బలిపీఠంపై బక్క రైతు

ఉన్నది ఉన్నట్టు

Update: 2021-12-02 10:45 GMT

తెలంగాణలో అన్నదాత బతుకు ఆగమైంది. అన్నం పెట్టే రైతు జీవితం ప్రశ్నార్థకమైంది. యాసంగికి సాగు చేయాలో వద్దో తేల్చుకోలేకపోతున్నాడు. ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆదుకుంటాయనే భరోసా ఉండేది. ఆ ప్రభుత్వాలే ఇప్పుడు సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. రైతు దిక్కు తోచని స్థితిలో పడ్డాడు. పుష్కలంగా నీరు ఉన్నా, సాగు పనులు మొదలుకాలేదు. రైతుబంధు లాంటివి సమకూరుతున్నా వెనకాడుతున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ క్రీనీడలో రైతు బలిపశువు అవుతున్నాడు. ఉప్పుడు బియ్యం కొనుగోలు వ్యవహారం రైతుల ఉసురు తీస్తున్నది. యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనేది లేదంటూ కేంద్రం చెబుతున్నది. కొననప్పుడు కొనుగోలు కేంద్రాలెందుకు? అని రాష్ట్రం అంటున్నది. పండించినా కొనే నాథుడు లేడనే భావనతో రైతులు సాగుకు మొగ్గు చూపడం లేదు. రెండు ప్రభుత్వాలూ వాటి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయి. వ్యవసాయం పండుగలాగా మారిందని గొప్పగా చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం రైతులను గైడ్ చేయడం లేదు. ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం

యాసంగికి బాయిల్డ్ రైస్ కొనబోమంటూ కేంద్రం చెబుతున్నది. తెలంగాణలోని వాతావరణ పరిస్థితులు యాసంగిలో పండే వరి ధాన్యం పారా బాయిల్డ్ రైస్‌కు తప్ప పచ్చి బియ్యానికి పనికిరాదని రాష్ట్రం చెబుతున్నది. పచ్చి బియ్యం కోసం వాడుకున్నా సగం నూకలవుతాయని అంటున్నది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొననప్పుడు ధాన్యం సేకరణకు అర్థమే లేదనే వాదనను తెరపైకి తెచ్చింది. చివరకు వరి సాగు వద్దేవద్దంటూ రైతులకు పిలుపునిచ్చింది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించింది. ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేయాలో చెప్పడం లేదు. పండిస్తే అమ్ముకునేదెట్లా? రేటు వచ్చేదెట్లా? అనే రైతుల సందేహాలకు సర్కారు నుంచి సమాధానం లేదు. కొన్ని పంటలు ఎంఎఎస్‌పీ జాబితాలో లేవు. కనీసం పండించినందుకు రైతులకు ప్రోత్సాహకమూ లేదు. కేరళలాంటి రాష్ట్రాలలో రైతులు ఎక్కువగా ప్రత్యామ్నాయ పంటలే పండిస్తారు. వరి సాగు తక్కువ. దీంతో వరిని సాగుచేసే రైతులకు ఎంఎస్‌పీకి అదనంగా క్వింటాల్‌కు వెయ్యి రూపాయల బోనస్ ఇస్తున్నది ఆ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలకూ అలాంటి విధానం ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. దీనికి తోడు విత్తనాలకు సబ్సిడీని కూడా కోరుకుంటున్నారు. నాలుగైదేళ్ల క్రితమే రాష్ట్రంలో విత్తన సబ్సిడీ విధానానికి ప్రభుత్వం మంగళం పాడింది.

ముందుచూపు లేని కేంద్ర ప్రభుత్వం

యాసంగి సీజన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొలిటికల్‌ బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. ఒకదాన్ని మరొకటి టార్గెట్ చేసుకుంటూ విమర్శించుకుంటున్నాయి. రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయి. సంక్షోభాన్ని ముందుగా ఊహించడంలో, నివారణకు మార్గం కనుకొనడంలోనూ కేంద్రం విఫలమైంది. ముందుచూపు కొరవడింది. స్పష్టమైన విధానాలను రూపొందించలేకపోయింది. సాగు చట్టాల విషయంలో నిర్లక్ష్యంగా, ఏకపక్షంగా వ్యవహరించి వెనక్కి తగ్గింది. మొత్తం వ్యవసాయ రంగమే సంక్షోభంలో పడింది. ప్రకటించిన ఎంఎస్‌పీ అమలులో ఉల్లంఘనలు జరుగుతున్నా చేష్టలుడిగి చూస్తున్నది. అధిక నిల్వల పేరుతో కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకున్నది. మరోవైపు ఉచిత బియ్యం పథకాన్ని మరో ఐదు నెలల పాటు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఒకవైపు అన్నపు రాశులు, మరోవైపు ఆకలి కేకలు. పరిస్థితికి తగినట్లుగా పాలసీ రూపకల్పనలో విఫలమైంది. వ్యాల్యూ అడిషన్‌తో సంక్షోభాన్ని నివారించవచ్చంటూ మేధావులు సలహాలు ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అంటూ ప్రభుత్వం కొంతకాలం ఊదరగొట్టింది. రాష్ట్ర ప్రభుత్వమూ అదే చేసింది. కానీ ఆచరణలో ఎక్కడి గొంగళి తరహాలోనే మిగిలిపోయింది. మరోవైపు కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు ప్యాకేజ్డ్ ఫుడ్ లాభసాటి వ్యాపారంగా మారింది.

దారి చూపని సీఎం హామీలు

వ్యవసాయ రంగం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతంగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కోటి ఎకరాల మాగాణం కల నెరవేరిందన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ అద్భుతాలే సృష్టించాయన్నారు. రాష్ట్రంలో ఏ ఆహార పదార్ధాన్ని ఎంత మోతాదులో వినియోగిస్తున్నారో లెక్క తేల్చారు. దాన్ని ఎంత ఎక్కువ పండించాలో సూచనలు చేశారు. తొలుత వరి సాగును విసృతం చేయాలన్నారు. ఆ తర్వాత 'తెలంగాణ సోనా' రకానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నందున రైతులు దీనివైపు దృష్టి పెట్టాలన్నారు. ఆ తర్వాత సన్నాలు పండిస్తే ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఎక్కువ దిగుబడి రావడానికి 'వెద' పద్ధతిలో సాగు చేయాలన్నారు. ఆ తర్వాత పత్తికి డిమాండ్ ఉన్నందున దాన్ని సాగు చేయాలన్నారు. చివరకు వరి వద్దే వద్దు అనే దగ్గరకు వచ్చింది. ఇన్ని రకాల మాటలతో రైతులు గందరగోళంలో పడ్డారు. అధిక నిల్వల పేరుతో బాయిల్డ్ రైస్ కొనొద్దని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. పచ్చిబియ్యంతో మిల్లర్లకు నష్టం కాబట్టి పండించడం వృథా అని రాష్ట్రం చెబుతున్నది. స్వంత డబ్బులు ఖర్చు చేసి కొనే స్థోమత లేదని అంటున్నది. ఇంతకాలం చివరి గింజ వరకూ కొన్నామని గొప్పగా చెప్పుకున్నది. కేంద్రం కొనడం బంద్ పెట్టడంతో రాష్ట్రం సైలెంట్ అయింది. కొంటున్నది కేంద్రమేనని రైతులకు ఆలస్యంగా అర్థమైంది. కొనుగోళ్ళలో రాష్ట్రం ఒక నోడల్ ఏజెన్సీగా మాత్రమే పనిచేసిందనే భావనకు వచ్చారు.

పంటల బీమా ధీమా కరువు

యాసంగి సాగుకు వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎక్కువ. తుపాను, అకాల వర్షాల సమస్య ఉంటుంది. వడగండ్ల వర్షం సరేసరి. పంట చేతికొచ్చేంత వరకు రైతుకు ధీమా ఉండదు. పంటల బీమా పథకం ఉంటే కాస్త ఊరట ఉండేది. కానీ ఇవేవీ రాష్ట్రంలో అమలులో లేవు. నిన్న మొన్నటి వరకూ అమలైన మూడు రకాల ఇన్సూరెన్సు స్కీమ్‌లు ఇప్పుడు కనుమరుగయ్యాయి. అన్నింటికీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫసల్ బీమా యోజన ఒక్కటే శరణ్యమైంది. కొన్ని రాష్ట్రాలు స్వంతంగా పంటల బీమా పథకాలు పెట్టుకున్నాయి. కానీ తెలంగాణలో అలాంటిది లేదు. ఫసల్ బీమా పథకం కేంద్ర ప్రభుత్వానిది కావడంతో రాష్ట్ర సర్కారు దాన్ని పక్కన పెట్టింది. ఏ బీమా పథకమూ లేదు. రైతుబంధు, రైతుబీమా పథకాలే తెలంగాణ రైతులకు సర్వరోగ నివారిణి అయ్యాయి.

రైతులకు దళారుల బెడద

రైతులకు ప్రభుత్వ కొనుగోలుపై ధీమా ఎక్కువ. అందుకే వరి సాగుకు మొగ్గు చూపారు. గతంలో సాగునీటి కోసం పడిన కష్టాలు ఇప్పుడు లేవు. భూగర్భ జలం పెరిగింది. ప్రాజెక్టులూ వచ్చాయి. 24 గంటలూ ఉచిత విద్యుత్తూ వస్తున్నది. రైతుబంధు పేరుతో పంట సాయం కూడా అందుతున్నది. చివరకు పంటను ప్రభుత్వమే కొంటున్నది. కాస్త ఆలస్యమైనా డబ్బులు నేరుగా వచ్చి ఖాతాలో పడుతున్నాయనే ధీమా రైతులలో ఏర్పడింది. ఏజెంట్లు, బ్రోకర్లు, దళారుల బెడద లేదని ఊరటచెందారు. ప్రైవేటు వ్యాపారుల దోపిడీ కూడా తగ్గిపోయింది. ఫలితంగా రైతులకు వరి సాగు భరోసా కల్పించింది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం నుంచి గ్యారంటీ లేదు. వాటిని సాగు చేయడానికి అనువైన నేల స్వభావం,వాతావరణం లేదు. మానసికంగా వరికి అలవాటు పడిన రైతులు కొత్త పంటలపై ఆసక్తి చూపడంలేదు. రైతులకు అవగాహన కలిగించడానికి ఉద్దేశించిన రైతు వేదికలు ఏం చేస్తున్నాయో తెలియదు. వ్యవసాయ విస్తరాణాధికారులు ఎందుకు ఉన్నారో అర్థం కాదు. ప్రత్యామ్నాయ పంటలపై భరోసా లేకపోవడంతో రిస్కు తీసుకోడానికి రైతులు సిద్ధంగా లేరు.

ఎన్. విశ్వనాథ్


Similar News