సర్కారు దూకుడుకు బ్రేక్

ఉన్నది ఉన్నట్టు

Update: 2021-11-25 11:00 GMT

రాజకీయ పార్టీల దృష్టంతా ఎప్పుడూ ఓటు బ్యాంకు పైనే ఉంటుంది. ఏ పథకం తెచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా దానికోసమే. అధికారంలోకి రావడానికే నేతలు హామీలు ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నింటిని మర్చిపోతారు. మరికొన్నింటిపై మాట మారుస్తారు. చట్టాల విషయంలోనూ అంతే. దూకుడు ప్రదర్శిస్తారు. తాము అనుకున్న ప్రయోజనాలను నెరవేర్చుకోడానికి ప్రయత్నిస్తారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఉపసంహరించుకుంటారు. 'అందితే జుట్టు లేదంటే కాళ్లు' తరహాలో వ్యవహరిస్తారు. కాళ్ళ కింద భూమి కదులుతుందనుకున్నప్పుడు నిస్సిగ్గుగా నిర్ణయం తీసుకుంటారు. మూడు సాగు చట్టాల విషయంలో ప్రధాని మోడీ అదే చేశారు. మూడు రాజధానుల విషయంలో, శాసనమండలి రద్దు విషయంలో ఏపీ సీఎం జగన్ కూడా 'బ్యాక్ టు పెవిలియన్' అనే తీరులో వెనక్కి తగ్గారు. కానీ, ఆ చట్టాల కారణంగా ఇబ్బంది పడిన, ప్రాణాలు కోల్పోయిన రైతుల పట్ల కనీస సానుభూతిని వ్యక్తం చేయలేదు. ఇక దళితులకు మూడెకరాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పథకమే లేదంటూ కొట్టిపారేశారు. అనాలోచితం అనేకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తలకెక్కిన అహమే ఆ పార్టీలను, నేతలను ఆ దిశగా డ్రైవ్ చేస్తున్నది. ఏం చేసినా చెల్లుబాటవుతుందనేదే వారి ధోరణి. ప్రజలు 'మాండేటరీ' ఇచ్చారు అని నియంతృత్వ పోకడను అధికార పార్టీలు ప్రదర్శిస్తాయి. భిన్నాభిప్రాయాన్ని వినడానికి కూడా సిద్ధంగా ఉండవు. తాము చెప్పిందే వేదం అనేది వాటి తీరు. పతనం ప్రారంభమైందని గ్రహించినప్పుడు నిస్సిగ్గుగా మాట మార్చేస్తాయి. ప్రజలలో సానుభూతి కోసం పాకులాడుతాయి. తప్పులు సరిదిద్దుకున్నామంటూ క్షమాపణ తరహాలో ప్రకటనలు ఇస్తుంటాయి. అబద్ధాన్ని కూడా చాలా అందంగా నమ్మిస్తాయి.

నిన్న సరైనది నేడు కాదు

మూడు కొత్త సాగు చట్టాలు రైతాంగం జీవితాలనే మార్చేస్తాయని ప్రధాని సహా కేంద్రంలోని అధికార పార్టీ నేతలంతా పెద్ద లెక్చర్లే ఇచ్చారు. మొత్తం వ్యవసాయ రంగమే పరివర్తన చెందుతుందంటూ బాకా ఊదారు. అదే నిజమైతే ఇప్పుడు ఆ మూడు చట్టాలను ప్రధాని ఎందుకు వెనక్కి తీసుకున్నట్లు? పదమూడు నెలలుగా ఆందోళన చేస్తూ అసువులు బాసిన 700 మందికిపైగా రైతుల కుటుంబాల పట్ల కనీసం సానుభూతిని కూడా ఎందుకు ప్రకటించలేదు? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం, పశ్చిమ జిల్లాలలో సీట్లు జేజారుతున్నాయన్న ఆందోళనే తప్ప రైతుల పట్ల ప్రేమ కాదు. ఒక్క క్షమాపణతో సరిపెట్టారు. అద్భుతమైన చట్టాలే అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నట్లో లేశమాత్రం వివరణ ఇవ్వలేదు. నిజానికి చట్టాలు తేవాలనుకున్నప్పుడు రైతుల, వారి సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండె. కానీ, అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే అహంతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. రైతులకు ఆ చట్టాలు జీవన్మరణ సమస్యగా మారాయి. దీంతో వారు ఆందోళనకు దిగారు. మోడీ ప్రభుత్వం వారి ఉద్యమాన్ని వక్రీకరించింది. అవమానించింది. నిందలు మోపింది. అక్రమ కేసులనూ పెట్టింది. చట్టాలను వ్యతిరేకించినందుకు రైతులు దేశ ద్రోహులయ్యారు. రైతుల ఆందోళనను సమర్థించిన యువత, మేధావులు అర్బన్ నక్సలైట్లయ్యారు. కార్లతో తొక్కించి చంపినవారు అధికారం వెలగబెడుతున్నారు. కానీ, రైతులు ఈ బెదిరింపులకు, వేధింపులకు భయపడలేదు. చివరకు పాలకుల మెడలు వంచారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోక తప్పలేదు. క్షమాపణలు చెప్పినా మోడీ మాటలను ఉత్తరాది రైతులు నమ్మలేదు. అందుకే చట్టాలను పూర్తిగా ఎత్తివేసే వరకు ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు. ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు.

'మూడు' మీద జగన్ తీరూ అంతే

ఏపీ సీఎం జగన్ సైతం మూడు రాజధానుల విషయంలో మోడీ బాటనే అనుసరించారు. మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి ఇప్పుడు దాన్నుంచి వెనక్కి తగ్గారు. ప్రభుత్వం ఊహించని తీరులో అమరావతి పరిరక్షణ ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అమరావతి రైతుల ఆందోళనను, మహా పాదయాత్రను జగన్ హేళన చేశారు. ప్రజలను, రైతులను అవమానించారు. వారికి కులాన్ని అంటగట్టారు. కొన్ని శక్తులు నడిపిస్తున్న ఉద్యమంగా అభివర్ణించారు. చివరకు మూడు రాజధానులపై వెనక్కి తగ్గినా రైతులు ఆందోళనను విరమించలేదు. పాదయాత్రనూ ఆపలేదు. ప్రభుత్వంలో పశ్చాత్తాపం కలిగిందని నమ్మడంలేదు. మరో రూపంలో అమలు చేయడానికి వేసిన ఎత్తుగడ అనే అనుమానిస్తున్నారు. తప్పుడు నిర్ణయం తీసుకోవడం దాన్ని సరిదిద్దుకుంటున్నామనే పేరుతో వెనక్కి తగ్గినా ప్రజలు దాన్ని విశ్వసించడంలేదు.

తెలంగాణలో మూడెకరాల భూమి

తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. దళితులకు మూడెకరాల భూమి విషయంలో ప్రభుత్వం ఒక జీఓనే తెచ్చింది. లబ్ధిదారులను కూడా గుర్తించింది. వారికి భూపంపిణీ చేసింది. స్వయంగా ముఖ్యమంత్రే పట్టణాలను పంపిణీ చేశారు. కానీ, మూడెకరాల హామీని ఎన్నడూ ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా మాట మార్చారు. ఇక ఆ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని కూడా తేల్చేశారు. జీవోను వెనక్కి తీసుకోకపోయినా ఆ పథకమే లేదంటూ దాటవేశారు. విపక్ష సభ్యులు సైతం నోరెత్తలేదు. తెలంగాణలో ఇలాంటి వక్రీకరణలు కోకొల్లలు. నియంత్రిత సాగు, క్రాప్ కాలనీలు అంటూ వరుస సమీక్షలు పెట్టి ప్రకటనలు చేశారు. ఆ తర్వాత 'ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు.. రైస్‌మిల్లరో లేక దాల్ మిల్లరో కాదు. రైతుల పంటల కొనుగోళ్లతో ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇష్టం ఉన్నవారికి రైతులు అమ్ముకోవచ్చు' అనే డిసిషన్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాల విషయంలోనూ కేసీఆర్ వైఖరి విమర్శలకు దారితీసింది. తొలుత వ్యతిరేకించి రోడ్డెక్కి ధర్నాలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానానికి వెనుకాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టాలను ఓవర్ రైడ్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదంటూ సేఫ్ జోన్‌‌లోకి వెళ్ళిపోయారు. సాగు చట్టాలను తూర్పారపట్టి ధర్నా‌చౌక్‌లో మూడు గంటలపాటు నిరసన తెలిపిన టీఆర్ఎస్ చివరకు సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంతోనే టీఆర్ఎస్ ఆ ఫలితాన్ని తన ఖాతాలో వేసుకున్నది.

అహంకారానికి జవాబు

అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారానికి ప్రజలు సమయం వచ్చినప్పుడు ఓట్ల రూపంలో జవాబు చెబుతున్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ ఆ రుచి చూసింది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి స్వీయానుభవమైంది. ఏపీ సీఎం జగన్‌కూ కొన్ని ఒత్తిళ్ళు తప్పలేదు. ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా రూలింగ్ పార్టీలు లెక్కచేయలేదు. రకరకాలుగా భయపెట్టాయి. కానీ ఇప్పుడు ఆ పార్టీలు ఓటుకు భయపడుతున్నాయి. అందుకే హామీలైనా, తిరోగమనమైనా ఎన్నికల సమయంలోనే ప్రకటిస్తున్నాయి.

ఎన్. విశ్వనాథ్


Similar News