కులం.. మతం.. మధ్యలో జనం

ఉన్నది ఉన్నట్టు

Update: 2021-09-02 10:00 GMT

కులమతాలకు అతీతంగా అన్ని సెక్షన్ల ప్రజలకు సమానస్థాయిలో పరిపాలనా ఫలాలు అందాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. ఎలాంటి పక్షపాతం లేకుండా పాలన సాగిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు కూడా ప్రమాణం చేస్తుంటారు. కానీ, ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నది. రాజకీయ పార్టీలకు, పాలకులకు ప్రజలు ఎప్పుడూ ఓటర్లే. వారి ఓటు బ్యాంకుకు ఉండే ప్రాధాన్యాన్ని బట్టి రాజకీయాలు నడుస్తుంటాయి. పథకాలు ఉనికిలోకి వస్తూ ఉంటాయి. నామినేటెడ్ పోస్టులు ప్రకటించబడతాయి. ఇది దీర్ఘకాలంగా భారత సమాజంలో కనిపిస్తున్నదే. చివరకు రాజ్యాంగ పదవులు సైతం కులాల ఆధారంగానే దక్కుతుంటాయి. మునుపెన్నటికంటే ఇప్పుడు కులాలు, మతాల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. కులాల మధ్య ఎంత ఎక్కువ విభజన ఉంటే ఓటు బ్యాంకు పాలిటిక్స్ అంత పటిష్టంగా ఉంటాయన్నది ఆ పార్టీల భావన. అందుకే ప్రజలలో ఐక్యతకు ఆస్కారం లేకుండా కులాలవారీగా ప్రజా సమూహాన్ని విడిగా ఉంచుతున్నాయి. అది జాతీయ, ప్రాంతీయ పార్టీలలో ప్రతిబింబిస్తున్న ధోరణి. పార్టీలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీజేపీ హిందుత్వ (బ్రాహ్మిణ్-బన్యన్) పార్టీ, కాంగ్రెస్ దళిత-మైనారిటీ పార్టీ, బీఎస్‌పీ దళిత బహుజన పార్టీ, సమాజ్‌వాదీ ఓబీసీల పార్టీ అంటూ ప్రతీ పార్టీకి ఏదో ఒక మతం, కులం టాగ్‌లైన్‌గా మారింది. ప్రజలలో అలాంటి అభిప్రాయమే నెలకొన్నది. అభ్యర్థులను ఖరారు చేయడంలో కులం, మతం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

అంతా బహిరంగమే

చివరకు అది పరాకాష్ఠకు చేరింది. అధికారులకు పోస్టింగులు కూడా కొన్ని సందర్భాలలో కులాల ఆధారంగానే జరుగుతున్నాయి. తెలంగాణ విషయాన్నే చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న పార్థసారథి ఫలానా కులానికి చెందినవారంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే బహిరంగంగా వ్యాఖ్యానించారు. 'దళితబంధు' స్కీమ్ అమలు కోసం దళితుడైన రాహుల్ బొజ్జాను సీఎంఓలోకి కార్యదర్శిగా తీసుకుంటున్నామని కూడా అన్నారు. ఆ తర్వాత వరుసగా చాలా మంది అధికారులకు కులం ఆధారంగానే పోస్టింగ్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటన్నింటిలోనూ కులం ప్రధాన పాత్ర పోషించింది. భారత సమాజంలో అనాదిగా కుల, మత విభజన రేఖ ఉన్నది. కాలక్రమంలో దానిని తుడిపేయడానికి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రగతిశీల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఆ పని చేయడానికి బదులుగా మరింతగా విస్తృతం చేసే కార్యాచరణనే కొనసాగిస్తున్నాయి. ప్రజలకంటే చైతన్యంలో ఉన్నతంగా ఉండే రాజకీయ నాయకులు ఆ కులాల మధ్య అగాథాన్ని మరింతగా పెంచుతున్నాయి. కుల సంఘాలలో చీలిక తెచ్చి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి. అధికారంలో కొనసాగడానికి, బలమైన పార్టీగా నిలదొక్కుకోవడానికి కులమతాల మధ్య విభజనను మరింతగా పెంచి పోషిస్తున్నాయి.

సెంటిమెంట్‌గా కొనసాగుతూ

సమాజంలో మెజారిటీ ప్రజలు గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు. ఇప్పటికీ అక్కడి ప్రజలలో కులం ఒక కీలక అంశంగానూ, సెంటిమెంట్‌గానూ కొనసాగుతున్నది. కులాలకు తగినట్లుగానే తక్కువ కులం, ఎక్కువ కులం అనే వివక్ష కూడా కంటిన్యూ అవుతున్నది. ప్రజలలో ఉండే ఈ అభిప్రాయానికి తగినట్లుగా పార్టీలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టడం, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తీర్మానాలు చేయించడం, సంక్షేమ భవన్‌లు నిర్మించడంలాంటి నిర్ణయాలు తీసుకోవడం, అక్కడి పరిస్థితులకు తగినట్లుగా ప్రభుత్వ సిబ్బందికి పోస్టింగులు ఇవ్వడంలాంటి ఎత్తుగడలను వేస్తున్నాయి. సమాజంలోని ఆయా కులాల ఆర్థిక, సోషల్ స్థితిగతులను విశ్లేషించి ఆ ప్రజలను ఉన్నతస్థాయికి తీసుకురావడానికి ఊతమిచ్చే నిర్ణయాలను పాలకులు తీసుకోవడం అవసరం. కానీ, మరింత అంతరం సృష్టించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే ఆక్షేపణీయం. కుల సంఘాలను ప్రోత్సహించడం, ఆ సంఘం నేతలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకోవడం, రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుని ఓటు బ్యాంకు చీలిపోకుండా చూసుకోవడం, ఇవన్నీ ఆ క్రీడలో భాగం. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆత్మగౌరవ‌భవన్, సంక్షేమభవన్‌లాంటి నిర్ణయాలన్నీ కులాలను చేజారిపోకుండా, గంపగుత్తగా ఓట్లు రాబట్టుకోవడానికి ఉద్దేశించినవే.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు

పాతబస్తీలో బీజేపీ నేత బండి సంజయ్ తన పాదయాత్ర సందర్భంగా మతాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సున్నితమైన అంశంలో సంచలన వ్యాఖ్యలు చేయడం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని, మత ఘర్షణలకు దారితీస్తుందనీ ఆయనకు తెలియందేమీ కాదు. అయినా మతపరంగా ప్రజలను విభజించి ఓటర్లను సమీకృతం చేసుకోవడమే ఆయన లక్ష్యం. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ అదే వ్యూహాన్ని అవలంబించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలోనూ దాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా వినియోగించనున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు సరికొత్త సమీకరణాలకు తెరతీశాయి. అధికార పార్టీనేత కేసీఆర్ హుజూరాబాద్‌లో కీలకంగా ఉన్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని 'దళితబంధు' పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఆ సెక్షన్ ప్రజలకు ఇది సంతృప్తి కలిగించే అంశమే కావచ్చు. వారిని ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకురావడానికి అవసరమైనదీ కావచ్చు. ఆ పథకం దళితేతర కులాలకు చెందిన ప్రజలలో అసంతృప్తికి ఆజ్యం పోసింది. దళితులపై ఇప్పటికే ఉన్న వివక్ష మరింత విస్తృతం కావడానికి దోహదం చేస్తున్నది.

అందుకే, 'ఆ సెక్షన్‌కు చెందినవారే ఓటర్లా? వాళ్లే ఓటు వేస్తారా? మేం ఓటు వేయమా? మా ఓట్లు వారికి అవసరం లేదా? అంటూ గ్రామాలలో ప్రజలు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. బీసీబంధు, గిరిజనబంధు, మైనారిటీబంధు కావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సైతం సరిగ్గా ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని 'దళిత-గిరిజన దండోరా' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐపీఎస్ అధికారిగా ఉండి వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాలలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సైతం బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన రాజ్యం అనే నినాదాన్ని వినిపిస్తున్నారు.

అధికారమే పరమావధిగా

రాజకీయ పార్టీలకు ఓట్లు, సీట్లు, అధికారమే పరమావధి. అందుకే ప్రజలలో వీలైనంత ఎక్కువగా కులపరమైన చీలికలు తేవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఏకగ్రీవ తీర్మానాలు చేయిస్తుంటాయి. అధికార పార్టీలు కులాలవారీగా వరాలు, హామీలు ఇస్తుంటాయి. కులాన్ని, మతాన్ని టార్గెట్‌ చేసుకుని కొత్త పథకాలను తీసుకొస్తున్నాయి. పార్టీలన్నీ లౌకికవాదం జపిస్తున్నా ఆచరణ మాత్రం మరోలా ఉంటున్నది. జనంలో ఉన్న కుల, మత సెంటిమెంట్లను రాజకీయానికి వాడుకుంటున్నాయి. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాయి. గతంలో బీసీలంతా ఒకటే అనే భావన ఇప్పుడు ఉప కులాలవారీగా విడిపోవడానికి కారణమవుతున్నది.

ఎన్. విశ్వనాథ్


Similar News