అన్నదాతను ఆగం చేస్తున్నరు

ఉన్నది ఉన్నట్టు

Update: 2021-10-07 10:30 GMT

రైతుల ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేస్తానని ప్రధాని మోడీ అంటున్నారు. ఇందుకు 2022 సంవత్సరాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే సంపన్నులుగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. కానీ, వీరిద్దరూ మాటలకు మాత్రమే పరిమితమయ్యారు. కొత్త సాగు చట్టాల పేరుతో రైతుల నడ్డి విరుస్తున్నది కేంద్రం. స్పష్టమైన వ్యవసాయ విధానాన్ని అమలుచేయడంలో విఫలమవుతున్నది తెలంగాణ. ఎరువులు, విత్తనాలు, సబ్సిడీ, పంట నష్టం, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు, పంటల బీమా లాంటి అనేక విషయాలలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. వైఫల్యాలకు గత ప్రభుత్వాలు, పాలకులే కారణమంటూ తప్పించుకోవడం ప్రభుత్వాలకు ఒక అలవాటుగానే మారింది. తెలంగాణ అధికార పార్టీ నేతలు సైతం అందుకు మినహాయింపు కాదు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి దేశంలోనే టాప్ అని ఒక మంత్రి గొప్పగా చెప్పుకుంటారు. కోటి ఎకరాల మాగాణిగా మారిందని మరో మంత్రి చెప్తారు. రైతుబంధుతో రైతుల జీవితాలలోనే వెలుగు వచ్చిందని ఇంకొకరంటారు. ఇప్పటికీ రైతులు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారో ప్రస్తావించరు. వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఎందుకు ఇవ్వరో చెప్పరు. పంట బీమా పథకాన్ని అమలుచేయరు.

దేనిపైనా స్పష్టత లేదు

నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి సాగు విధానంపై స్పష్టత లేదు. ఒకసారి నియంత్రిత సాగు అని రోజులకొద్దీ రివ్యూలు చేసి దేశంలోనే అద్భుతమైన పాలసీ అంటూ ఊదరగొట్టింది. ఇంకోసారి సన్న బియ్యం మాత్రమే వేయాలని హుకుం జారీ చేసింది. ఇప్పుడు వరి సాగును తగ్గించుకోవాలని చెప్తున్నది. పత్తి సాగును పెంచాలని సూచించింది. వరి ధాన్యాన్ని పూర్తిగా కొనలేమని చెప్తున్నది. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని నొక్కిచెప్పింది. కొనుగోళ్ళు, అమ్మకాలపై గందరగోళపు ప్రకటనలు చేస్తున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. మంత్రులు ఇతర రాష్ట్రాల పర్యటనలూ చేసి వచ్చారు. కానీ, అనుకున్నట్లుగా జరగలేదు. రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగించడానికి ఏరియా ఎక్స్‌టెన్షన్ అధికారులను సర్కారు నియమించింది. రైతు వేదికలను నిర్మించింది. రైతు సమన్వయ సమితులను నెలకొల్పింది. ఇవేవీ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. రైతులకు మెళకువలను అందించే సంగతేమోగానీ సరికొత్త గందరగోళానికి ప్రభుత్వ విధానాలు కారణమవుతున్నాయి. తొలుత కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కింది. ఇప్పుడు దానిపై మౌనంగా ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఉందని గొప్పగానే చెప్పుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని తనకు తానుగా కితాబునిచ్చుకున్నది.

సర్వరోగ నివారిణిగా రైతుబంధు

ఇప్పుడు వరి సాగు చేయవద్దని, ఎఫ్‌సీఐ కొనడం లేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపెట్టి చేతులు దులుపుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కష్టకాలంలో అన్ని రంగాలూ కుదేలైనా వ్యవసాయ రంగం రాష్ట్రం మొత్తాన్ని ఆదుకున్నదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మూడేళ్లుగా పంటలబీమా పథకం అమలుకావడంలేదు. అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడంలేదు. కనీసం లెక్కలు తీసి అధికారికంగా చెప్పడమూ లేదు. రైతుబంధు గురించి గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ఇతర సౌకర్యాలన్నింటినీ బుట్టదాఖలా చేసింది. ఫసల్ బీమా యోజన అమలుచేయడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. పంటలు నష్టపోతే పరిహారం ఊసెత్తడంలేదు. పంటలను మార్కెట్ ద్వారా కొంటామనే హామీ ఇవ్వడంలేదు. బ్యాంకుల ద్వారా రుణాలు పుట్టడంలేదు. విడతలవారీ రుణమాఫీతో ఫలితం లేకుండాపోతున్నది. ఒక్క రైతుబంధు పథకంతో అన్నింటినీ అటకెక్కించింది. సంప్రదాయ యూరియాను పక్కనబెట్టి నానో యూరియాను తెరపైకి తెచ్చింది. చివరకు యూరియా కోసం చెప్పుల్ని క్యూలో పెట్టాల్సి వస్తున్నది.

కోట్లు ఖర్చు చేస్తున్నా

రైతుబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సగటున ఏటా 13,500 కోట్లను ఖర్చు చేస్తున్నది. అకాల వర్షాలతో అందులో సగానికి పైగా పంట నష్టానికే సరిపోతున్నది. రైతుబంధు ఇస్తున్నామన్న సాకుతో నష్టపరిహారం ఇవ్వడాన్ని ఎగ్గొట్టింది. గతేడాది సెప్టెంబరు, అక్టోబరు వర్షాలకు సాయం అందలేదు. పంట నష్టం అంచనా సుమారు రూ. 7200 కోట్లు. తక్షణం కనీసంగా రూ. 1300 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నివేదించింది. విపత్తు నిర్వహణ కింద ఉన్న నిధులలోంచి వాడుకోవాలని కేంద్రం హితవు పలికింది. చివరకు గత వారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయాల్సివచ్చింది. నాలుగు నెలలలో రైతులకు చెల్లించాలని ఆదేశించింది. రైతుబంధు ద్వారా 52 లక్షల మందికి సాయం అందుతూ ఉంటే సుమారు 16 లక్షల మంది పంటను నష్టపోయారు. పైగా రైతుబంధు సాయంలో కేవలం పావు వంతు మందే పేద రైతులు. వీరికి సగటున రెండు ఎకరాలలోపే సాగుభూమి ఉన్నది. ఒక్క సీజన్‌కు రైతుబంధు పేరుతో ప్రభుత్వం ఏడున్నర వేల కోట్ల రూపాయలను ఇస్తున్నది. వీరికి అందుతున్నది రూ. 1,660 కోట్లు మాత్రమే. మిగిలినదంతా సంపన్న రైతులకే లబ్ధి చేకూరుస్తున్నది. ఈ సంవత్సరం జూన్, జూలై, సెప్టెంబరు నెలలలో కురిసిన వర్షాలకు సుమారు రూ. 3000 కోట్ల మేర నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంచనా లెక్కలు తీయొద్దంటూ మౌఖిక ఉత్తర్వులు ఇచ్చింది.

ఆత్మహత్యలు ఆగగడం లేదు

రైతుబీమా పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో 66 వేల మందికి పైగా రైతులు చనిపోయారు. వీరంతా 59 ఏళ్లలోపువారే. ఆ వయసుదాటినవారి లెక్కలు లేవు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించకపోవడంతో చనిపోయిన ఆ రైతుల లెక్కలూ లేవు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉన్నది. రైతుబీమా లెక్కలనే పరిశీలిస్తే 2019-20లో 19 వేల మందికి పైచిలుకు రైతులు చనిపోతే గతేడాది (2020-21)లో 28 వేల మందికి పైగా చనిపోయారు. ప్రతీ రోజు సగటున పాతిక మందికంటే ఎక్కువ సంఖ్యలోనే రైతులు చనిపోతున్నారు. రాష్ట్రంలో రైతులను సంపన్నులుగా తీర్చిదిద్దే సంగతిని పక్కన పెడితే ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ. 1.52 లక్షల అప్పు ఉన్నది. ఆదాయం మాత్రం నెలకు పది వేల రూపాయలు కూడా దాటడంలేదు. ఆర్థిక వృద్ధి రేటు పెరిగిందని, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2.52 లక్షలు అని గొప్పగా చెప్పుకుంటున్నా రైతులకు మాత్రం రూ. 9,403గా మాత్రమే ఉన్నట్లు తాజా ఎన్ఎస్ఎస్ఓ సర్వే ద్వారా తేలింది. జాతీయ సగటుతో పోలిస్తే తలసరి ఆదాయం తెలంగాణలో ఎక్కువగా ఉన్నా రైతుల ఆదాయం మాత్రం తగ్గిపోయింది. ఇప్పటికీ ప్రభుత్వ, గ్రామీణ బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులకంటే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకుంటున్నదే ఎక్కువ. రైతుల అప్పుల్లో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉన్నది.

ఎక్కడి గొంగడి అక్కడే

పట్టణాలలో ఉండే పది శాతం మంది ప్రజల దగ్గర 58 శాతానికి పైగా ఆస్తులు పోగుపడి ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్ల మేర సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగినా రైతుల ఆదాయం, ఆస్తులు మాత్రం 'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' తరహాలోనే ఉండిపోయాయి. పండించిన పంటకు అయ్యే ఖర్చు మీద కనీసంగా 50 శాతం గిట్టుబాటు ధర ఉండాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫారసులను కేంద్రం అమలు చేయడం లేదు. ఐదేళ్లకు సరిపోయేంత వరి ధాన్యం స్టాకు ఉన్నందున కొనలేమంటూ కేంద్రం చెబుతున్నది. మరోవైపు తినడానికి దొరకక ఒక రూపాయి రేషను బియ్యం కోసం ఎదురుచూసే జనం కోట్లలో ఉన్నారు. వ్యవసాయ రంగంపైనా, రైతుల జీవన పరిస్థితులపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. స్పష్టమైన విధానమూ లేదు. ఒక్కోసారి ఒక్కో మాట చెప్తున్నాయి. రకరకాల హామీలు ఇస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఎప్పుడూ ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని పొలిటికల్ పార్టీలు వాడుకుంటున్నాయి. అన్ని ఉత్పత్తులకూ వాటిని తయారు చేసిన కంపెనీలే ధర నిర్ణయించుకుంటుంటే ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే దానికి నోచుకోలేకపోతున్నదనే సాధారణ అభిప్రాయం నెలకొన్నది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా స్పష్టమైన విధానాలు రూపొందించుకోవడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యంగా ఉండాలి.

ఎన్. విశ్వనాథ్


Similar News