తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు? కాంగ్రెస్సా? బీజేపీయా? ఈ రెండు పార్టీలూ మేమంటే మేమని పోటీ పడుతున్నాయి. అందుకే ఈ రెండూ జనం బాట పట్టాయి. ఒక పార్టీ పాదయాత్ర మార్గం ఎంచుకున్నది. మరో పార్టీ ప్రజల సమస్యలతో జనంలోకి వెళ్తున్నది. ఇకపైన జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసమే ఈ ఆరాటమంతా. టీఆర్ఎస్ సైతం ఆ దిశగానే అడుగులు వేస్తున్నది. టీఆర్ఎస్ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఏ మేరకు ఉన్నది, దాన్ని ఏ రకంగా ఆకర్షించాలన్నదే కీలకం.
కొత్తగా పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి రానున్న కాలమంతా అగ్నిపరీక్షే. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించాలన్నది ఆయన డ్రీమ్. ఒకవైపు పార్టీలో అంతర్గత పోరు, సహాయక నిరాకరణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోవడంలో సతమతమవుతున్నారు. ప్రభుత్వం 'దళితబంధు'ను తెరపైకి తేగానే దళిత-గిరిజన దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరాశావాదంలో ఉన్న యువతను ఆకర్షించడానికి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని తీసుకున్నారు. జనంలోకి వెళ్లడమే ఏకైక మార్గమని భావించారు. అయితే ఇప్పుడు దాన్ని ఓటుబ్యాంకుగా మల్చుకోవడం ఆయన ముందున్న అతి పెద్ద టాస్క్.
అది మాత్రమే దారి
ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏకైక అనుకూల అంశం. ఈ వ్యతిరేకత ఏ మేరకు ఉన్నదనే అంచనా లేదు. నిరుద్యోగుల అసంతృప్తిని అనుకూలంగా మల్చుకోడానికి జంగ్ సైరన్ కార్యక్రమాన్ని చేపట్టింది. భవిష్యత్తులో ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన తర్వాత ఈ కార్యక్రమం వర్కవుట్ కాదు. మళ్లీ కొత్త నినాదం తప్పదు. ప్రభుత్వ వ్యతిరేకతే పార్టీ విధానంగా కొనసాగుతున్నది. ఏదో ఒక అద్భుతం చేయకపోతే ప్రజలు ఆ పార్టీని విశ్వసించడం కష్టం. ఇందుకోసం స్పష్టమైన విధానం, నినాదం ఆ పార్టీకి తక్షణ కర్తవ్యంగా మారింది. వైఎస్సార్ పాదయాత్ర చేసిన సందర్భం, అప్పుడున్న పరిస్థితులు భిన్నమైనవి. చంద్రబాబు పాలన పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత, వాతావరణ ప్రతికూల పరిస్థితులలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆర్థిక సంస్కరణలతో ఛిన్నాభిన్నమైన జీవితాలు. ఇలాంటివి వైఎస్సార్‌కు అస్త్రంగా మారాయి. సంక్షేమ పథకాలు ప్రజలు చుక్కానిలా నిలిచాయి. చివరికి అధికారంలోకి రాగలిగింది. మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ జగన్ 'నవరత్నాలు' నినాదాన్ని వినిపించారు. ప్రజలకు ఈ పథకాలు డైరెక్టుగా కనెక్ట్ అయ్యాయి. భారీ స్థాయిలో ఖర్చు చేయక తప్పలేదు. నేటి రాజకీయాలలో మనీ పవర్ చాలా బలమైనదిగా ఆవిర్భవించింది.
నినాదం కరువు
ఇప్పుడు తెలంగాణలోని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఒక బలమైన నినాదం లేదు. ఇప్పటికీ ఆ పార్టీకి క్లారిటీ లేదు. ఉన్నదల్లా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఆదుకుంటుందనేదే. ఇది ఒక్కటే సరిపోదు. స్పష్టమైన భవిష్యత్ కార్యాచరణ, ప్రజలు విశ్వసించే రోడ్ మ్యాప్ కూడా అవసరం. నోట్ల ప్రవాహం రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్‌కు ఎదురీతే. కులాలవారీగా ఓటర్లు చీలిపోయిన తర్వాత వారికి నమ్మకం కలిగించే ఆ కులానికి చెందిన నేతలు కూడా కరువయ్యారు. ఇప్పటికీ దాదాపు సగం నియోజకవర్గాలలో ఆ పార్టీకి అభ్యర్థులే లేరు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గాన్నే చూసుకుంటే ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉన్నదో తేలిపోతుంది.
లక్ష్యం దీర్ఘకాలికంగా నిర్దేశించుకున్నది. హుజూరాబాద్ మీద ఆ పార్టీకి ఫోకస్ లేకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే టార్గెట్‌గా పెట్టుకుని ఉండొచ్చు. నియోజకవర్గ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కేడర్ లేని పరిస్థితులలో ప్రజలలోకి వెళ్లేదెలా అనేదే ఆ పార్టీని ఇప్పుడు పీడిస్తున్న సమస్య. ప్రతిపక్షాలను కూకటివేళ్లతో పెకిలించే వ్యూహంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. పార్టీలో సీనియర్ నేతలను అనుకూలంగా మల్చుకోగలిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలనూ తనవైపు తిప్పుకున్నారు. పార్టీకి క్షేత్రస్థాయిలో లీడర్ లేకుండా చేయగలిగారు. కేడర్‌ను కూడా కాంగ్రెస్‌కు దూరం చేశారు.
ప్రజలకు భరోసా ఏది?
ఈ గ్యాప్‌ను భర్తీ చేసుకోవడం సవాలుగా మారింది. డబ్బులతో ముడిపడిన వ్యవహారాన్ని చక్కదిద్దడానికి ముందుకొచ్చే నేతలెవరు? బహిరంగ సభలకు వేలు, లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. అందులో ఓటు బ్యాంకుగా మారేదెంత? ఆ పార్టీ నేతలకే అనేక అనుమానాలున్నాయి. జాతీయస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో రాష్ట్రంలోనూ అదే తీరులో ఉంది. ప్రజలకు కావాల్సింది స్పష్టమైన ప్రత్యామ్నాయం. నిర్దిష్టమైన భరోసా. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దగ్గర అది లేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు భిన్నంగా కాంగ్రెస్ ఏం చూపగలుగుతుంది? కొత్తగా ఓటర్లుగా మారుతున్న యువతకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆశలు లేవు. ఆ మాటకొస్తే యువతకు ఆ పార్టీలో కనిపిస్తున్న అద్భుతం కూడా లేదు. ఇదంతా పార్టీకి ఒక ప్రతికూల అంశం. ఇదే సమయంలో రేవంత్ నాయకత్వాన్ని ఆ పార్టీ నేతలే పూర్తి స్థాయిలో స్వీకరించడంలేదు. ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి లాగే వాతావరణం ఉన్నది. తొలుత ఇంటిని చక్కదిద్దుకోవడం ఆయనకు అనివార్యమైంది. అయితే జనం బాట పట్టిన తర్వాత అనివార్యంలో లీడర్లు రాక తప్పదనే అభిప్రాయమూ ఆ పార్టీలో కనిపిస్తున్నది. జనం సమస్యతో కలిసిరాని నేతలు అనివార్యంగా ఒంటరి అవుతారనే భావన కూడా ఉన్నది.
ఓటు బ్యాంకు ప్రశ్నార్థకం
ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీకి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. దాని భవిష్యత్ ప్రయాణమంతా ముళ్లబాటే. ఇంతకాలం దానికంటూ ఉన్న సంప్రదాయక ఓటు బ్యాంకు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు దళితబంధు. మరోవైపు దళిత ఓటర్లలో చీలిక ఏర్పడేలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్‌పీ ప్రయాణం. ఇంకోవైపు వైఎస్ఆర్ అభిమానులుగా ఉండేవారిని చీల్చడానికి షర్మిల పార్టీ. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీ స్థాయిలోనే చీలనున్నాయి. ఈ చీలిక కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ప్రతికూలంగా మారనున్నది. ప్రజా సమస్యల విషయంలో అన్ని విపక్ష పార్టీలను ఒక్క తాటి మీదకు తేగలిగారు. కానీ, హుజూరాబాద్ ఎన్నిక దగ్గర మాత్రం ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఇన్ని సవాళ్ల నడుమ రేవంత్‌రెడ్డి తనదైన ముద్రను ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారన్నది ఆసక్తికరం. దీర్ఘకాలిక అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న రేవంత్ హుజూరాబాద్ ఉప ఎన్నికను లైట్‌గానే తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీ కూడా ప్రయత్నిస్తున్నది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌నూ ఎదుర్కోవాలి. ఇందుకోసం పకడ్బందీ వ్యూహం ఒక్కటే సరిపోదు. ఆ రెండు పార్టీలకు భిన్నమైన నినాదాన్ని, విధానాన్ని, ప్రజల్లో సరికొత్త భరోసాను కలిగించాలి. అప్పుడే కాంగ్రెస్ పట్ల ప్రజలు మొగ్గుచూపుతారు. ఇదే ఇప్పుడు రేవంత్ ముందున్న అతి పెద్ద సవాలు.
ఎన్. విశ్వనాథ్