ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజల్లో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తేవడం, ప్రజల్లో ఎమోషన్స్ రేకెత్తించడం టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నది. కేంద్రాన్ని ఇరుకున పెట్టే ఎత్తుగడ వేసింది. గడచిన ఏడేళ్లలో జరిగిన అనేక ఎన్నికలు, ఉప ఎన్నికల్లోనూ ఇది స్పష్టమైంది. తాజాగా వరి ధాన్యం కొనుగోళ్ల అంశంలో ఎఫ్‌సీఐని టార్గెట్ చేసింది. నెపాన్ని కేంద్రం మీదకు నెట్టింది. ఇక విభజన చట్టంలోని అంశాలనూ ఏకరువు పెడుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నది. బీజేపీని కార్నర్ చేయడానికి, ప్రజల్లో సెంటిమెంట్‌ను రాజేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చన్న వ్యూహంలో భాగమే ఇదంతా. దుబ్బాక ఎన్నికలో ధాన్యం సేకరణలో రైతులకు బోనస్ అంశాన్ని ప్రచారంలో వాడుకున్నది. రైతులకు బోనస్ ఇస్తే కొనబోమంటూ కేంద్రం షరతు విధించిందని బాల్‌ను బీజేపీ కోర్టులోకి నెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్‌పీజీ వంట గ్యాస్ ధర పెరిగిందని, కేంద్రమే కారణమని, దానికి దండ పెట్టుకుని ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కావడంతో ఆ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టడంతో పాటు జానారెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతారనే పాత అంశాన్ని తెరపైకి తెచ్చి ఓటర్లలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.
వ్యతిరేకతను తట్టుకోవడానికి
విభజన చట్టంలో ఏడేళ్లుగా పెద్దగా పట్టించుకోని అంశాలన్నింటినీ ఇప్పుడు తెరపైకి తెస్తున్నది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయంలాంటి అంశాలన్నింటినీ ఇప్పుడు తెరపైకి తెచ్చింది. ఇక తాజాగా వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అంటూ రైతులకు స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఇందుకు కారణం ఎఫ్‌సీఐ కొనడానికి సిద్ధంగా లేదంటూ కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తున్నది. ఇందుకు నిర్దిష్ట కారణం లేకపోలేదు. హుజూరాబాద్‌లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించడానికి రైతుల సెంటిమెంట్లను పావుగా వాడుకుంటున్నది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి కాస్త ఎదురుగాలి వీస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తన బలహీన నాయకత్వంతో ఇంతకాలం ఎదగలేకపోయింది. ఆ గ్యాప్‌ను బీజేపీ అందుకున్నది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నుంచి కాస్త బలపడుతున్నది. దీన్ని అంచనా వేసిన టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా హుజూరాబాద్‌లో గట్టెక్కవచ్చని భావిస్తున్నది. అందుకే ఏడేళ్లుగా మరుగున పడి ఉన్న అస్త్రాలను బైటకు తీస్తున్నది. తెలంగాణకు రావాల్సిన రైల్ కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు తరలించుకుపోయిందని, తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నదనే లాజిక్‌ను తెరపైకి తెచ్చింది. దీనికి తోడు కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు రూ. 2.72 లక్షల కోట్లను వివిధ రకాల పన్నుల రూపంలో సమకూర్చి పెడితే చివరకు రాష్ట్రానికి అందులో సగం మాత్రమే వచ్చిందనే అంశాన్నీ విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల సందర్భంగానూ ఇదే అంశాన్ని వాడుకున్నది. ఇది కాస్తా చివరకు రాజీనామాకు సిద్ధమా అంటూ బీజేపీకి సవాలు విసిరే స్థాయికి చేరుకున్నది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దూరం చేసుకోడానికి తప్పంతా కేంద్రానిదేననే కలర్ ఇస్తున్నది.
పార్లమెంటులో సైలెంట్.. ఇప్పుడు వయొలెంట్
విభజన చట్టంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటు వేదికగా ఒత్తిడి చేయడానికి టీఆర్ఎస్ పార్టీకి పుష్కలమైన అవకాశాలే ఉన్నాయి. తాజాగా ముగిసిన వర్షాకాల సమావేశాల్లో సైతం ఆంద్రప్రదేశ్ ఎంపీలు ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు లాంటి అంశాలపై గట్టిగానే ఒత్తిడి తీసుకొచ్చాయి. కానీ, తెలంగాణలోని టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. నిజంగా ఇప్పుడు ప్రస్తావిస్తున్న విభజన హామీల అమలు వైఫల్యాన్ని పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రస్తావించి గట్టిగా కొట్లాడి ఉండొచ్చు. కానీ, మౌనంగా ఉండిపోయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం వెనక కారణం హుజూరాబాద్ ఉప ఎన్నికే. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని సందర్భాల్లో మద్దతు పలుకుతూ సహకరించిన టీఆర్ఎస్ రాష్ట్రానికి రావాల్సిన డిమాండ్లను సాధించుకోడానికి విస్తృతమైన అవకాశాలే ఉన్నాయి. 2018లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి తనదైన శైలిలో కేంద్రాన్ని ఒప్పించుకున్న టీఆర్ఎస్ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ఆ చొరవను చూపలేదు. ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల సమయంలో వాడుకుంటున్నది.
కన్ఫ్యూజన్ స్ట్రాటజీ
హుజూరాబాద్‌లో గెలుపుపై ఇంకా స్పష్టమైన ధీమాకు రాని టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీపైకి బాణాన్ని ఎక్కుపెట్టింది. రైతులు పండించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ పూర్తి స్థాయిలో కొనదంట... కేవలం 60 లక్షల టన్నులే కొంటుందంట.. ఇప్పటికే ఐదేళ్ళకు సరిపోయే నిల్వలు ఉన్నాయంట.. మిగిలిన ధాన్యాన్ని రైతులు ఇప్పుడు ఎక్కడ అమ్ముకోవాలి... అంటూ మొత్తం తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదేననే ప్రచారాన్ని మొదలుపెట్టింది. రైతుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నది. దీనికి తోడు పారా బాయిల్డ్ రైస్ మిల్లులు ఇక మూతపడే ప్రమాదం ఉందంటూ మెసేజ్ పంపింది. ఇందుకూ నిర్దిష్టమైన కారణమే ఉంది. పారాబాయిల్డ్ రైస్ మిల్లులు హుజూరాబాద్ నియోజకవర్గంలో గణనీయంగానే ఉన్నాయి. ఇప్పుడు అవి మూతపడే ప్రమాదానికి కారణం ఎఫ్‌సీఐ రూపంలో కేంద్ర ప్రభుత్వమేనని ఆ మిల్లుల యాజమాన్యంలో గందరగోళం సృష్టించింది. పారాబాయిల్డ్ రైస్ మిల్లుల యజమానులు ఎక్కువగా ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం ఇందుకు కారణం. ఈ పరిస్థితికి బీజేపీయే కారణం కాబట్టి ఆయనను నిలదీయండి అనే సందేశాన్ని పరోక్షంగా పంపింది. ఆయన నుంచి వారిని దూరం చేసే వ్యూహాన్ని అవలంబిస్తున్నది. నిజానికి ఎఫ్‌సీఐ తిరకాసు పెట్టిన అంశాన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో భేటీ అయిన సందర్భంగా ప్రస్తావించి ఉండాల్సింది. అప్పటికే మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్య జరిగిన సమావేశంలో ఎఫ్‌సీఐ వ్యవహారం చర్చకు వచ్చింది. దీన్నే సీఎం హోదాలో ప్రధానితో చర్చించి ఉండొచ్చు. తొమ్మిది అంశాలపై మెమొరాండాలు ఇచ్చిన కేసీఆర్ రైతుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశాన్ని మాత్రం టచ్ చేయలేదు. రాజకీయాల కంటే రాష్ట్ర రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ భావించి ఉన్నట్లయితే ఈ పని చేసే ఉండేవారు.
అటెన్షన్ డైవర్షన్
సీఎం కేసీఆర్ తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధానితో, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కావడం వివాదాస్పదంగా మారింది. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ.. అంటూ టీఆర్ఎస్, బీజేపీ లోపల సహకరించుకుంటూ పైకి ప్రత్యర్థి పార్టీల తరహాలో వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్ర బీజేపీలోనూ ఇది పెద్ద కుదుపుకే దారితీసింది. ఇక కేంద్ర మంత్రులు అధికారికంగా రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వ విధానాలను, పథకాలను సమర్ధిస్తున్నారు. తాజాగా జ్యోతిరాదిత్య సింధియా నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంతో మధ్యాహ్న విందులో పాల్గొన్నారు. ఇది రాష్ట్ర బీజేపీకి మింగుడుపడడంలేదు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీతో ఉన్న దోస్తానాను కప్పిపుచ్చుకోడానికి కేంద్రంపై కొట్లాటే అంటూ టార్గెట్ చేయడం మొదలైంది. అందులో భాగమే కేంద్రానికి వెళ్తున్న పన్నులు, రాష్ట్రానికి వస్తున్న నిధులు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ వర్శిటీ తదితర అంశాలన్నీ. టీఆర్ఎస్, బీజేపీ మధ్య బ్లేమ్ గేమ్ హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం చేస్తున్న ఒక పొలిటికల్ స్టంట్ మాత్రమే.
ఎన్. విశ్వనాథ్