గతేడాది తొలివేవ్‌లో పల్లెలు కరోనా వైరస్ బారిన పడలేదు. దేశమంతా సంపూర్ణ లాక్‌డౌన్‌లో ఉన్నా అందరికీ అన్నం పెట్టి కడుపులు నింపాయి. అన్ని రంగాలూ కుదేలైపోయినా వ్యవసాయ రంగం మాత్రం నిలదొక్కుకున్నది. మునుపటికంటే ఎక్కువగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసింది. దేశంలోని 130 కోట్ల మందిని పస్తులు లేకుండా చూసింది. సెకండ్‌వేవ్‌లో మాత్రం పట్టణాలకు దాదాపు సమానంగా పల్లెలు కూడా వైరస్ బారిన పడ్డాయి. అయినా, ఆహార సంక్షోభానికి తావు లేకుండా ఆదుకున్నాయి. యావత్తు ప్రజలను, ఆర్థిక వ్యవస్థనూ ఆదుకున్న ఈ పల్లెలను, అక్కడి వ్యవసాయరంగాన్ని ఇకపైన కాపాడుకోవాల్సిన ప్రాధాన్యం ఎంతో ప్రభుత్వాలకు, ప్రజలకు తెలిసొచ్చింది. ఇలాంటి పరిస్థితులలో పల్లె జనాన్ని, వ్యవసాయ రంగంలోని రైతాంగాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మొత్తం సమాజంపై ఉంది. ప్రభుత్వాలకు మరింత ఎక్కువ బాధ్యత ఉంది. గతేడాది లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన పరిశ్రమలకు 'ఆత్మ నిర్భర్' లాంటి ప్యాకేజీలతో ఆదుకున్న ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మాత్రం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మొక్కుబడి కేటాయింపులు చేసి సరిపెట్టుకున్నది. ఏక కాలంలో వ్యవసాయ రంగాన్ని పదిలంగా ఉంచడంతోపాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం సూచించడం ఇప్పుడు ప్రభుత్వాల తక్షణ బాధ్యత. కానీ, ఆ దిశగా అడుగులే లేవు.
ఆహార అవసరాలు తీరేలా
వ్యవసాయ రంగానికే కరోనా సోకితే... అనేది ప్రస్తుతానికి అతిశయంగానో, ఊహాజనితంగానో ఉండొచ్చు. భవిష్యత్తులో పట్టణాల తరహాలోనే పల్లెలు కూడా పడకేస్తే 130 కోట్ల మందికి ఆహార అవసరాలు తీరేదెలా? ఏ 'ఆత్మనిర్భర్' లేకున్నా, రుణమాఫీ అమలుకాకున్నా, పంటల బీమా అందకున్నా, గిట్టుబాటు ధర లేకున్నా, సమస్యలు ఎన్ని ఉన్నా మొత్తం దేశ ప్రజల కడుపునింపి ఆదుకున్నాయి కదా! పట్టణాల తరహాలోనే ఇకపైన పల్లెలలోనూ, వేలు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైతే పరిస్థితిని ఊహించుకోలేం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు అడుగులు వేయాలి. సెకండ్‌వేవ్‌లో వ్యక్తులుగా ప్రతీ గ్రామంలో పదుల సంఖ్యలోనే రైతులు, కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడ్డారు. కానీ, వ్యవసాయ పనులకు, పంటల ఉత్పత్తికి పెద్దగా ఇబ్బంది రాలేదు. మహమ్మారిగా మారినా భారీ సంఖ్యలో మరణాలు లేకపోవడం సంతోషం. ప్రభుత్వాలు చేతులెత్తేసి బాధ్యతల నుంచి తప్పుకున్నా గ్రామాల ప్రజలే స్వచ్ఛందంగా కరోనా కట్టడి చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు శారీరక శ్రమ చేసే పల్లె జనంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రులలో చేరాల్సిన పరిస్థితి రాలేదు. ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్వీయ నియంత్రణతో గ్రామీణ ప్రజానీకం బాధ్యతాయుతంగా వ్యవహరించారు.
అరకొర మౌలిక సదుపాయాలు
కరోనా సెకండ్ వేవ్‌తో పట్టణాలు వణికిపోయాయి. ఆస్పత్రులలో బెడ్‌లు లేవు. ఊపిరి పీల్చుకోడానికి ఆక్సిజన్ లేదు. తగిన మందులు లేవు. నిత్యం వేల సంఖ్యలో వైద్య చికిత్స అందక చనిపోయారు. చివరకు శ్మశానాలలో సైతం తగిన సౌకర్యాలు లేక అంత్యక్రియల కోసం మృతదేహాలు క్యూ కట్టాల్సి వచ్చింది. పట్టణాలలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక అరకొర సౌకర్యాలు ఉన్న పల్లెలలో పరిస్థితి మరీ దారుణం. అక్కడ తగిన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో పట్టణాలకు పరుగులు తీయాల్సి వచ్చింది. ఇకనైనా గ్రామీణ ప్రాంతాల వైద్యరంగంలో మౌలిక సౌకర్యాలను కల్పించాల్సిన అవసరాన్ని సెకండ్ వేవ్ అర్థం చేయించింది. ఇప్పటికీ పల్లెలలో ప్రాథమిక సౌకర్యాలు అంతంతమాత్రమే. సిబ్బంది లేరు. ఉన్నచోట మందులు లేవు. అవీ ఉంటే మౌలిక సౌకర్యాలు లేవు. పట్టణాలకు ఇచ్చిన ప్రాధాన్నాన్ని ప్రభుత్వాలు పల్లెలకు ఇవ్వడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా టెస్టుల మొదలు వ్యాక్సిన్ వరకు కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత 'కొవిన్' నిర్ణయంతో ఇంటర్నెట్ సౌకర్యాలు, పరిజ్ఞానం లేని పల్లె జనానికి వ్యాక్సిన్ అందడం అంతంతమాత్రంగానే ఉండిపోయింది. ఆన్‌లైన్ ద్వారా పేర్లను నమోదు చేసుకునే పరిజ్ఞానం లేదు. ఒకవైపు ఎంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే అంతగా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణ మాత్రం ఆ దిశగా లేదు. స్థానికంగా ఉన్న అంగన్‌వాడీలు, ఏఎన్ఎంలు, 'ఆశా' వర్కర్లులాంటి వ్యవస్థలే ఏకైక దిక్కు. వారికి దశాబ్దాల కింద ప్రకటించిన గౌరవ వేతనాలే ఇప్పటికీ అమలవుతున్నాయి.
అన్నదాతను ఆదుకోవడమే ప్రధానం
ఎంతటి సంక్షోభం వచ్చినా తట్టుకుని నిలబడవచ్చుగానీ, ఆహార సంక్షోభం వస్తే సమాజమే తలకిందులవుతుందని కరోనా పాఠం నేర్పించింది. వ్యవసాయ రంగాన్ని, పల్లె సీమలను ఆదుకోడానికి ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గిట్టుబాటు ధరలు, నకిలీ విత్తనాలు, రుణమాఫీ, పంటల బీమాలాంటి సమస్యలకు వెంటనే పరిష్కారం కనుగొనాలి. వాతావరణ ప్రతికూల పరిస్థితులలో నష్టపోయే రైతులను ఆదుకోవాలి. వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించినందున ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టాలి. మూడింట రెండొంతుల మంది పల్లెలలోనే బతుకుతున్నందున అక్కడి వైద్య సౌకర్యాలనూ మెరుగుపర్చాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. వైద్య చికిత్సకు అవసరమైన ఉపకరణాలతో పాటు అంబులెన్సులను అందుబాటులో ఉండాలి. అరకొర జీతాలతో పనిచేస్తున్న ఏఎన్ఎం, 'ఆశా' వర్కర్ల వేతనాలను పెంచాలి. గ్రామాలలో వైద్యారోగ్య సిబ్బందిని తగినంత సంఖ్యలో నియమించడం ద్వారా ముందుగానే వారి అనారోగ్యం లాంటివి తెలుసుకునేలా హెల్త్ ప్రొఫైల్‌పై దృష్టి పెట్టాలి. పట్టణాలపైన ఫోకస్‌ను ఇప్పుడు పల్లెలపైకి మరల్చాలి. సంక్షోభ సమయాల్లో ఆదుకునేది అన్నదాతలే అనే వాస్తవాన్ని కరోనా తెలియజేసింది. అందుకే రైతుల్ని పదిలంగా కాపాడుకోవడం, కరోనా లాంటి వైరస్‌ల బారిన పడకుండా చూసుకోవడం అందరి బాధ్యత. కరోనా లాంటి సంక్షోభాల నుంచి ఎదుర్కోగల సత్తా ఉన్నా ఆహార సంక్షోభం తలెత్తితే సమాజ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.
ఎన్. విశ్వనాథ్