ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చనిపోయినపుడు 'ఆయన సౌమ్యుడిగా, సహనశీలిగా, రాజకీయాలలో తనదైన ప్రత్యేక శైలిని, హుందాతనాన్ని ప్రదర్శించారు' అంటూ చాలా మంది నాయకులు వ్యాఖ్యానించారు. మరి ప్రస్తుతం ఎంతమంది నేతలు అలాంటి హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు? రోశయ్య గురించి చెప్పుకోవడమే తప్ప ఆయనను ఎందుకు ఆదర్శంగా తీసుకోలేదు? ఆయనలాగా ఎందుకు హుందాతనంతో వ్యవహరించడంలేదు? సభ్య సమాజం చీదరించుకునే తీరులో పరుష పదాలను ఎందుకు వాడుతున్నారు? ఒకరిని మించి మరొకరు పోటీపడిమరీ బూతు పురాణాలు ఎందుకు వినిపిస్తున్నారు? నేటి తరం పొలిటికల్ లీడర్లు వారికి వారు ప్రశ్నించుకోవాలి. వ్యక్తిత్వాన్ని, వ్యవహారశైలిని మార్చుకుంటారా? లేక ప్రజలే మార్చే పరిస్థితిని కొనితెచ్చుకుంటారా? ఇదీ ఇప్పుడు మన నేతల ముందు ఉన్న కర్తవ్యం. తెలుగు రాజకీయాలలో దామోదరం సంజీవయ్య మొదలు రోశయ్య వరకు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వారి రాజకీయ ఆచరణ, నైతిక విలువలకు కట్టుబడి ఉండడం, చట్టసభలలో వారి భాషలాంటి అంశాలను గుర్తుచేసుకుంటూ ఉంటారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో ఇవేవీ కనిపించడంలేదు. విలువలు, ప్రమాణాలు అటకెక్కాయి. మ్యూజియంలో వస్తువులుగా మిగిలిపోయాయి. భాషా పరిజ్ఞానాన్ని తిట్ల దండకంలో ప్రదర్శిస్తున్నారు. చట్టసభలలో మనకు వినిపించే అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ అనే పదమే ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీ లోపలా, వెలుపలా ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యే వరకు అందరినీ అదే తీరు. అన్ని పార్టీల నేతలదీ అదే దారి. నేతలు పలికిన కొన్ని బూతు పదాలను ఉద్దేశపూర్వకంగానే ప్రచురించడంలేదు.
మాటకు మాట
'కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని' ఒకరు అంటే, 'టచ్ చేసి చూడు, ముడతవా బిడ్డా' అని ఇంకొకరు కౌంటర్ ఇస్తున్నారు. 'మెడలు వంచుడు ఖాయం, అని ఒకరంటే, వంచుడు కాదు ఇరుస్తం, నాలుగు ముక్కలు చేస్తం బిడ్డా జాగ్రత్త' అని రిప్లయి వస్తున్నది. 'ఫామ్‌హౌజ్‌ను దున్నుడు ఖాయం' అని ఒకరంటే, 'దమ్ముంటే రా బిడ్డా ఆరు ముక్కలైపోతవ్ నా కొడకా' అని ఇంకొకరంటున్నారు. 'తప్పుడు మాటలు మాట్లాడితే నాలుగు చీరేస్తా' అని ఒకరంటే, 'నంజుకుని తింటం' అంటూ కౌంటర్ ఇస్తున్నారు. 'దరిద్రుడు, మూర్ఖుడు, తాగుబోతు, అబద్ధాలకోరు, బూతు భాషా కోవిదుడు' ఇలాంటి అనేక పదాలు మన నేతల మీడియా సమావేశాలలో, బహిరంగసభలలో కామన్ అయిపోయాయి. ఇదీ మన నేతల భాష. ఒకరి భాషా పాండిత్యాన్ని మించిపోయి మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు.
ఉద్యమంలో చెల్లుబాటు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ వాడిన భాషను ప్రజలు అప్పటిలో ఆస్వాదించారు, ఆహ్వానించారు. 'సన్నాసులు, దద్దమ్మలు, చవటలు' ఇలాంటి అనేక పదాలు తెరపైకి వచ్చాయి. తెలంగాణకు జరుగుతున్న నష్టానికి కారణం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలేననే ప్రజలు బలంగా నమ్మారు. అందుకే ఆ తిట్లను ఎంజాయ్ చేశారు. వారిని ఎంత తిట్టినా ప్రజలు స్వాగతించారు. ఆ భావోద్వేగం, సెంటిమెంట్ అలాంటిది. అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తు గురించి ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రభుత్వ ఆచరణ ఎలా ఉంటుందోనని గమనించారు. ఎంత మాత్రం తిట్లను ఆస్వాదించే పరిస్థితిలో లేరు. అయినా నేతలు మాత్రం వారి భాషను మార్చుకోవడంలేదు. ఉద్యమం సమయంలో వాడిన భాషే ఇప్పుడూ రిపీట్ అవుతున్నది. మరింత వికృతంగా మారుతున్నది. బెదిరించే, రెచ్చగొట్టే స్థాయికి వెళుతున్నది. వ్యక్తిగత అలవాట్ల అంశాలూ బహిరంగమవుతున్నాయి. చివరకు అది 'నా కొడుకులు' 'రండ' లాంటి పదాల దాకా వచ్చింది. వ్యక్తులు, వారి స్థాయి, రాజ్యాంగపరంగా వారు నిర్వర్తిస్తున్న బాధ్యత, ఇవేవీ తిట్టేవారికి పట్టడం లేదు. యధాలాపంగా వచ్చినా, ఉద్దేశపూర్వకంగా పలికినా దాన్ని సవరించుకోడానికి బదులుగా సమర్దించుకోడానికే తాపత్రయపడుతున్నారు. నేతల మెహర్బానీ కోసం 'అలా మాట్లాడడంలో తప్పేమీ లేదు' అంటూ కిందిస్థాయి నేతలు సర్టిఫికెట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులుగా యావత్ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు స్థాయి దిగజారి మాట్లాడడం నేటి 'మార్కు'గా మారిపోయింది. బూతుపదాలు బహిరంగంగా, ప్రెస్‌మీట్‌లలో, లైవ్ టెలికాస్టింగ్‌లో వచ్చేస్తున్నాయి. సంయమనం కోల్పోతున్నారు. ఒకరిని మించి మరొకరు తీవ్రతను పెంచుతున్నారు.
వాజ్‌పాయి నాటి హుందాతనమేదీ?
సిద్ధాంతం, సంప్రదాయం, నైతికత అంటూ గొప్పగా ప్రవచనాలు చెప్పే బీజేపీ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. సైద్ధాంతికంగా బీజేపీని తూర్పారపట్టే నేతలు సైతం వాజ్‌పాయిని వ్యక్తిగతంగా గౌరవించేవారు. పార్లమెంటులో ఆయన చేసే ప్రసంగాలను, ఇతర వేదికలపై ఆయన నడతను మెచ్చుకునేవారు. అప్పటిలో అద్వానీ లాంటి నేతలను అతివాదులుగా చెప్పుకునేవారు. కానీ, ఇప్పుడు అదంతా ఒక 'చరిత్ర'గానే మిగిలిపోయింది. తెలంగాణ బీజేపీ నేతల తీరు మరీ దారుణం. కేసీఆర్‌ను విమర్శించడానికి వాడే భాష, చేసే అన్వయింపు జుగుప్సాకరంగా ఉంటున్నది. 'వాడు.. వీడు..' అనే పదాలు వారికి అలవోకగా వచ్చేస్తున్నాయి. 'జోష్‌లో ఉండే మాట్లాడుతున్నాడా? పొద్దున మాట్లాడిండా? లేక రాత్రి మాట్లాడిండా?' అంటూ ఆ బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించి కేసీఆర్ వ్యక్తిగత అలవాటును ఎత్తిచూపారు. 'సారు రాత్రిపూటనే ప్రెస్ మీట్ పెడతరు, సోయిల ఉండాలంటే పొద్దునపూట పెట్టొచ్చుగదా' అంటూ కేసీఆర్‌కు ఉన్న మద్యం అలవాటు గురించి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. 'నీకు తెలుసా ఎన్నడైనా మందు పోసినవా, మందు కలిపిచ్చినవా' అంటూ కేసీఆర్ కూడా రివర్స్ పంచ్ ఇచ్చారు. రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థులం అంటూ ఎంతగా చెప్పుకున్నా చివరకు వ్యక్తిగత అలవాట్లను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఒకరి చరిత్రను మరొకరు బైట పెట్టుకుంటున్నారు.
రేవంత్‌దీ అదే దారి
మాటలతో ప్రజలను ఆకట్టుకోవడం కేసీఆర్ కళ. ఉద్యమ కాలం నుంచీ ఆయన ప్రసంగాలను వినడానికి జనం ఆసక్తి చూపేవారు. సెటైర్లను విని ఎంజాయ్ చేసేవారు. ఆ స్టయిల్‌నే పీసీసీ చీఫ్ రేవంత్ కూడా ఫాలో అవుతున్నారు. 'తొక్కుతా, వంద అడుగుల లోతులో బొంద పెడతా' అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి 'సిగ్గులేని సన్నాసి, దద్దమ్మ, తాగుబోతు, కేడీ, చీపురు కట్టలతో కొట్టాలి, కండ్లల్లో కారం కొట్టి తరమాలి' ఇలాంటివన్నీ ఆయనకే చెల్లు. కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలును పరిశీలించి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. మహిళా రైతుల ఆగ్రహం చూస్తుంటే 'ఇప్పుడు కేసీఆర్ ఇక్కడకు వచ్చిండంటే సచ్చిండే బిడ్డ' అని వ్యాఖ్యానించారు. వానాకాలం వరిధాన్యం తడిచిపోతూ ఉంటే యాసంగి గురించి కేసీఆర్ ఆలోచిస్తున్నారని 'అసలు వీనికి మతి ఉందా, సోయి ఉండే మాట్లాడుతున్నడా, సంకల ఉన్న పిల్ల పడిపోతూ ఉంటే గాలిలో ఉన్న పిల్లను పట్టుకోడానికి పోయిండంట' అని సెటైర్ వేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను టార్గెట్ చేయడంతో పాటు మొత్తం కుటుంబాన్నే ఈ తిట్ల దండకంలోకి లాగుతున్నారు. 'అయ్యా, కొడుకు, కూతురు, అల్లుడు' అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఆదర్శం ఎక్కడ?
ప్రజలకు ప్రతినిధులు అని చెప్పుకునే వీరు వేష భాషలలో, ఆచార వ్యవహారాలలో ఆదర్శంగా ఉండడానికి బదులుగా అసహ్యించుకునే తీరులో ప్రవర్తిస్తున్నారు. మంచిని నేర్పడం సంగతేమోగానీ చిన్న వయసులోనే నేతల బూతుభాషా పరిజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. సినిమాలే చెడగొతుడున్నాయనుకుంటే ఇప్పుడు నేతలే వారి అశ్లీల పాండిత్యాన్ని ప్రజలకు నేర్పుతున్నారు. జాతీయ నేతలదీ ఇదే తీరు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగాలలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు. ఇలాంటి నేతల తీరును మార్చాల్సింది, వారికి బుద్ధి చెప్పాల్సింది. జ్ఞానోదయం కలిగించాల్సిందీ ప్రజలే. విలువలు, హుందాతనం గురించి ప్రవచనాలు చెప్పే వీరికి ఓటు ద్వారా సంస్కారం నేర్పాల్సిందీ ప్రజలే.
ఎన్. విశ్వనాథ్