లక్ష కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న 'దళితబంధు' నిర్ణయం సాహసోపేతమా? లేక దుస్సాహసమా? హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం ప్రకటించిన తాయిలమా? లేక నిజంగానే దళితులను ఉద్ధరించాలన్న చిత్తశుద్ధా? గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అప్రతిష్టపాలైనందుకు పశ్చాత్తాపమా? నిరుపేద దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల సాయాన్ని ప్రకటిస్తున్న కేసీఆర్‌కు ఈ పథకం కలిసొస్తుందా లేక మిగిలిన సెక్షన్ల ప్రజల వ్యతిరేకత రూపంలో సరికొత్త సమస్యను ఎదుర్కోబోతున్నారా? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. 'తెలంగాణ దళితబంధు పథకం ఒక కార్యక్రమం కాదు. ఇది ఒక ఉద్యమం. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీదనే యావత్తు తెలంగాణలో ఈ పథకం విజయం ఆధారపడి ఉంటది. అందరూ ఆ దిశగా దృఢ నిరణయం తీసుకోవాలి' అని కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన 412 మంది దళితుల సమావేశంలో వ్యాఖ్యానించారు. దీంతో, ఒకవేళ హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలవకపోతే ఈ పథకం రాష్ట్రంలో అమలు కాదేమో అనే కొత్త డౌట్ పుట్టుకొచ్చింది. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఈ పథకం ఉనికిలో ఉంటుందో ఉండదో అనే అనుమానమూ తలెత్తింది.
ప్రయోజనకరమే కానీ
'దళితబంధు' పథకం ద్వారా నిరుపేద దళితులు ఆర్థికంగా లబ్ధి పొందుతారన్నది నిర్వివాదాంశం. దాన్ని చిత్తశుద్ధితో అమలుచేస్తే ఎన్నో కుటుంబాలు నిలదొక్కుకుంటాయి. ఆ పథకం వెనక ఉన్న ఉద్దేశ్యమే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈ పథకాన్ని తెరమీదకు తేవడం సరికొత్త సందేహాలకు తావిస్తున్నది. దళితులకు మూడెకరాల భూమిని కొనడానికి ఆర్థిక ఇబ్బందులు పడిన సర్కారు ఇప్పుడు ఏకంగా సుమారు లక్ష కోట్ల రూపాయలను ఎలా సమీకరించుకుంటుంది? ఆ భారాన్ని ఎలా మోస్తుంది? అన్న కోణం నుంచే ఈ తరహా చర్చలు జరుగుతున్నాయి.
గతంలో దళితుడే తొలి ముఖ్యమంత్రి అని హామీ ఇచ్చారు. అది సాకారం కాలేదు. స్వయంగా కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు దానిపై వివరణ ఇచ్చినా ఆ మచ్చ మాత్రం మాసిపోలేదు. అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామని చైనా వరకూ ప్రత్యేక బృందాన్ని పంపించినా ఇప్పటికీ అది కొలిక్కిరాలేదు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన వివాదాస్పదమైంది. ఆ విగ్రహం పోలీసు స్టేషన్‌లో బందీగా ఉన్నది. అంబేద్కర్‌ను ఆరాధ్యంగా కొలిచే దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నిరసనలూ చేశారు. మూడు ఎకరాల భూమి పథకాన్ని అమలుచేయడం సాధ్యం కాదని స్వయంగా కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దాంతో అది అర్ధంతరంగా ఆగిపోయింది.
వీటి మీద విమర్శలే
నేరెళ్లలో దళితుల హత్య, దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించడం తదితర అంశాల మీద కేసీఆర్ ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తప్పులు చేసిన మిగిలిన మంత్రుల విషయంలో కేసీఆర్ ఆ తరహా యాక్షన్ ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలూ తలెత్తాయి. దళితుల విశ్వసనీయతను కోల్పోయామన్న భావనతో ఇప్పుడు ఈ కొత్త పథకానికి తెరదీశారనే భావన కూడా కలుగుతోంది. 'దళితబంధు' వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతుందో లేదో కేసీఆర్ ఆచరణతోపాటు కాలమే సమాధానం చెబుతుంది. విశాల ప్రజానీకం పన్నుల ద్వారా చెల్లించిన డబ్బుతో హుజూరాబాద్ ఎన్నికల సమయంలో అక్కడి ఓటర్లకు తక్షణ ప్రయోజనం కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలకు దారితీసింది. ఈ పథకం అమలుకోసమంటూ ఇప్పటికే పార్టీ నేతలు, అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అక్కడ మోహరించింది. నిజానికి ఇది కేసీఆర్ గతంలో ప్రకటించిన 'అబ్బురపడే' పథకాలలో భాగమేనా? అటు ప్రజలలో, ఇటు పార్టీలలో భారీ స్థాయిలోనే చర్చ జరుగుతున్నది. ఈ పథకాన్ని వ్యతిరేకించలేక, సమర్ధించలేక విపక్షాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కేసీఆర్ వేసిన మాస్టర్ స్ట్రోక్‌కు చతికిలపడ్డాయి.
మనసు గెలుచుకుంటారా?
ఈ పథకం కారణంగా హుజూరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ 'ఆత్మగౌరవ' నినాదం ఎత్తుకుంటే ఆయనకు రాజకీయ గురువైన కేసీఆర్ 'దళితబంధు' రాగం ఆలపిస్తున్నారు. ఈ పథకం ఎంతటి భారీ స్థాయిలో ఓట్లు రాలుస్తుందో తూకం వేసినందునే ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజుల వ్యవధిలో నాలుగుసార్లు మీటింగు పెట్టారు. గ్రామానికి నలుగురు చొప్పున హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. పథకం గొప్పదనాన్ని వివరించారు. పిట్టకథలు, సామెతలతో ఎనిమిది గంటల పాటు జరిగిన మీటింగులో వారి మనసు గెల్చుకునే ప్రయత్నం చేశారు. వారితో కలిసి భోజనం చేశారు. యావత్తు దేశానికే హుజూరాబాద్ దిక్సూచిగా నిలవాలని, వెలుగులు పంచాలని, సమర్ధవంతమైన అమలు కోసం నడుం బిగించాలని హితోపదేశం చేశారు. నిజానికి ఈ పథకం గురించి కేసీఆర్ నెల రోజులుగా కసరత్తు చేస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే 'దళితబంధు' అనే విమర్శలు విపక్షాల నుంచి వస్తుండడంతో అంతే ఘాటుగా క్లారిటీ ఇచ్చారు. ''మా పార్టీ సన్నాసుల మఠం కాదు. బరాబర్ రాజకీయ పార్టీ. రాజకీయ ప్రయోజనం కోసమే ఈ పథకాన్ని తెస్తున్నాం. హుజూరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నదే అందుకోసం. అధికారంలో ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి పథకాలతో లాభం పొందాలని చూస్తాం'' అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దాన్ని సమర్ధించుకోడానికి గతంలో రైతుబీమా, ఆసరా పింఛన్ల పథకాలను, రాజకీయంగా సింహగర్జన సభను కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు.
ఛాలెంజ్ నిలుపుకుంటారా?
సాధారణ ఎన్నికలను తలదన్నేలా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక మారింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగానూ చరిత్ర సృష్టించనున్నది. అధికార పార్టీ తన బలాన్ని నిలుపుకోడానికి సర్వ శక్తులనూ ధారపోస్తున్నది. ఇరవై వేల దళిత కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేసి గరిష్టంగా రెండు వేల కోట్ల రూపాయలనైనా ఎన్నికలు జరిగే లోపు ఈ నియోజకవర్గానికి 'దళితబంధు' కోసం ఖర్చు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పుకున్నారు. ఈ ఒక్క సీటుతో అధికారం జారిపోయేదేమీ లేనప్పటికీ గెలవడం అధికార పార్టీకి ప్రతిష్ఠాత్మకం. కేసీఆర్‌ను ఢీకొట్టి గెలవడం ఈటల రాజేందర్‌కూ అంతే ఛాలెంజ్. జీహెచ్ఎంసీ సమయంలో వరద సాయం పేరుతో ఒక్కొక్క బాధిత కుటుంబానికి తలా పది వేల రూపాయలు పంచింది టీఆర్ఎస్. ఓట్లను డబ్బులతో కొనడమే అనే ఆపవాదును మూటగట్టుకున్నది. ఇప్పుడు దళితబంధు'తో హుజూరాబాద్‌లో పది లక్షల రూపాయల చొప్పున పంచాలనుకుంటున్నది. ఓటు కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడం అవసరమా, నైతికతేనా అనే ప్రశ్నలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓట్లు, నోట్లు, అధికారమే పరమావధి కావడంతో నైతికత గురించి మాట్లాడుకోవడం అమాయకత్వమే. గతంలో ఇచ్చిన హామీలు మధ్యలోనే ఆగిపోవడంతో తిరిగి దళితుల విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నంలో భాగంగా 'దళితబంధు' ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ఆసక్తికరం.
ఎన్. విశ్వనాథ్