నీతులు నేతి బీరకాయ చందమే!

ఉన్నది ఉన్నట్టు

Update: 2021-07-15 08:45 GMT

ప్రస్తుత రాజకీయాలలో నైతికతను వెదుక్కోవడమంటే నేతి బీరకాయలో నేతి చందంగానే ఉంటుంది. ప్రజాసేవ ముసుగులో పదవులు, పైరవీలు, పైసలే నేతలకు పరమావధి. సిద్ధాంతం, భావజాలం లాంటివన్నీ ఒట్టి మాటలే. ఎప్పుడు ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారుతున్నారో ఊహించుకోవడం కష్టమేమీ కాదు. నిన్నటివరకూ తిట్టిన పార్టీలోనే చేరిపోతున్నారు. ఒక్కసారిగా వారి మాటలూ మారిపోతున్నాయ్. జాతీయ, ప్రాంతీయ అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలలోనూ ఇది ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. సిద్ధాంతం, భావజాలం అంతా తూచ్. ఎక్కడ ప్రయోజనం ఉంటుందో అందులోకి వెళ్లిపోవడమే వారి లాజిక్. జాతీయ స్థాయిలో జ్యోతిరాదిత్య సింధియా మొదలు తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వరకు అందరిదీ అదే దారి. అధికారంలో ఏ పార్టీ ఉంటే వారి ప్రయోజనాలను నెరవేర్చుకోడానికి అక్కడికి వెళ్లడమే వారి ఫిలాసఫీ. అయితే పదవులు లేకుంటే పనులు, కాంట్రాక్టులు. వ్యక్తుల సంగతి ఇలా ఉంటే పార్టీల తీరూ అంతే. ఏ పార్టీతో ఎప్పుడు, ఎందుకు పొత్తు పెట్టుకోవాలే ఒక ప్రాతిపదిక లేదు. ఉన్నదల్లా అధికారంలోకి రావాలనే ధ్యాసే. దానికి తగినట్లుగానే ఎత్తులు, పొత్తులు ఉంటాయి. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడేవారు కొందరైతే అప్పటికప్పుడు అవసరాలు తీర్చుకోడానికి గూటిని వెదుక్కునేవారు మరికొందరు. పుచ్చలపల్లి సుందరయ్య, వాజ్‌పాయి, అద్వానీలాంటి వారిని ఆదర్శంగా తీసుకునేవారు కొందరైతే పదవులు, పైసలు లాంటివి మాత్రమే ముఖ్యం అనుకుని ప్రతీ ఐదేళ్లకోసారి పార్టీలు మారేవారు మరికొందరు. నైతిక సంగతి ఎలా ఉన్నా పార్టీ ఫిరాయింపు చట్టంలాంటివి సైతం వారికి పట్టింపు కాదు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేం. చేరికలు, పొత్తులు అన్నీ అనైతికమే. నైతికత కావాలా లేక స్వప్రయోజనాలు నెరవేరాలా అనేదే నేతలకు క్రైటీరియా.

నాటి నుంచి నేటి దాకా

ఆ మాటకొస్తే పార్టీని నడిపించే అధ్యక్ష బాధ్యతలలో ఉన్న డి.శ్రీనివాస్, బొత్సా సత్యనారాయణలాంటివారు పార్టీలు మారారు. తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ ఇటీవల టీఆర్ఎస్‌లో చేరారు. వామపక్ష పార్టీల నుంచి కూడా గతంలో చెన్నమనేని రాజేశ్వరరావు మొదలు తాజాగా నోముల నర్సింహయ్య వరకు తెలుగు రాష్ట్రాలలో పార్టీలు మారారు. ఇక చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని ఏకంగా కాంగ్రెస్‌లో కలిపేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పార్టీల అధ్యక్షులుగా ఉన్నవారంతా గతంలో వేర్వేరు పార్టీలలో ఉన్నవారే. వేర్వేరు అవసరాల కోసం బైటకొచ్చి సొంత పార్టీలు పెట్టుకున్నారు. చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్ రెడ్డి, కేసీఆర్ లాంటివారంతా ఆ కోవకు చెందినవారే. సిద్ధాంతాల ప్రాతిపదికనే తమ పార్టీ పనిచేస్తూ ఉంటుందని చాలా మంది నేతలు గొప్పగా చెప్పుకుంటుంటారు. కానీ, పార్టీలు మారడానికిగానీ, పొత్తు పెట్టుకోడానికిగానీ ఏ సిద్ధాంతం దోహదపడిందో చెప్పరు. ఒక ఎన్నికలో ఒక పార్టీతో పొత్తుపెట్టుకున్న పార్టీలు మళ్లీ ఐదేళ్ళ తర్వాత ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాయి. ఎన్నికలలో గెలవడమే ఆ పార్టీలకు, నేతలకు కావాల్సింది. ఐదేళ్ల క్రితం కలిసి పనిచేసిన విషయాన్ని మరచి విషం చిమ్ముతూ ఉంటాయి. తెలుగుదేశంతో 2009లో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ 2018 ఎన్నికల నాటికి చంద్రబాబును తూర్పారబట్టింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడుపోసుకున్న తెలుగుదేశం చివరకు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నది. అవకాశవాద పొత్తులు, అధికారంలోకి రావడమే ప్రాధాన్యంగా ఉన్నంతకాలం ఇలాంటివి షరా మామూలు. పశ్చిమబెంగాల్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ముకుల్‌రాయ్ ఎన్నికలు పూర్తికాగానే మళ్లీ తృణమూల్ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. చేరేవారికీ, చేర్చుకునేవారికీ లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకుంటుంది? నైతికత, విలువలు లాంటివన్నీ కొంతమంది దృష్టిలో అర్థం లేని మాటలు. వారి లెక్క ప్రకారం అవి రాజకీయ కెరీర్‌కు ఎందుకూ పనికిరానివి.

రంగుమారితే మాట మారే

తెలంగాణలోని పరిస్థితులనే పరిశీలిస్తే, సోనియాగాంధీని తెలంగాణ ప్రజలను బలితీసుకున్న వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా 'తెలంగాణ తల్లి' అని కీర్తిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఉధృతిని తట్టుకోలేకనే యుపీఏ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నిండు అసెంబ్లీలో 'సోనియాగాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది. ఆమె వల్లనే స్వరాష్ట్రం సాకారమైంది' అని అన్నారు. నిన్నటిదాకా కేసీఆర్‌కు సహచర మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో చేరి ప్రగతిభవన్‌ను బానిసభవన్‌గా కామెంట్ చేశారు. ఏడేళ్లపాటు అదే 'బానిసభవన్‌' కేబినెట్ సమావేశాలలో పాల్గొన్నారు. ఇక మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ చంద్రబాబును తెలంగాణ ద్రోహి అంటూ విమర్శిస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీతో టీఆర్ఎస్ 2009లో పొత్తుపెట్టుకున్నప్పుడు ఆయనతో కలిసి ప్రచారం చేశారు. వేదికను పంచుకున్నారు. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ ఫిరాయింపు చట్టం చేసిన నేతలే ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పార్టీలు మారాలనే నిర్ణయం తీసుకున్న వెంటనే వారి పదవులకు రాజీనామా చేయడం నైతికత అని నీతులు చెప్పేవారే వాటిని బుట్టదాఖలా చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన స్పీకర్‌లు, చైర్మన్‌లు సకాలంలో చర్యలు తీసుకోవడంలేదు. అవసరం అనుకున్నప్పుడు మాత్రం గంటల వ్యవధిలోనే రాజీనామాలను ఆమోదించేస్తుంటారు. ఏది చేసినా రాజకీయ ప్రయోజనాలే ప్రధానం.

అనైతికతే వారి అసలు రూపం

ఒకప్పుడు రైలు ప్రమాదం జరిగి భారీ సంఖ్యలో ప్రజలు చనిపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రిగా ఉన్న లాల్‌బహదూర్ శాస్త్రి పదవి నుంచి తప్పుకున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా చాలా మంది నేతలు దీన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఆదర్శనీయులని కొనియాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రజలు, విపక్షాలు డిమాండ్ చేసినా పదవిని వదులుకోడానికి సిద్దపడని నేతలను చూస్తున్నాం. పదవి కోసమే అనైతిక చర్యలకు పాల్పడుతున్నప్పుడు దాన్ని వదులుకోడానికి ఎందుకు సిద్ధపడతారు? అడ్డదారులు తొక్కినా, అవకాశవాదానికి దిగినా అంతా అధికారం కోసమే. అధికారంలో ఉన్న పార్టీలు స్వయంప్రతిపత్తి సంస్థలను అవసరానికి తగినట్లుగా వాడుకుంటాయి. అవినీతి, అక్రమాలు, ఓటుకు నోటులాంటి కేసులను బూచిగా చూపి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతాయి. ఈ అవలక్షణాలు లేనివారు చాలా తక్కువ మందేనని అధికారంలో ఉన్న పార్టీలకు తెలియందేమీ కాదు. అందుకే లొంగితే సరి.. లేకుంటే ప్రతీకార చర్యలు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది, కళ్ళు తెరవాల్సింది ఓటర్లే. నైతికతలేని నేతలను పాఠం నేర్పాల్సిందీ వారే. పచ్చ నోటుకు విలువైన ఓటును అమ్ముకున్నవారికి నైతికత లేనప్పుడు మాకెందుకుండాలి అని నిస్సిగ్గుగా వ్యవహరించే నేతల ధైర్యం అదే.

ఎన్. విశ్వనాథ్


Similar News