'సోడా' సాగలే.. బతుకు నడవలే!

సాంబయ్యది గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం. సాంబయ్య తండ్రి బాబయ్య చాలా రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాకు వలసొచ్చాడు. మంజీరా పరీవాహక ప్రాంతం,

Update: 2022-05-23 18:45 GMT

సాంబయ్యది గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం. సాంబయ్య తండ్రి బాబయ్య చాలా రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాకు వలసొచ్చాడు. మంజీరా పరీవాహక ప్రాంతం, నిజాంసాగర్ కాలువల కింద తక్కువ కౌలుకు భూములు దొరుకుతుండటంతో ఆంధ్రప్రాంతం నుంచి చాలా మంది వలసొచ్చేవారు. భూములు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసుకొనేవారు. కొందరు భూములు కూడా కొనుక్కున్నారు. సోడా తయారు చేయడంలో బాబయ్యది అందెవేసిన చేయి. సహజంగా ఆంధ్రప్రాంతం నుంచి వలసొచ్చిన వారికి సోడా తాగడం ఓ సరదా.

వేసవిలో సోడా వ్యాపారం బాగా సాగేది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు సోడా తయారు చేసి బండ్లపై అమ్మకాలు సాగించేవాడు బాబయ్య. 20 సోడా బండ్లు మెయింటేన్ చేసేవాడు. మిగతా రోజుల్లో ఇతరుల పొలాల్లో పనులు చేసేకునేవారు. అలా వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకొని రెండెకరాల భూమి కూడా కొన్నాడు. సాంబయ్య తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. స్కూలుకు వెళ్లినా చదువుల మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. సీజన్లో సోడా తయారు చేయడం బండ్లపై వేసి పంపడం లెక్కలు రాసుకోవడం ఫుల్ బిజీగా ఉండేవారు. దాదాపు 10 గ్రామాలలో బాబయ్య సోడా బండ్లు తిరిగేవి. బాబయ్య కాలం చేశాడు.. సాంబయ్య సోడా వ్యాపారంలో ఉండిపోయాడు.

*

క్రమంగా గ్రామాలకు గోల్డ్ స్పాట్, లిమ్కా, థమ్స్ అప్, మాజా, ఫాంటా వంటి కూల్ డ్రింకులు వచ్చేశాయి. చిన్న పాటి కిరాణాషాపులలోనూ ఫ్రిజ్‌లు చేరాయి. గోలీసోడాకు ఆదరణ కరువైంది. సాంబయ్య వ్యాపారం ఐదు బండ్లకే పరిమితమైంది. వర్కర్లు దొరకడం కూడా కష్టతరంగా మారింది. సాంబయ్యకు ముగ్గురు ఆడ పిల్లలు, ఒక బాబు. సంసారం నడపడం కష్టంగా మారింది. తండ్రి సంపాదించిన రెండెకరాల భూమిని అమ్మేశాడు. ఇద్దరు ఆడపిల్లల పెండ్లిళ్లు చేశాడు. మరో అమ్మాయి పెండ్లి కోసం అప్పులు చేశాడు. డిగ్రీవరకు చదువుకున్న ఆయన కొడుకు రాజేశ్, ఏదో ప్రైవేటు ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి ఉండిపోయాడు.

సాంబయ్య ఇల్లు అమ్మి అప్పులు కట్టేశాడు.భార్యాభర్తలు కలిసి హైదరాబాద్​వచ్చి కొడుకు వద్ద ఉంటున్నారు. భార్య సుబ్బమ్మ కాలం చేసింది. కష్టాల కడలిలో తోడు, నీడగా నిలిచిన భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు సాంబయ్య. ఒంటరయ్యాడు. మనో వ్యథ కలచివేస్తున్నది. సుబ్బమ్మ అనారోగ్యం పాలైనప్పుడు చేసిన అప్పులు తీర్చడం తలకు మించిన భారంగా మారింది. తనకు వచ్చే జీతం తక్కువ కావడంతో రాజేశ్ నిత్యం ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్నాడు. కుటుంబం గడవటం కష్టతరంగా మారింది. రాజేశ్ తన ఇద్దరు పిల్లలను గవర్నమెంట్ బడికి మార్పించాడు. కొడుకు కష్టాలు చూసిన సాంబయ్య. తానూ ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. మళ్లీ సోడా బండి స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. మిషన్లు కొనాలి. పెట్టుబడి కావాలి. అమ్ముడుపోతుందా? లేదా తెలియదు. సమీప బంధువు వెంకట్రావును సంప్రదించాడు. వెంకట్రావుకు సిటీలో సోడా బిజినెస్ ఉంది. 'సరే ఓ బండి ఇస్తాను అమ్ముకొని డబ్బులు తీసుకొమ్మన్నాడు' వెంకట్రావు.

*

ఆరు పదులు దాటిన వయస్సులో సాంబయ్య మళ్లీ సోడా అమ్మడం మొదలెట్టాడు. నిజాంపేట ఎన్టీఆర్‌ నగర్‌లో సోడా అమ్మేవాడు. కొడుకు నివాసం ఉండే ప్రాంతానికి దగ్గరగానే కావడంతో పెద్దగా ప్రయాస పడలేదు. తొలి రోజు వంద రూపాయల గిరాకీ అయ్యింది. క్రమంగా పెరుగుతుందిలే అనుకున్నాడు. కొంత దూరంలో కాలేజీలున్నాయి. అక్కడ వ్యాపారం బాగా సాగుతుందని భావించాడు. ఫలితం పెద్దగా కనిపించలేదు. కొత్త తరం పిల్లలు సోడా బండి వంక చూడలేదు. సమీపంలోని బేకరీలో మాత్రం గిరాకీ బాగా అవుతున్నది.

అక్కడికి వెళ్లిన కాలేజీ పిల్లలు రూ. 60 పెట్టి కార్పొరేట్ కంపెనీ గోలీ సోడా తాగుతున్నారు. సాంబయ్య పది రూపాయలకు అమ్మినా కొనేవారు కరువయ్యారు. ఏం చేయాలో అర్థం కాలేదు సాంబయ్యకు. రాత్రంతా బాగా ఆలోచించాడు. మరుసటి రోజు ఉదయాన్నే బండి తీసుకెళ్లి వెంకట్రావుకు అప్పగించాడు. గిరాకీ లేదు తమ్ముడూ! అంటూ ఇంటికి బయల్దేరాడు. మరుసటి రోజు ఉదయం ఎన్టీఆర్ నగర్ లేబర్ అడ్డాలో భుజంపై టవల్ వేసుకొని ప్రత్యక్షమయ్యాడు. 'బాబూ ఏమైనా పనుంటే చెప్పండి. నేనూ వస్తాను' అంటూ ప్రాధేయపడుతున్నాడు. పని మీద అటుగా వెళ్లిన నేను ఫోన్ వస్తే ఆగి బైక్ పైనే ఉండి అటెండ్ చేస్తున్నాను. సాంబయ్యలాగే ఉన్నాడే అనుకున్నాను.

*

ఏమో 30 ఏండ్ల కింద చూశాం. ఆయనో కాదో? అనుకుంటూనే దగ్గరగా వెళ్లాను. నన్ను గుర్తు పట్టలేదు. 'ఏమైనా పనుందా సార్?' అంటూ అడిగాడు. 'పని సరే కానీ మీదేవూరు' అని అడిగాను. 'అవన్నీ ఎందుకులెండి?' అంటూ మొహమాటంతో వెనుదిరిగాడు. బైక్ ఆపి దగ్గరగా వెళ్లాను. 'మీ పేరు సాంబయ్య కదా?' అన్నాను. 'అవునయ్యా మీరెవరు?' అడిగాడు. 'ఏమిటీ పరిస్థితి?' అంటూ నోరెళ్ల బెట్టాను. విషయమంతా చెప్పాడు.

నాకు తెలిసిన మిత్రుడొకరు వాచ్‌మన్ కావాలని వెతుకుతున్నాడు.అతడు కొత్తగా కట్టే ఇంటికి వాటర్ క్యూరింగ్ చేయాలి. సాంబయ్య సూట్ అవుతాడనిపించింది. నీడపట్టున చేసే పని అని మిత్రుడికి నచ్చజెప్పి ఓకే చేయించాను. పది వేల రూపాయల జీతం ఇస్తామన్నారు. రేపటి నుంచే రమ్మన్నాడు. సాంబయ్య కళ్లలో కృతజ్ఞతతో కూడిన ఆనందం. ఓ వెలుగు వెలిగి 20 మందికి పని కల్పించిన కుటుంబం. ఇప్పుడిలా వీధిన పడటం కలిచి వేసింది.

ఎంఎస్ఎన్ చారి

79950 47580

Tags:    

Similar News