నిజం మరిచి నిదురపోకుమా

ఉన్నది ఉన్నట్టు

Update: 2021-06-10 09:15 GMT

మహాకవి శ్రీశ్రీ యాభై ఏండ్ల క్రితం "ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురుచూసి మోసపోకుమా.." అని ఓ పాట రాశారు. అది అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాసింది. కరోనాతో జనం సహజీవనం చేస్తున్న నేటి పరిస్థితులలో మరోమారు ఆ పాట గుర్తుకొస్తున్నది. కరోనాబారిన పడితే కట్టుకున్నవారు, తోబుట్టువులు, అయినవారు, హితులు, సన్నిహితులు ఎలా స్పందిస్తున్నారో చాలా మందికి అర్థమైపోయింది. ఎవరు ఎలాంటివారో కరోనా తేల్చేసింది. ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసేవారెవరో, ముఖం చాటేసేవారు ఎవరో తేలిపోయింది. కష్ట సమయంలో ఎవరు ఎలా వ్యవహరిస్తారో అవగతమైంది. ఆప్యాయంగా పలకరించేదెవరు? ఆదుకోడానికి ముందుకొచ్చేదెవరు? ఆఖరిదాకా ఉండేదెవరో తెలిసొచ్చింది. కన్న బిడ్డలను, కట్టుకున్నవారిని, తోబుట్టువులను కరోనా బలితీసుకుంది. లక్షలాది రూపాయలను ఖర్చు చేసుకుని అప్పులపాలయ్యారు. ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి వచ్చామంటూ గొప్పలు చెప్పుకునే మన ప్రజా ప్రతినిధులు ఆపదలో ఆదుకుంటారా లేదా అనే విషయం స్పష్టమైపోయింది. కరోనా సోకి మంచాన పడితే మాట సాయం చేసేవారు కరువయ్యారు. మనసులోని భావాలను పంచుకుందామనుకున్నా వినేవారు లేరు. బంధాలు, అనుబంధాలకు కరోనా కొత్త నిర్వచనం చెప్పింది. స్వంత ఇంటిలోనే ఒంటరివారయ్యారు. దాదాపు గృహ బహిష్కరణలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. జైలులోని ఖైదీకి అన్నం ఎలా పెడతారో సినిమాలలో చూశాం. కరోనా బారిన పడినవారికి ఇప్పుడు అదే ట్రీట్‌మెంట్ ఎదురవుతున్నది. మానసికంగా కుంగిపోతున్నారు.

అన్నీ కళ్లారా చూసి

ఆస్పత్రులలో చికిత్స పొందుతూ పక్క బెడ్ మీద ఉన్నవారు చనిపోయిన సంఘటనలను కళ్లారా చూశారు. సర్కారు ఆస్పత్రులలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారు. ప్రైవేటు ఆస్పత్రులలో ఆలనా పాలనా, సంరక్షణ కూడా డబ్బులతోనే ముడిపడి ఉందనే వాస్తవాన్నీ గ్రహించారు. మానసిక క్షోభ ఎలాంటిదో అనుభవించారు. రోగం కంటే భయం ఎలా ప్రాణాంతకమైనదో అర్థమైంది. బతికున్నప్పుడు ఎలాంటి గౌరవం ఉందో చూశారు. చివరికి చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాల విషయంలో కనీస మర్యాదలూ, గౌరవ సంప్రదాయాలు ఎలా ఉన్నాయో కళ్ల ముందు కనిపించాయి. మృతదేహాల తరలింపు మొదలు అంతిమ సంస్కారం వరకు ఊహకు అందని ఘట్టాలను చూశాం. చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అని పాటలలో వినడమే తప్ప కరోనా కాలంలో అది పూర్తిగా విరుద్ధమైనదిగా మారిపోయింది. కడసారి చూపు కూడా ప్రమాదంగా మారిపోయింది. దగ్గరికి వెళ్లడానికి కూడా సిద్ధపడలేదు. మున్సిపాలిటీ సిబ్బందే చివరి తంతు ముగించాల్సి వచ్చింది. కనీస గౌరవ మర్యాదలకు సైతం మృతదేహాలు నోచుకోలేకపోయాయి. బాధిత కుటుంబాలకు పలకరింపులు, పరామర్శలు కరువయ్యాయి. కట్టుబట్టలతో నడిరోడ్డుపై పడి వేలాది కుటుంబాలు నిరాదరణకు గురయ్యాయి.

ఇబ్బందులు తెలిసొచ్చాయి

వైరస్ బారిన పడితే వచ్చే ఇబ్బందులేంటో తెలిసిపోయింది. టెస్టుల మొదలు ఆస్పత్రిలో బెడ్, ఆక్సిజన్, మందులులాంటి వాటికి ఎన్ని కష్టాలుంటాయో అర్థమైంది. పైరవీలు, పైసలుంటేనే సాధ్యమనేదీ తెలిసొచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే జరిగే అనర్ధాలు ఎలాంటివో స్వీయానుభవమైంది. పాజిటివ్ అనేది ఒక భయంకరమైన పదంగా మారిపోయింది. దాని బారిన పడకూడదన్న పాఠం నేర్చుకున్నాం. కరోనా వచ్చిన తర్వాత బాధపడడంకంటే రాకుండా చూసుకోవడమే ఉత్తమమని అర్థమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మాస్కు పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం గురించి ప్రభుత్వాలు నొక్కి చెప్పాయి. నిబంధనలను రూపొందించిన పెద్దలే వాటిని తుంగలో తొక్కారు. యధేచ్చగా ఎన్నికల ప్రచార సభలను నిర్వహించారు. ఓట్ల కోసం ప్రజలను నోట్లు ఖర్చు పెట్టి ప్రచారంలోకి తరలించారు. బీరు, బిర్యానీ పొట్లాలను అందించారు. ఆశపడినవారు ఎగబడ్డారు. వైరస్ బారిన పడ్డారు. నోట్లు ఇచ్చిన నేతలు ముఖం చాటేశారు. ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. కానీ ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. ఎవరి బాధలకు వారే బాధ్యులంటూ చేతులు దులుపుకున్నారు. జిల్లాలో వంద పడకల ఆస్పత్రి అంటూ గతంలో హామీ ఇచ్చారు. వాటి అమలును గాలికొదిలేశారు. అవి సాకారమై ఉంటే కనీసం ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఉండేవి. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికడతామంటూ జీవోలు ఇచ్చారు. పర్యవేక్షణ మరిచారు. ఫిర్యదులొస్తే తూతూ మంత్రంగా నోటీసులిచ్చారు. ప్రజా ప్రతినిధులు బాధ్యత లేనివారుగా నిరూపించుకున్నారు. అవసరానికి మాత్రమే వస్తారు తప్ప ఆదుకోడానికి అందుబాటులో ఉండరనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. వారికి కావాల్సింది ఓట్లు మాత్రమే అని తేలిపోయింది.

భ్రమలు తొలగిపోయాయి

కష్టాలలో ఉంటే ఆప్తులు, అనుకున్నవారు వస్తారనే భ్రమలు తొలగిపోయాయి. ఆంబులెన్సుల మొదలు పరమపద వాహనం వరకు అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. చివరకు అంత్యక్రియలకూ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ముక్కుపచ్చలారని శిశువులకు పాలిచ్చే తల్లులెందరో కన్ను మూశారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులెంతోమంది ఉన్నారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో దిక్కుతోచని కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. బంధాలు, అనుబంధాలు, మానవ సంబంధాలన్నీ ప్రశ్నార్థకమయ్యాయి. కరోనా వచ్చిన తర్వాత బాధలు అనుభవించడంకంటే అది రాకుండా చూసుకోవడమే ఉత్తమమని అందరికీ అర్థమైంది. ఆచరణలో దాన్ని పాటించినవారు క్షేమంగా ఉన్నారు. నిర్లక్ష్యం చేసినవారు మూల్యం చెల్లించుకున్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాంటివి లెక్కపెట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు. కరోనా పోతే మరోటి వస్తుందేమో. కానీ, ఇప్పుడు పాటిస్తున్న జాగ్రత్తలనే ఎప్పటికీ పాటిస్తే ఇంటికి, ఒంటికి మంచిది. లేకుంటే కష్టాలు, కన్నీళ్లు తప్పవనేది ఏడాది పాటు కరోనా నేర్పిన పాఠం. ఎవరో వచ్చి ఆదుకుంటారనే భ్రమలొద్దు. ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఎవరికి వారే జవాబుదారీ. కడుపు చించుకుని పుట్టిందెవరో, కాటికి మోసుకెళ్ళేదెవరో, తలకు కొరివి పెట్టేదెవరో, చివరికి వెంట వచ్చేదెవరో తెలియని విచిత్ర పరిస్థితులలో స్వీయ జాగ్రత్తలే మనందరికీ శ్రీరామరక్ష.

ఎన్. విశ్వనాథ్


Similar News