న్యూ ఇయర్ అనగానే యూత్‌కి ఒక ఉత్సాహం. అంతా ఎంజాయ్ మూడ్. కొద్దిమందికి భవిష్యత్తు మీద యాంబిషన్స్. ఇంకొద్దిమందికి ఆశయాలు, ఆకాంక్షలు. 21వ శతాబ్దంలోని 21వ సంవత్సరం పూర్తయింది. కొంతమందికి అనుకున్నవి ఆవిరి అయ్యాయి. మరికొంతమంది జీవితాలను సెకండ్ వేవ్ ఛిద్రం చేసింది. కోట్లాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉపాధి ఊడిపోయింది. మానవ సంబంధాలు మారిపోయాయి. పేదలు నిరుపేదలయ్యారు. అంబానీ, అదానీ వంటి సంపన్నుల సంపద అనూహ్యంగా పెరిగింది. పిల్లల చదువులు అటకెక్కాయి. వారి విద్యా ప్రమాణాలు ప్రశ్నార్థకమయ్యాయి. కొత్త సంవత్సరానికి ఒమిక్రాన్ స్వాగతం పలుకుతున్నది. అందుకే న్యూ ఇయర్‌లో ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశలు లేవు. న్యూ ఇయర్ వస్తుందనగానే పాత సంవత్సరం జ్ఞాపకాలను నెమరేసుకుంటాం. మర్చిపోలేని అనుభూతులను పదిలం చేసుకుంటాం. కరోనా పుణ్యమా అని 2021 సంవత్సరాన్ని తల్చుకోడానికే సాహసించం. అది మిగిల్చిన చేదు అనుభవాలను గుర్తు చేసుకోడానికి మనసు రాదు. 'నీ లాంటి సంవత్సరం జీవితంలో ఇంకెప్పుడూ రావొద్దమ్మా' అని దండం పెట్టి సాగనంపుతాం. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని తెంచేసింది. మానవత్వాన్ని మంట గలిపింది. మర్చిపోలేని బాధలను మిగిల్చింది. ఆప్తులను కోల్పోయాం. కడసారి చూపుకూ నోచుకోలేకపోయాం. అంత్ర్యక్రియలూ అనాథల తరహాలో జరిగిపోయాయి.
ఊపిరి కూడా తీసుకోలేక
సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. లక్షలాది మందిని చంపేసింది. చుట్టూ గాలి ఉన్నా పీల్చుకోడానికి ఆక్సిజన్ లేక అవస్థ పెట్టింది. డబ్బులు పెట్టి మరీ బ్లాకులో కొనుక్కోవాల్సి వచ్చింది. పవిత్రంగా భావించే గంగానదిలో ఒక్కసారైనా మునగాలని కొంతమంది కోరుకుంటారు. కానీ, కొట్టుకొస్తున్న శవాలను చూశాం. నది ఒడ్డున శవాల దిబ్బలు దర్శనమిచ్చాయి. రేయింబవళ్లు శవ దహనాలు జరిగాయి. కుహనా ప్రతిష్ట కోసం కరోనా మృతుల లెక్కలతో ప్రభుత్వాలు ఆడుకున్నాయి. కరోనా వైద్యం కోసం పుస్తెలను తాకట్టు పెట్టాం. ఆస్తులను అమ్ముకున్నాం. అప్పులు చేశాం. పేదరికంలోకి కూరుకుపోయాం. ధనిక, పేదల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు గోరు మీద రోకటి పోటులా మారాయి. అయినా నియంత్రణలో సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. అన్నం పెట్టి కడుపు నింపే అన్నదాత ఆకలిచావుల పాలవుతున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక ఆయువు తీసుకుంటున్నారు. అన్నపు రాశులు ఒకవైపు, ఆకలి కేకలు మరోవైపు తాండవించాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కాల్సి వచ్చింది. ఎంఎస్‌సీ పెంచి ఆదుకుంటున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు కళ్లముందు నీరుగారిపోతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉన్నాయి. నల్ల చట్టాలతో జీవితాలు సమాధి అవుతాయని ఎండకు ఎండి, చలికి వణికి జీవన్మరణ పోరుకు దిగారు రైతన్నలు. చదువుకున్న యువత ఉద్యోగాలు దొరక్క ఆత్మహత్య చేసుకుంటున్నారు. గొప్పలు చెప్పుకున్న తెలంగాణ సర్కారు వడ్లు కొనే స్థోమత లేదంటూ చేతులెత్తేసింది. సంపన్న రైతులు, ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నేతలు మాట తప్పారు.
దాచుకున్న సొమ్ముకు రెక్కలు
అప్పటివరకూ బ్యాంకులలో దాచుకున్న మిడిల్ క్లాస్ ప్రజల సేవింగ్స్ డబ్బు హారతికర్పూరంలా కరిగిపోయింది. పీఎఫ్ ఖాతాలూ ఖాళీ అయ్యాయి. ఉపాధి కల్పించిన పట్టణాలను వదిలి పల్లెబాట పట్టారు. ఐదంకెల జీతం అందుకున్నవారూ ఉపాధి హామీ పనులకు పోటీపడ్డారు. చదువుకున్న యువత గొర్రెలు, బర్రెలను మేపుకోవడం మేలనుకున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోడానికి వెంపర్లాడాయి. ఇందుకోసం దోపిడీ మార్గాలను ఎంచుకున్నాయి. పన్నులు పెంచాయి. వసూళ్లకు పాల్పడ్డాయి. ఆదుకునే బాధ్యతను మర్చి వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. చేసిన సాయానికి రెట్టింపుగా దండుకోవడానికి తాపత్రయపడ్డాయి. కానీ, నాణానికి మరోవైపు కూడా ఉంది. కరోనా భయం కొంతమందికి అద్భుతదీపంగా మారింది. ఊహకు అందని విధంగా సంపదను పోగుచేసింది. ప్రపంచస్థాయి బిలియనీర్ల స్థాయికి చేర్చింది. ఫార్మా కంపెనీలకు కాసులు కురిపించింది. ప్రజల నిస్సహాయత, అత్యవసర వైద్యం అక్షయపాత్రగా మారింది. కార్పొరేట్ ఆస్పత్రులకు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాక్సిన్ వ్యాపారం ఊహించని లాభాలకు కారణమైంది. స్వదేశీ వ్యాక్సిన్ సెంటిమెంట్ వర్కవుట్ అయింది. కరోనా వైరస్ పెట్టుబడిదారులకు, వ్యాపారులకు కాసుల ఖజానాగా పనికొచ్చింది. ఆస్పత్రిలో బెడ్ మొదలు మందులు, ఆక్సిజన్ వరకు బ్లాక్ మార్కెట్ సరుకులుగా మారిపోయాయి. మాస్కులు, శానిటైజర్ల వ్యాపారం 'మూడు పువ్వులు, ఆరు కాయలు' తరహాలో వర్ధిల్లుతూనే ఉన్నది.
అటకెక్కిన పిల్లల చదువులు
ఆన్‌లైన్ క్లాసుల పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థలు అందినకాడికి దండుకున్నాయి. ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేశాయి. పంతుళ్ల ఉద్యోగాలను పీకేశాయి. మొబైల్ ఫోన్లు, టాబ్‌లు, కంప్యూటర్లు, లాప్‌టాప్ బిజినెస్ ఊపందుకుంది. అప్పోసప్పో చేసి జనం సమకూర్చుకోక తప్పలేదు. సర్కారు బడుల పాఠాలు తూతూ మంత్రంగానే సాగాయి. పరీక్షలు లేకుండానే 'ఆల్ పాస్'తో పై తరగతులకు ప్రమోట్ అయ్యారు. చదువు సంగతేమోగానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే ప్రపంచమైపోయాయి. వారి మానసిక ఎదుగుదల, ప్రవర్తనపై ఊహించని ప్రభావం చూపింది. లాక్‌డౌన్ పుణ్యమా అని ఇంటికే పరిమితం కావడంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ బిజినెస్ కొత్త పుంతలు తొక్కింది. 'ఆత్మనిర్భర్' కొందరికే పరిమితమైంది. పేదలను ఆదుకోవాల్సిన సర్కారు బాధ్యతను విస్మరించింది. ఖజానా నింపుకోడానికి కాసుల వేటలో పడింది. సెస్‌ల పేరుతో దండుకోవడం మొదలుపెట్టింది. మూలిగే నక్క మీద..తరహాలో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది. కూడబెట్టి దాచుకున్న డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించి బ్యాంకులూ లాభం కోసం కక్కుర్తిపడ్డాయి. అక్రమార్కులకు రుణాలిచ్చి సామాన్యులకు చుక్కలు చూపించాయి. ఒక చేత్తో వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తూ మరో చేత్తో అంతకు రెట్టింపును పెరుగుతున్న ధరలతో పన్ను రూపంలో దండుకుంటున్నాయి ప్రభుత్వాలు. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం బాధలు పేదలకు, మిడిల్ క్లాస్‌కే.
వారికి అది కల్పతరువే
సామాన్యులను ఎన్నో బాధలు పెట్టిన కరోనా పిడికెడు మంది క్యాపిటలిస్టులకు, వ్యాపారులకు మాత్రం తరతరాలకు సరిపోయే సంపదను పోగుచేసింది. రెండేళ్లపాటు చిదిమేసిన కరోనా ఇకనైనా పోతుందా అని ఎదురుచూసిన ప్రజలకు ఒమిక్రాన్ 'నిన్ను వదల బొమ్మాళీ' అంటూ వెంటాడుతున్నది. కొత్త సంవత్సరానికి కొత్త వేరియంట్ స్వాగతం పలుకుతున్నది. వైరస్ మిథ్య, వ్యాక్సిన్ మిథ్య అనే అనుమానాలు సరేసరి. వెళ్ళిపోతున్న సంవత్సరాన్ని తల్చుకోడానికి కూడా ధైర్యం చేయని జనం రానున్నది 'హ్యాపీ' లేని న్యూ ఇయర్ అనే అనుకుంటున్నారు.
ఎన్ విశ్వనాథ్
99714 82403