విలువల వలువలు ఊడుతున్నయి

ఉన్నది ఉన్నట్టు

Update: 2021-07-01 09:00 GMT

'మోర్ లాయల్ దాన్ ది కింగ్' అనే ఇంగ్లిషు సామెత మనకు నిత్య జీవితంలో చాలా సందర్భాలలో గుర్తుకొస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ భాషలో చెప్పాలంటే 'కుక్క కంటే తోక ఎక్కువగా ఊగుతుంది' అన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాక చాలా రాష్ట్రాలలో ఐఏఎస్ అధికారుల తీరు ఆ సామెతను గుర్తుచేస్తున్నది. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు మధ్య ఉన్న విభజన రేఖ మసకబారుతున్నది. వారి మీద కండువా కప్పుకోని నేతలు అనే ముద్ర పడింది. పబ్లిక్ సర్వెంట్లుగా వ్యవహరించాల్సిన వీరు పొలిటికల్ సర్వెంట్లుగా పనిచేస్తున్నారన్న అభిప్రాయం నెలకొన్నది. గతంలో మాయావతి, జయలలిత లాంటి ముఖ్యమంత్రులకు ఐఏఎస్ అధికారులు ఎంత లాయల్‌గా ఉన్నారో చూశాం. ఇప్పుడు తెలంగాణలోనూ కొద్దిమంది ఐఏఎస్‌లు అలానే తయారయ్యారు.

'ఎంత లాయల్‌గా ఉంటే పొజిషన్ అంత పదిలం' అనేది ఐఏఎస్ అధికారుల భావన. ఎవరు సిన్సియర్‌గా ఉంటే వారిని అందలం ఎక్కించి అనుకున్న పనులను పూర్తిచేసుకోవచ్చు అనేది రాజకీయ నాయకుల భావన. రెండు వైపులా వారివారి అవసరాలు తీరుతుండడంతో 'క్విడ్ ప్రో కో' తరహాలో కంటికి కనిపించని, ఆధారాలకు చిక్కని బంధం వారి మధ్య ఏర్పడింది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే వరకు ఇది ఆయా స్థాయిలలో కనిపిస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేకు నచ్చిన వ్యక్తికే అక్కడ మనుగడ ఉంటుంది. ఎస్ఐ, సీఐ, తహసీల్‌దార్ ఇలా ప్రభుత్వ సర్వెంట్ల స్థానాలను నిర్ణయించే రాజకీయ నాయకులే.

ప్రాపకం ఉంటే చాలు

సీనియారిటీ ఉన్నా లేకున్నా సీఎం తల్చుకుంటే ప్రధాన కార్యదర్శి అయిపోవచ్చు. దీర్ఘకాలం పాటు ఒకే పోస్టులో కొనసాగవచ్చు. ప్రయోజనాలను నెరవేర్చే అధికారుల స్థానం ఎప్పుడూ పదిలమే. పదవీకాలం అయిపోయిన తర్వాత అనధికార హోదాలో సలహాదారులైపోతారు. నచ్చని వ్యక్తులు మాత్రం దీర్ఘకాలం పాటు లూప్‌లైన్‌లోనే ఉండిపోతారు. తరచూ బదిలీలకు గురవుతారు. అప్రాధాన్య పోస్టులకు పరిమితమవుతారు. వారిని 'పొమ్మనలేక పొగబెట్టే' కక్షసాధింపు చర్యలకు పాల్పడతారు. ఖద్దరు నేతలకు లాయల్‌గా ఉన్నంతకాలం వారి, వీరి ప్రయోజనాలకు ఢోకా లేనంతకాలం ఇలాంటి మెహర్బానీలు, మెప్పు పొందే చర్యలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. తాజాగా సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకున్నారు. అలా చేయాలని ముఖ్యమంత్రి చెప్పకపోవచ్చు. కానీ, ఆయన మెప్పు పొందితే ఇక ఢోకా ఉండదనేది వారి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. ఖద్దరు నేతల కాళ్లకు దండం పెట్టాలని డీవోపీటీ రూల్ బుక్‌లో ఎక్కడా లేదు. పైగా అలాంటి అతి చేష్టలు 'కండక్ట్ రూల్స్'కు విరుద్ధమని డీవోపీటీ నిబంధనలే చెబుతున్నాయి. విధి నిర్వహణలో రాజకీయంగా తటస్థంగా ఉండాలని, విలువలను దిగజార్చవద్దని, నిజాయితీగా వ్యవహరించాలని, మచ్చ తీసుకురావద్దని ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ బుక్ చెప్తున్నా కొద్దిమంది ఐఏఎస్‌లకు మాత్రం అవి పట్టవు.

నిబంధనలు బేఖాతరు

రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకోవాల్సింది వారు పనిచేస్తున్న రాష్ట్రంలోని ప్రధాన కార్యదర్శి. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలేవీ లేవు. చర్యలు తీసుకోవాల్సిన వారే 'ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు' అంటూ స్వామిభక్తిని ప్రదర్శిస్తూ ఉంటే ఇక చర్యలను ఆశించడం 'నేతిబీరకాయ' చందమే అవుతుంది. స్థాయిలలో తేడా ఉండొచ్చుగానీ, చాలా మంది ఐఏఎస్ అధికారులు 'జీ హుజూర్'గానే వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు మనకు 'ఖద్దరు నేతల కాలం ఐదేళ్లు మాత్రమే.. కానీ, మేం పర్మినెంట్' అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు కనుమరుగయ్యాయి. రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ల మధ్య సంబంధాలు బాగా ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నది వాస్తవమే. ఆ సంబంధాలను నిర్ణయించే అంశాలేవీ అనేదే పెద్ద చర్చ. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించుకోవాలని పాలకులు తహతహలాడుతుంటారు. ఆ పని వంద శాతం పూర్తి చేయడం ద్వారా వారి 'గుడ్ లుక్స్'లో పడతామని అధికారులు భావిస్తుంటారు. స్వామి కార్యాన్ని సక్సెస్ చేయడం ద్వారా స్వకార్యానికి లైన్ క్లియర్ అవుతుందనుకుంటుంటారు. తొందరగా పదోన్నతి లభిస్తుందని భావించేవారు కొందరైతే, అన్ని తప్పులనూ కప్పిపుచ్చుకోడానికి నేతల దీవెనలు ఉపయోగపడతాయని భావించేవారు మరికొందరు. పరస్పర ప్రయోజనాలే వీరి పరమావధి. నిజానికి రాజకీయ నాయకులకు లోబడి పనిచేయాలనిగానీ, వారి అడుగులకు మడుగులొత్తాలనిగానీ వీరిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. కానీ, రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం వ్యవస్థీకృతంగానే దీన్ని స్థిరపరిచారు.

ఢిల్లీ నుంచి గల్లీ దాకా

ఖద్దరు నేతలు, బ్యూరోక్రాట్ల మధ్య 'క్విడ్ ప్రో కో' బంధం ఇప్పుడు కొత్తగా పుట్టిందేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నా ఇటీవలి కాలంలో మాత్రం ఇది మరింత ద్రుఢపడింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇది కామన్ ఫినామినాగా మారింది. వీరి మధ్య బంధం ఎంత గాఢంగా ఉంటుందో ఎన్నికల సమయంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఎక్కడ ఓటు బ్యాంకు బలహీనంగా ఉంటుందో అక్కడ నమ్మకమైన అధికారులను నియమించుకుంటారు. 'లాయల్' అనేది ఇలాంటి కీలకమైన సమయాల్లోనే ఉపయోగపడుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉండే సంబంధాలు సంక్షేమ పథకాల అమలు పేరుతో ఓటు బ్యాంకుగా మార్చేది కూడా ఈ అధికారులే. ఖద్దరు పెద్దల కనుసన్నలలో ఎంత 'లాయల్‌'గా కనిపిస్తే వారికి బదిలీ వేటు నుంచి అంత ఎక్కువ ఉపశమనం లభిస్తుంది. పదోన్నతులకు లక్షలు, కోట్ల రూపాయలలో దొడ్డిదారి 'సమర్పణ'లు తగ్గుతాయి. ఆ పలుకుబడిని ఉపయోగించుకుని కొన్ని స్వకార్యాలు కూడా చేసుకోవచ్చు. బ్యూరోక్రాట్లపై రాజకీయ పెత్తనం పాత్ర ఆ స్థాయిలో ఉంది కాబట్టే నచ్చినవారికి అందలం దక్కుతుంది. లేనివారికి పోస్టింగ్ లేని అధికారి, అప్రాధాన్య పోస్టులు.. చివరకు స్వచ్ఛంద పదవీ విరమణ. ఏది కావాలో తేల్చుకునేది అధికారులే. అందుకు వారి ప్రాధాన్యతకు అనుగుణంగా వారి కార్యాచరణ, వ్యవహారం ఉంటాయి. కాళ్ళు పట్టుకోవడమైనా, ఖరాఖండిగా వ్యవహరించడమైనా వారి అవసరాలు, ప్రయోజనాల ఆధారంగానే ఉంటుంది. అధికారులపై పెత్తనం సాగించాలనుకోవడం రాజకీయ నేతల స్వభావమైతే, చిక్కులు లేని స్వప్రయోజనాలు నెరవేరే స్థానం ఉండాలంటే 'లాయల్'గా ఉండడం ఉత్తమమైన మార్గం అనేది అధికారుల స్వార్థం. ఉభయకుశలోపరి లాగా పరస్పర ప్రయోజనాలే ఆ రెండు పక్షాల పరమార్థం.

ఎన్. విశ్వనాథ్


Similar News