ప్రతీ పార్టీకి ఒక ఎజెండా ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కూడా 'స్వరాష్ట్ర సాధనే' లక్ష్యంగా 2001లో ఆవిర్భవించింది. పద్నాలుగేళ్ల వనవాసం తరహాలో 2014 వరకు ఉద్యమంలో గడిచిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ఇప్పుడు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది. ఆ ప్రయాణంలో అనేక వినూత్న సంక్షేమ పథకాలు తెలంగాణకు మాత్రమే సాధ్యం అనే తీరులో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. కొన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు ఇరవై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ నెల 25న ప్లీనరీని, వచ్చే నెల 15న 'విజయగర్జన' పేరుతో బలప్రదర్శనకు సిద్ధమవుతున్నది. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో ఆ పార్టీతోపాటు దాని సారథి కేసీఆర్ ప్రశంసలతో పాటు విమర్శలనూ మూటగట్టుకున్నారు. ఒకే లక్ష్యం కోసం పార్టీని పెట్టి ఇరవై ఏళ్లు నడిపించడం నేటి రాజకీయ పరిస్థితులలో సులభం కాదు. కేసీఆర్ మొండి పట్టుదల, నిర్దేశించుకున్న లక్ష్యం ఆయనకు విజయాన్ని తెచ్చి పెట్టాయి. కానీ, ఈ ప్రయాణంలో ఆయన కొన్ని అపవాదులనూ మోయక తప్పడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మొదటిది తప్ప ఈ ఏడేళ్ల పాలనలో మిగిలిన రెండూ అసంపూర్ణంగానే ఉండిపోయాయి. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి ఎన్ని సర్దుబాటు మాటలు చెప్పినా ప్రజలలో మాత్రం వ్యతిరేకతే ఉన్నది.
మాసిపోని గాయాలు
'పెద్ద కలలు కనడం కూడా తప్పేనా అధ్యక్షా?' అంటూ ఆయన ఇటీవల అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అలాంటి కలలు ఇప్పటికీ కలలుగానే ఉండిపోయాయి. అవి ఆయనను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. దళితుడిని ముఖ్యమంత్రిని చేయడం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, అమరుల కుటుంబాలలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్లు, కాంట్రాక్టు-ఔట్‌సోర్సింగ్ విధానం తొలగింపు, వాటిని రెగ్యులర్ చేయడం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ఇలా కొన్ని పదుల పథకాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. మరికొన్ని గాలిలో వేలాడుతున్నాయి. ఇవి లాజికల్ ఎండ్ దిశగా వెళ్లలేదు. ఎన్ని సమర్థనలు చేసుకున్నా కేసీఆర్‌ను నిరంతరం ఇవి వెంటాడుతూనే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో పవిత్ర స్థలంగా భావించే అసెంబ్లీలో దళితులకు మూడెకరాల భూపంపిణీపై కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయనను గాయపరుస్తూనే ఉంటాయి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాలను లండన్, డల్లాస్, ఇస్తాంబుల్, మాంచెస్టర్ తరహాలో తీర్చిదిద్దుతామనే వ్యాఖ్యలూ ఆయనను గుచ్చుతూనే ఉంటాయి. మాటలతోనే మభ్యపుచ్చుతారనే విమర్శలూ ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. 'మాట ఇస్తే తల నరుక్కుంటగానీ తప్పే ముచ్చటే లేదు' లాంటి మాటలు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత మర్చిపోలేదు.
నాటి ఉద్యమ ద్రోహులకు అందలం
ఇక నీళ్ల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్ని ప్రశంసలు పొందారో విమర్శలూ అంతే స్థాయిలో వెల్లువెత్తాయి. లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన కాళేశ్వరం కట్టి కోటి ఎకరాల మాగాణం అని ఆశించినా, ఇప్పుడు కోటి ఎకరాల మెట్టగా పత్తి పంటకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ పట్ల వివక్ష, సాగునీటి ప్రాజెక్టులలో నిర్లక్ష్యం అనే ముద్రను పోగొట్టుకోలేకపోయారు. నియంత్రిత సాగు, క్రాప్ కాలనీలు, ధారవి తరహాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఇవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. కరోనా విషయంలో పారాసిటమాల్ కామెంట్ సరేసరి. మరణాల లెక్కలను దాచిపెట్టారన్న అపవాదు ఇప్పటికీ తొలుస్తూనే ఉన్నది. జీహెచ్ఎంసీ వరదల సమయంలో తలా పది వేల రూపాయల సాయం ఇచ్చినా శాపనార్థాలు భరించక తప్పలేదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించినవారు, పార్టీని సైద్ధాంతికంగా తప్పుపట్టి తిట్టినవారు నేడు ఆయన పంచన చేరారు. కేబినెట్ మంత్రులుగా కొనసాగుతున్నారు. లాఠీపట్టి ఉద్యమకారులను తరిమికొట్టినవారూ ఆ పార్టీలోనే చేరారు. స్వరాష్ట్రం, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన నేతలు, విద్యార్థులు ఇప్పుడు అంటరాని వారయ్యారు. నాడు ఆయనతో భుజంభుజం కలిచి ఉద్యమంలో పాల్గొన్నవారిని దూరం చేసుకున్నారు. పథకం ప్రకారమే జరిగిందా లేక యాధృచ్ఛికంగా జరిగిందా అనేది అసందర్భమే అయినా యువతలో మాత్రం కేసీఆర్‌పైన అది మచ్చగానే ఉండిపోయింది.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం
ప్రజాస్వామ్యంలో అధికారపక్షంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఉండాలనే స్ఫూర్తిని కేసీఆర్ పదేపదే వల్లె వేస్తుంటారు. గడచిన ఏడేళ్లలో ప్రతిపక్షాలను సమూలంగా నిర్మూలించడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో జరిగిన ఎన్నికలలో బొబాబొటి సీట్లు మాత్రమే వచ్చాయి. అధికారంలోకి వచ్చినా అనుమానం వెంటాడుతూనే ఉన్నది. అందుకే విపక్ష ప్రజా ప్రతినిధులను తనదైన శైలిలో లాగేసుకున్నారు. విపక్షాలను నిర్వీర్యం చేశారు. రెండో టర్ము ఎన్నికలలో ఒకింత బలాన్ని పెంచుకోగలిగారు. అధికారానికి ఢోకా లేకుండా పోయింది. అయినా విపక్ష సభ్యులను నయానో భయాలో తనవైపు తిప్పుకున్నారు. విపక్షాల ఊసు లేకుండా చేయాలనుకున్న పథకాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేశారు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గతంలో అత్యంత ఘోరంగా తిట్టినవారిని సైతం చేర్చుకునే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో విపక్షాలకు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని సంకట పరిస్థితిని సృష్టించాలనుకుంటున్నారు. అసెంబ్లీలో గొంతెత్తే అవకాశం లేకుండా చేశారు. ప్రశ్నించే ప్రజా సంఘాల గొంతునూ నొక్కేశారు. ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ నేతగా ఎదిగినా నిరసనలు చేసే కనీస ప్రజాస్వామ్య హక్కును కూడా కాలరాస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తే కోర్టుకు వెళ్లి సాధించుకోవాల్సి వచ్చింది. ప్రగతిభవన్ ప్రజాధనంతో కట్టుకున్న అధికారిక బంగళా అయినా సామాన్యులకు దరిదాపులకు కూడా వెళ్లలేని కోటగా మారిపోయింది. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల రూపాయలను పోగేసుకున్నదనే బలమైన విమర్శ ఇప్పటిలో పోయేలా లేదు.
ప్రాంతీయ పార్టీల్లో పాపులారిటీ
'తెలుగువారి ఆత్మగౌరవం' నినాదంతో ఉనికిలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మొదటి ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించింది. టీఆర్ఎస్ సైతం అలాంటి గుర్తింపు పొందింది. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్ చతికిలపడింది. 2018 ఎన్నికల్లో మరింత డీలాపడింది. కానీ టీఆర్ఎస్ మాత్రం 2014 ఎన్నికలతో పోలిస్తే 2018లో పుంజుకున్నది. అప్పటివరకూ అదికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ఉనికి కోసం కష్టపడుతున్నాయి. లెఫ్ట్ పార్టీలు సైతం తిరోగమన దిశలోకి జారిపోయాయి. కళ్ళముందు పార్టీలు ఎలా ప్రాభవాన్ని కోల్పోతున్నాయో కేసీఆర్‌కు తెలుసు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ప్రభ మసకబారింది. తమిళనాట ప్రతీ ఐదేళ్ళకోసారి అధికార మార్పిడి జరుగుతున్నది. ఒడిషాలో బీజేడీకి ప్రత్యామ్నాయమే లేకుండాపోయింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైఎస్సార్సీపీల తాజా పరిస్థితి తెలుస్తూనే ఉన్నది. వీటిని బేరీజు వేసుకుని టీఆర్ఎస్ ఎలా ఉండాలో, సంస్థాగతంగా ఎలాంటి మార్పులు జరగాలో మేధోమథనం జరుగుతున్నది.
భవిష్యత్ గమ్యమెటువైపు?
వరుసగా రెండు టర్ములు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కనీసంగా ఇంకో నాలుగు టర్ములు ఉంటామనే ధీమాతో ఉన్నది. ఇంకో ఇరవై ఏళ్లు మనమే ఉంటామంటూ కేటీఆర్ అంటున్నారు. వచ్చే టర్ము కూడా మనమే ఉంటామంటూ దళితబంధు ప్రస్తావన సందర్భంగా కేసీఆర్ అంటున్నారు. పార్టీ నేతలుగా వారిలో ఆ కాన్ఫిడెన్సు ఉన్నది. అదే సమయంలో ఏడేళ్ల పాలనలో మొదటి టర్ములో కూల్‌గానే ఉన్న ప్రజలలో గత రెండేళ్లుగా వ్యతిరేకత పెరుగుతున్నది. కంచుకోట లాంటి దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్‌ను చేజార్చుకున్నది. జీహెచ్ఎంసీలో ఊహించని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నది. ఇప్పుడు హుజూరాబాద్‌లో ఎదురీదుతున్నది. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, 24 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్, కాళేశ్వరం, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, బస్తీ దవఖాన, తెలంగాణ డయాగ్నస్టిక్, హాస్టళ్ళకు సన్నబియ్యం, తాజాగా దళితబంధు లాంటి పదుల సంఖ్యలో వినూత్న పథకాలను అమలుచేస్తున్నా పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రత్యామ్నాయం ఉండకూడదని ఇంతకాలం విపక్షాలను తొక్కేసినా బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక మేరకు బలపడుతున్నాయి. ఓట్ల చీలిక ఆ పార్టీని భయపెడుతున్నది. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్నా కేసీఆర్ కుటుంబానికే అది బంగారంగా మారిందనే విమర్శలూ తప్పడంలేదు.
ఇంటిపోరు ఇంతింత కాదయా
ప్రతిపక్షాలవైపు నుంచే కాక ఇంటిపోరు కూడా కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. కేసీఆర్ రాజకీయ వారసులెవరనే చర్చ ఆ పార్టీలో మొదలైంది. గ్రూపులు ఏర్పడ్డాయి. అది ఆ పార్టీకి అంతర్గత వ్యవహారమే కావచ్చు కానీ, భవిష్యత్తులో ఏమవుతుందోననే చర్చ జరుగుతున్నది. ఇరవై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు ప్లీనరీ జరుపుకోబోతున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు, కేటీఆర్ రాష్ట్రానికి అనే ఊహాగానాలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటి నడుమ సంస్థాగతంగా ఆ పార్టీ గమ్యం ఎటువైపు? పాలనాపరంగా బంగారు తెలంగాణ ప్రయాణం ఎక్కడిదాకా? గతంలో జ్యోతిబసు తరహాలో, ఇప్పుడు నవీన్ పట్నాయక్‌లాగా, తాజాగా మమతాబెనర్జీ హాట్రిక్.. ఇవన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ కళ్లముందు తాజా పరిణామాలు. భవిష్యత్ విజన్ ఎటువైపో ప్లీనరీలో వెల్లడికానున్నది.
ఎన్. విశ్వనాథ్