టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తరచూ 'మా పార్టీకి హైకమాండ్ లేదు. తెలంగాణ ప్రజలే మాకు హైకమాండ్' అని చెబుతూ ఉంటారు. కానీ, ఆ బాస్‌లకు మాత్రం ప్రభుత్వ బాస్‌ను కలిసే భాగ్యం దొరకడం లేదు. ప్రగతిభవన్ దగ్గర ఎంట్రీ ఉండదు. ఫామ్‌హౌజ్‌కు చేరుకోవాలంటే సప్త సముద్రాలను దాటినంత సాహసం చేయాలి. ఇక సచివాలయంలో దర్శనమే ఉండదు. ప్రజాదర్బార్ లేదు. గ్రీవెన్స్ సెల్ లేదు. ఆయనకు మనసు పుట్టి, దయ తలచి ఇస్తే సరి. లేకుంటే ప్రజల ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసలే. 'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ' అని ప్రజాస్వామ్యం గురించి మనం ఎంత ఘనంగా చెప్పుకున్నా, ఆ ప్రజలే ఇప్పుడు అంటరానివారయ్యారు. పాలకులను కలవడం వారికి అందని ద్రాక్షే అవుతున్నది. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇలా చాలా మంది ముఖ్యమంత్రులను చూసిన ప్రజలు స్వరాష్ట్రంలో కేసీఆర్‌నూ చూస్తున్నారు. ముఖ్యమంత్రుల ఇండ్ల ముందు అర్జీలతో గంటల తరబడి క్యూ కట్టి ప్రజలు నిలుచునేవారు. ఇప్పుడు ప్రగతిభవన్ ధర్నాలకు, నిరసనలకు, ఆందోళనకు, ఆత్మహత్యాయత్నాలకు కేంద్రంగా మారింది. అర్జీలతో అక్కడెవ్వరూ కనిపించడం లేదు. అన్నీ ప్లకార్డులు, నల్లజెండాలు, పైకెత్తిన పిడికిళ్లే కనిపిస్తుంటాయి. వారిని అదుపుచేయడానికి వందల సంఖ్యలో పోలీసులు, అరెస్టు చేసి తరలించడానికి వ్యాన్‌లు సిద్ధంగా ఉంటాయి.
మంత్రులకే కష్టం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం మంత్రులకే సాధ్యం కాదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒక్కరే కాదు, ప్రతిపక్షాల నేతలూ నిత్యం విమర్శలు చేస్తూ ఉంటారు. 'నేనెక్కడుంటే అక్కడే సచివాలయం' అని స్వయంగా కేసీఆర్ పలుమార్లు చెప్పుకున్నారు. కేసీఆర్ తీరు ఇలా ఉంటే 'ప్రజల చేత ఎన్నుకోబడిన' ఎమ్మెల్యేలదీ అదేదారి. పింఛను సమస్యలు, రేషను కార్డుల బాధలు.. ఇలా ఎన్నో ఇబ్బందులు. వాటిని ఎమ్మెల్యేలకు మొరపెట్టుకోడానికీ దారి లేదు. అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలున్నా అవి ప్రజలకు అందుబాటులో ఉన్నది అంతంతమాత్రమే. ఇక ఎమ్మార్వో మొదలు కలెక్టరు దాకా అధికారుల తీరూ అందుకు భిన్నంగా ఏమీ లేదు. గతంలో 'ప్రజావాణి' పేరుతో ప్రతీ సోమవారం కలెక్టర్‌ను కలవడానికి ప్రజలకు ఒక వేదిక ఉండేది. ఇప్పుడు అదీ లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకున్నారు. పేరుకే ప్రజా ప్రతినిధులు. వారు ప్రజలను కలవరు, ప్రజలకు వారిని కలిసే మార్గం లేదు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు దాదాపు ఏడాదిన్నరగా ప్రజలకు అందుబాటులో లేరు. నిత్యం ప్రజలతో సంబంధాలలో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ బాధ్యతగా ఉండడాన్ని రాజకీయ నేతలు ఉదాహరణగా చెబుతుంటారు.
గంభీర ప్రకటనలు
'బీజేపీని గెలిపిస్తే ఆ నేతలు ఇక్కడ ఉంటారా? వారిని కలవడం సాధ్యమేనా? అది అయ్యే పనేనా? టీఆర్ఎస్‌ను గెలిపిస్తే మీ మధ్యనే ఉంటారు. అందుకే ఢిల్లీ కావాలో.. గల్లీ కావాలో తేల్చుకోవాల్సింది ప్రజలే ' అంటూ ఎన్నికల ప్రచారంలో గులాబీ నేతలు గంభీర ప్రకటనలు చేశారు. ఏరాయి అయితేనేం కొట్టుకోడానికి.. అన్న చందంగా ఇప్పుడు ఏ పార్టీకి చెందినవారైనా గెలిచేంత వరకే. ఆ తర్వాత షరా మామూలే అనే విధంగా మారిపోయింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌కు తమ భూమి సమస్యను మొరపెట్టుకోడానికి ఓ వృద్ధ జంట చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు సిరిసిల్ల పర్యటన సందర్భంగా చెట్ల నీడన కూర్చుని అవకాశం కోసం ఎదురుచూశారు. ఏ ప్రజల సౌకర్యార్థం, సత్వర సేవలు అందించాలని కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారో ఆ లక్ష్యం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. సిద్దిపేట జిల్లా హద్దులను దాటి సిరిసిల్ల జిల్లా దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఇక భూముల సమస్యల గురించి రాయాలంటే రామాయణమంత అవుతుంది. రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయిందంటూ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా కామెంట్ చేశారు. ఆయన చేతిలోనే ఉన్న ఈ శాఖ ఇప్పటికీ కొలిక్కి రాలేదు. భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టినా, ధరణి తీసుకొచ్చినా సమస్యలు మాత్రం అపరిష్కృతం. చివరకు ప్రజల సహనం కోల్పోతున్నారు. పెట్రీలు, డీజిల్ చల్లుకోవడం, చల్లడం దాకా దారితీసింది.
చేయిదాటిపోయింది
నిజానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కారం సూచించగలిగితే పరిస్థితి చేయిదాటిపోయేది కాదు. ధర్నాలకు ఆస్కారమే లేదని 'ధర్నాచౌక్'ను ఎత్తివేయవచ్చు. దానికి బదులుగా ప్రగతిభవన్ వేదికగా మారింది. 'బంగారు తెలంగాణ'లో సమస్యలే ఉండవు అని అనుకోవచ్చు. వరంగల్, సిరిసిల్ల పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రికి నిరసనల సెగ తగిలింది. ఇక స్థానికంగా ఉండే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు అలాంటి నిరసనలు నిత్యకృత్యం అయ్యాయి. ప్రజలకు ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో, వాటికి ప్రభుత్వం నుంచి పరిష్కారం కావాలని ఎలా కోరుకుంటారో ముఖ్యమంత్రికి తెలియంది కాదు. చాలా బహిరంగసభలలో ఆయన ప్రసంగాల సందర్భంగా 'నీకు చదువుకోడానికి ఆర్థిక సాయం కావాలి.. అంతే గదా.. నేను జిల్లా కలెక్టర్‌కు చెప్పాను. వెంటనే అయిపోతది' లాంటి హామీలు ఇవ్వక తప్పడంలేదు. ఇక కరోనా సమయంలో కేటీఆర్‌ను స్వయంగా కలిసే అవకాశానికి నోచుకోలేని అక్షరాస్యులు ట్విట్టర్ సరైన వేదిక అని భావించారు. రోజూ వందలాది, వేలాది రిక్వెస్టులు వస్తున్నాయంటే పాలనలో లొసుగులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.
వేదిక ఏర్పాటులో విఫలం
ఒక్కసారి ప్రజల మధ్యకు వెళ్తే ఎన్ని రకాల అర్జీలు వస్తాయో పాలకులు స్వయంగా చూశారు. దానికి తగిన వేదికను మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. నిత్యం ప్రజలతో సంబంధాలలో ఉండాల్సిన ప్రభుత్వం వారికి దూరంగానే ఉంటున్నది. పేషెంట్ చెప్పే బాధలను డాక్టర్లు ఓపిగ్గా వింటే సగం బాధ తగ్గిపోతుందనే సాధారణ అభిప్రాయం సమాజంలో ఉన్నది. ఇప్పుడు పాలకులు కూడా ప్రజలకు వారి బాధలను వెలిబుచ్చుకోడానికి తగిన వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. నిరసనల దాకా వెళ్ళే అవసరం లేని యంత్రాంగాన్ని రూపొందించాలి. 'ప్రజలే మాకు బాస్‌లు' అని ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్, గులాబీ పార్టీ నేతలు ఎంత గంభీరంగా చెప్పుకున్నా ఆ ప్రజలే ఇప్పుడు కాన్వాయ్‌లను అడ్డుకుంటున్నారు. నిరసనలు తెలియజేస్తున్నారు. సందర్భం దొరికినప్పుడు నిలదీస్తున్నారు. ప్రగతిభవన్ మొదలు పంచాయతీ కార్యాలయం వరకు పేరుకుపోయిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం దొరకకపోతే ప్రజలకు ఇవి తప్ప మరో మార్గం లేదనే చారిత్రక సత్యాన్ని ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి.
ఎన్. విశ్వనాథ్