, ఆత్మీయతలూ, ఆవేదనలూ ప్రధాన అంశాలుగా ఉండేవి. ఆయన కథ నడిపే విధానం విలక్షణంగా ఉండి, మామూలు పాత్రలు కూడా సొంత వ్యక్తిత్వంతో కూడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. బిమల్‌రాయ్ సినిమాలలో ప్రధానంగా నిశ్శబ్దం, నటీనటుల ముఖాలలో భావ వ్యక్తీకరణకే ప్రాధాన్యం కనిపిస్తుంది.
గ్రామీణ నేపథ్యంతో
బిమల్‌రాయ్ తన 'దో బీఘా జమీన్' తో భారతీయ నవ్య సినిమాకు ప్రారంభ వాక్యాలు పలికాడు. అందులో గ్రామం నుంచి నగరానికి వలస వచ్చిన ఒక రైతు శంభు జీవితాన్ని, కష్టాలను ద్రుశ్యీకరించాడు. అప్పటిదాకా పాశ్చాత్య ధోరణిలో వున్న గొప్ప నటుడు బల్రాజ్ సహానీతో రైతు వేషం కట్టించి అద్బుత నటనను రాబట్టాడు. ఈ సినిమా మీద ఫ్రెంచ్ రియలిజం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 1952లో మన దేశంలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించిన ప్రపంచవ్యాప్త సినిమాలు బిమల్‌రాయ్‌పైన తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.'దో బీఘా జమీన్' సినిమా భారతదేశంలోనే కాకుండా రష్యా, చైనా, బ్రిటన్ కార్లోవివారి, వేనీస్,మెల్బోర్న్ తదితర ఫెస్టివల్స్‌లో ప్రముఖ అవార్డులను గెలుచుకొంది. అట్లా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన బిమల్‌రాయ్ 12 జూలై 1909న అప్పటి తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లోని ఒక జమీందారీ కుటుంబంలో జన్మించాడు.
తండ్రి మరణం తర్వాత ఎస్టేట్ మేనేజర్ ద్రోహానికి గురై తల్లీ, చిన్న తమ్ముళ్లను తీసుకొని కలకత్తాకు తరలి వచ్చాడు. తీవ్ర కష్టాలను ఎదుర్కొన్న బిమల్‌రాయ్ ప్రముఖ దర్శకుడు పీసీ బారువా దగ్గర పబ్లిసిటీ ఫొటోగ్రాఫర్‌గా చేరాడు. బిమల్‌రాయ్ లైటింగ్ పరిజ్ఞానాన్ని చూసి బెంగాల్‌లోని గొప్ప సినిమా కంపెనీ 'న్యూ థియేటర్స్' తనని నితిన్ బోస్ దగ్గర అసిస్టెంట్ కెమరామన్‌గా నియమించుకుంది. కేఎల్ సైగల్ నటించిన మొదటి దేవదాస్ సినిమాకు, ముక్తి సినిమాకు బిమల్‌రాయ్ పని చేసాడు. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కోసం రెండు డాక్యుమెంటరీలు తీసాడు. కానీ, అవి లభ్యం కాకుండాపోయాయి. 1956లో ఆయన తీసిన 'గౌతమ్ ది బుద్ధా' అనేక ప్రశంసలు అందుకుంది. 1944లో తీసిన మొదటి పూర్తి నిడివి సినిమా 'ఉదయెర్ పాతెయ్ 'బెంగాల్‌లో కల్ట్ సినిమాగా మిగిలింది. ఆ సినిమాలో బిమల్‌రాయ్ చూపించిన కెమెరా పనితనం బెంగాలీవాసులను అబ్బురపరిచింది. ఆర్థికంగా కూడా గొప్ప విజయాన్ని సాధించింది.
దేశ విభజన తరువాత
40వ దశాబ్దం చివరలో యుద్ధం, దేశ విభజన నేపథ్యంలో అనేక మంది బెంగాలీ దర్శకులు బాంబేకు తరలిపోయారు. బిమల్‌రాయ్ కూడా తన బృందాన్ని తీసుకొని బాంబే వెళ్లాడు. అప్పటి ఆయన బృందంలో హ్రిషికేశ్ ముఖర్జీ (ఎడిటర్), నబేదు ఘోష్ (రచయిత), సలీల్ చౌదరి (సంగీత దర్శకుడు), కమల్ బోస్ (సినిమాటోగ్రాఫర్) ఉన్నారు. బాంబేలో మొదటి సినిమాగా బాంబే టాకీస్ కోసం 1952లో 'మా' నిర్మించాడు. తర్వాత తానే బిమల్‌రాయ్ ప్రొడక్షన్స్ స్థాపించి 'దో బీఘా జమీన్' తీసాడు. ప్రముఖ రచయిత శరత్‌చంద్ర నవల 'పరిణీత'ను అదే పేరుతో సినిమాగా రూపొందించాడు. అశోక్‌కుమార్, మీనాకుమారి ప్రధాన పాత్రలు పోషించిన పరిణీత గొప్ప సినిమాగా ప్రశంసించబడింది. మీనాకుమారి పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానిని 2005లో హిందీలోనే తిరిగి తీశారు. బిమల్‌రాయ్ 'పరిణీత' రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది. దిలీప్‌కుమార్ ప్రధానపాత్ర పోషించిన 'దేవదాస్' ముఖ్యమైన సినిమాగా చెప్పుకోవచ్చు.
ఈ సినిమా తర్వాతే దిలీప్‌కుమార్‌కు విషాద హీరోగా గొప్ప పేరు వచ్చింది. తరువాత తీసిన 'బందిని' ఓ సైకలాజికల్ సినిమా. బిమల్ ప్రతీకాత్మక చిత్రీకరణ ఆయనను గొప్ప భావుకుడిగానూ, దర్శకుడిగానూ నిలబెట్టింది. తర్వాత వచ్చిన 'సుజాత' అస్పృశ్యతను ఇతివృత్తంగా తీసుకొని నిర్మించింది. 'మధుమతి' సంగీతపరంగా, చిత్రీకరణపరంగా కొత్త దారులు వేసింది. 'మధుమతి'కి ప్రసిద్ధ దర్శకుడు రిత్విక్ ఘటక్ స్క్రీన్ ప్లే రాశాడు. పునర్జన్మ భావనను ఆధారం చేసుకొని నిర్మించిన ఈ సినిమా సలీల్ చౌదురీకి, గీత రచయితగా శైలేందర్‌కి గొప్ప పేరు తెచ్చింది. బిమల్ 'బిరాజ్ బహు' 'యాహుదీ' 'పరఖ్' 'నాదర్ నిమాయ్' ప్రేం పాత్ర' లాంటి సినిమాలు చేశాడు. నిర్మాతగా పరివార్, కాబూలీవాలా, అపరాధీ కౌన్, ఉస్‌నే కహాతా, బెనజీర్ లాంటి పలు సినిమాలు నిర్మించాడు. 55 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో 8 జూలై 1965 లో ముంబైలో మరణించాడు.
వారాల ఆనంద్
9440 501281