గాడి తప్పిన పాలన

ఉన్నది ఉన్నట్టు

Update: 2021-09-30 10:30 GMT

మన ఆఫీసర్లు మహా ముదుర్లు. ఎవ్వరి మాటా వినరు. పేరుకే పబ్లిక్ సర్వెంట్లు. కానీ, పబ్లిక్‌కు జవాబుదారీగా ఉండరు. అధికార పార్టీ నేతలకు మాత్రం 'జీ హుజూర్' అనేలా వ్యవహరిస్తారు. ప్రజల సమస్యలు అసలే పట్టవు. నేతలు చెప్పిన పనిని మాత్రం ఠంచనుగా చేసేస్తారు. తీసుకుంటున్న జీతం ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుల నుంచి. కానీ తరిస్తున్నది మాత్రం రాజకీయ పార్టీల కనుసన్నలలో. సుపరిపాలన సంగతేమోగానీ అసలు పరిపాలనే గాడి తప్పింది. అటు ప్రభుత్వానికీ పట్టదు. ఇటు అధికారులకు అంతకన్నా పట్టింపు ఉండదు. ఆఫీసర్లుగా, వివిధ విభాగాల హెడ్‌లుగా ఉన్న ఉన్నతాధికారులు వారి కింద ఎంత మంది పనిచేస్తున్నారో లెక్కలు తేల్చడానికి పది నెలలు పట్టిందంటే ఎంత గొప్పగా పనిచేస్తున్నారో తేలిపోతుంది. ఆ మాటకొస్తే రాష్ట్రంలో అన్ని శాఖలు, విభాగాలలో ఎంత మంది ఉద్యోగులు ఏయే స్థాయిలలో పనిచేస్తున్నారో ఇప్పటికీ లెక్కలు లేవు. ముఖ్యమంత్రి మొదలు సెక్షన్ ఆఫీసర్ వరకు అందరికీ అయోమయమే. గతేడాది డిసెంబరు 13న యాభై వేల కొలువులను భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికీ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో, ఎన్నింటిని భర్తీ చేయాలో క్లారిటీ లేదు. అందుకే నోటిఫికేషన్ల ప్రక్రియ సాగుతూనే ఉన్నది.

లెక్కలు తేలేదెపుడో?

ఆయా విభాగాలలో ఎన్ని శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయో, ఎంత మంది పనిచేస్తున్నారో, ఎన్ని ఖాళీగా ఉన్నాయో, ఎన్ని డిప్యూటేషన్ పోస్టులో, ఎన్ని కాంట్రాక్టు-ఔట్‌సోర్సింగ్ పోస్టులో ఇప్పటికీ లెక్కల్లేవ్. ప్రతీ నెలా ఖజానా నుంచి ప్రభుత్వ ధనం జీతాల రూపంలో వెళ్లిపోతున్నా ఉద్యోగుల సంఖ్య మాత్రం తేలడంలేదు. ఏడేళ్లుగా ఈ కసరత్తు జరుగుతూనే ఉన్నది. 'రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా' అంటూ సీఎం వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ, రాజు తల్చుకున్నా ఇప్పటికీ కచ్చితమైన వివరాలు దొరకలేదు. ఇదే కాదు, ధరణి సమస్య కూడా అదే తీరులో ఉంది. అంతా భేషుగ్గా ఉందంటూ సీఎస్, సీఎం చాలాసార్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని మొత్తుకున్నా పట్టించుకోలేదు. చివరకు కేబినెట్ సబ్ కమిటీ వేయక తప్పలేదు. ఎవరు ఎవరిని నమ్మిస్తున్నారో అంతుచిక్కదు. నిజంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఉద్యోగుల లెక్కలు దొరకవా? తేల్చడం సాధ్యం కాదా? అయినా ఎందుకు కుదరడంలేదు? సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఒక్క రోజులోనే మూడున్నర కోట్ల మంది వివరాలను రాబట్టగలిగిన సర్కారుకు నిజంగా మూడున్నర లక్షల మంది ఉద్యోగుల వివరాలను సేకరించడం కుదరని పని అవుతుందా? అయినా, ఎందుకు జాప్యం జరుగుతున్నది? అధికారులలో బద్ధకమా? నిర్లక్ష్యమా? బాధ్యతారాహిత్యమా? చిత్తశుద్ధి లేకపోవడమా? అటు ప్రభుత్వమూ, ఇటు అధికారులూ కలిసి ఉద్దేశపూర్వకంగా నడిపిస్తున్న డ్రామానా? ఇదీ ఇప్పుడు నిరుద్యోగులలో, సామాన్య ప్రజలలో కలుగుతున్న సందేహం. రోజుల వ్యవధిలో సేకరించాల్సిన వివరాలను ఇంకా కొలిక్కి తీసుకురాకపోవడానికి కారణమేంటి? జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నా వారిపై ప్రభుత్వం ఎందుకు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నది?

ఎంతకాలమీ 'జీ హుజూర్'

ప్రభుత్వాన్ని అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారా? లేక ప్రభుత్వానికి వాస్తవిక విషయాలు అర్థం కాకుండా 'డార్క్'లో ఉంచుతున్నారా? అధికారులు అన్నింటికీ తలూపుతూ 'జీ హుజూర్' అంటున్నారా? అధికారులు చెప్పిన పని మాత్రమే చేయాలి తప్ప అత్యుత్సాహం చూపొద్దని హుకుం జారీ అయిందా? లేక పెద్దల మెప్పు పొందితే చాలు.. పనులు అయినా కాకపోయినా పెద్దగా ఫరక్ పడేదేమీ లేదని లైట్‌గా తీసుకుంటున్నారా? ఏదేమైనా అటు ప్రభుత్వమూ గట్టిగా అధికారులను మందలించి వివరాలను తెప్పించుకోలేకపోతున్నది. ఇటు అధికారులూ సీరియస్‌గా పనిచేసి లెక్కలు తేల్చాలని అనుకోవడంలేదు. చల్తీ కా నామ్... తరహాలో పరిపాలన సాగుతున్నది. ప్రత్యర్థిగా మారిన ఒక రాజకీయ నాయకుడి అక్రమ భూకబ్జాల వ్యవహారాన్ని గంటల్లో తేల్చాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగలుగుతుంది. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ ప్రభుత్వ అధికారులు అంతకంటే వేగంగా గంటల్లోనే నివేదిక సమర్పించగలుగుతున్నారు. హుజూరాబాద్ మీద కనిపించిన వేగం రాష్ట్రమంతటా అదే తీరులో ఎందుకు ఉండడం లేదనే సందేహం కలగడం సహజం. కానీ అన్ని విషయంలో ఈ వేగం కనిపించదు. నిజంగా ఉద్యోగుల లెక్క తేల్చి ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయో గుర్తించండి అంటూ ప్రభుత్వం సీరియస్‌గా చెప్తే అన్ని శాఖల వారీగా వివరాలను సేకరించడం కష్టమైన పనేమీ కాదు.

ఎందుకు సాధ్యం కాదో?

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని శాఖల అధికారులూ వారి పరిధిలోని సంక్షేమ పథకాలకు ఏడేళ్ళలో చేసిన ఖర్చు, లబ్ధిదారుల సంఖ్య లాంటి వివరాలను జిల్లాలవారీగా ఇవ్వాలంటూ ప్రధాన కార్యదర్శి హుకుం జారీచేస్తే వందల సంఖ్యలో పేజీల్లో డాటా వచ్చి వాలి పడింది. ఇంతటి నెట్‌వర్క్, సామర్ధ్యం ఉన్న సిబ్బందికి ఇప్పుడు ఉద్యోగుల లెక్కలు తీయడం ఎందుకు సాధ్యం కావడంలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ మాటకొస్తే అసలు కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిందే పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి. అయినా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఎందుకు రావడంలేదు? దీంతోనే అటు ప్రభుత్వ చిత్తశుద్ధినీ, ఇటు ఉన్నతాధికారుల నిజాయితీని శంకించాల్సి వస్తున్నది.

ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు కేవలం ఒక్క అంశం మాత్రమే. ఇలాంటి అంశాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ప్రతీ ప్రభుత్వం ప్రజలకు మంచి సేవలు అందించాలనే కోరుకుంటుంది. తెలంగాణ సైతం అందుకు మినహాయింపేమీ కాదు. సుపరిపాలన కోసం ప్రత్యేకంగా 'సెంటర్ పర్ గుడ్ గవర్నెన్స్' అనే వ్యవస్థనే నెలకొల్పింది. కానీ రాష్ట్రంలో సుపరిపాలన సంగతేమోగానీ అసలు పరిపాలన అనేదే ఉన్నదా ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన సందేహాన్ని వెలిబుచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కొత్త జిల్లాలు అంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నది. జిల్లలైతే ఏర్పడ్డాయిగానీ ప్రజలకు సేవల్లో మాత్రం పెద్దగా ఒరిగిందేమీ లేదు.

సమస్యలను వినేవారే లేరు

ఇప్పటికీ సామాన్యులకు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక వ్యవస్థే లేదు. గ్రీవెన్స్ సెల్ లేదు. ప్రతీ వారం జరిగే ప్రజాదర్బార్ లేదు. జిల్లా స్థాయిలో జరిగే ప్రజావాణి అటకెక్కింది. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకున్నప్పుడు అధికారులపై దాడులు జరుగుతున్నాయి. నిస్సహాయ పరిస్థితుల్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. ప్రజలకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపే వ్యవస్థే లేదు. ఫలితంగా పాలకులు అనుకున్న తీరులో పాలన సాగడంలేదు.

ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బ్యూరోక్రాట్లు, వారి కిందిస్థాయిలో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా లేరు. ప్రజా ప్రతినిధులు వారికి నచ్చిన వ్యక్తులకు పోస్టింగ్ ఇప్పించుకుంటున్నారు. నచ్చనివారిని బదిలీ చేయించుకుంటున్నారు. వారి కనుసన్నల్లోనే అధికారులు, ప్రభుత్వ సిబ్బంది పనిచేసే సంస్కృతి కొనసాగుతున్నది. అధికారులు అధికార పార్టీ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. ఇక సన్మానాలు, పాలాభిషేకాలు, కృతజ్ఞతా సభలు, చివరకు పాదాభివందనాలు సరేసరి. పేరుకే సర్వీసు రూల్ బుక్. కానీ కార్యాచరణ మాత్రం దానితో సంబంధం లేకుండా జరిగిపోతుంది. 'జీ హుజూర్' పద్ధతికి అలవాటుపడి పాలనను గాడిన పెట్టాల్సిన బాధ్యత నుంచి పక్కకు తప్పుకున్నారు.

కేంద్రీకృత పాలన

విధాన నిర్ణయాలన్నీ ప్రగతిభవన్ కేంద్రంగానే జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలోని ఇబ్బందులు, ప్రాక్టికల్ సమస్యలు ప్రభుత్వం దాకా వెళ్లడంలేదు. వివరించాల్సిన అధికారులూ మౌనంగానే ఉండిపోతున్నారు. అధికారులే ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రే అధికారులను అప్రాధాన్యం చేసి అమలుకు సాధ్యం కాని నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే సందేహానికి సమాధానం దొరకదు. సంబంధిత శాఖ మంత్రి, ఆ శాఖ అధికారి లేకుండానే సమీక్షలు జరిగిపోతుంటాయి. అధికారిక నిర్ణయాలకు, అమలుకు పొంతన కుదరడంలేదు. చెప్పింది చేయడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. పాలకులు కూడా సహజంగా దాన్నే కోరుకుంటున్నారు. స్వంతంగా చొరవ తీసుకుని పనిచేసేవారిని చూసి సహించలేకపోతున్నారు. ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య వారధలో ఉండాల్సిన అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం లేకుండా, పారదర్శకత నెలకొనకుండా, చిత్తశుద్ధిని ప్రదర్శించకుండా ఎన్ని కొత్త జిల్లాలు పెట్టినా, ఎన్నిసార్లు సమీక్ష చేసినా ప్రయోజనం ఉండదు. ముందుగా పరిపాలన గాడిన పడితే ఆ తర్వాత సుపరిపాలన దానంతటదే వస్తుంది. ఓట్లు, రాజకీయ ప్రయోజనం కంటే ప్రజలు, వారి సమస్యలు, వారికి అందించాల్సిన సేవలు ప్రధానం అనే భావన నెలకొంటే అటు రాజకీయ నాయకులు, ఇటు అధికారుల్లో మార్పు వస్తుంది. ఆ మార్పుకు బీజం వేయాల్సింది కూడా ఇప్పుడు ప్రజలే.

ఎన్. విశ్వనాథ్


Similar News