ప్రధాని మోడీ ఈ మధ్య భావోద్వేగానికి గురయ్యారు. కంట తడి పెట్టుకున్నారు. కరోనా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. మనుషులందరికీ ఉన్నట్లే ఆయనకూ భావోద్వేగం ఉంటుంది. కన్నీళ్లూ వస్తాయి. తప్పుపట్టాల్సిందేమీ లేదు. అయితే ఆయనకు కన్నీళ్లు ఎందుకొచ్చాయి? అందుకు దారితీసిన పరిస్థితులేంటి? వాటికి కారణం ఎవరు? కన్నీళ్లతోనే కథ ముగిసిపోతుందా? దానికి కొనసాగింపుగా కార్యాచరణ ఏది? ఆ దిశగా అడుగులేవి? మోడీ కంట తడిపెట్టుకోవడం దేశాలు దాటి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఒక అంతర్జాతీయ పత్రిక 'అదంతా మొసలి కన్నీరు' అంటూ కార్టూన్ ద్వార వ్యాఖ్యానించింది. మన దేశంలోని నెటిజెన్లలో ఆ అభిప్రాయం తీవ్రస్థాయిలోనే ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం 'ఇప్పుడు ఏడ్చే ప్రధాని కాదు.. పనిచేసే ప్రధాని అవసరం' అంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ట్విట్టర్‌లో అది ఒక రోజంతా ' క్రోకొడైల్ టియర్స్' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉండిపోయింది. నిజమైన కన్నీరా లేక మొసలి కన్నీరా? అనే చర్చ ఎలా ఉన్నా ఆ కన్నీటితో సమస్య పరిష్కారమవుతుందా? భావోద్వేగంతో ఆయన వ్యక్తపరిచిన బాధ ఆయన ఒక్కడి బాధే కాదు. దేశంలోని కోట్లాది మందిది కూడా. ఆ బాధలను పోగొట్టడానికి ప్రధానిస్థాయిలో మోడీ తీసుకున్న చర్యలేంటి అనేది కీలకం. గతం సరే, వర్తమానం, భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇకపైన ఏం చేయబోతున్నారనేది ముఖ్యం.
జనాలను ఏడ్పించినవారెవరు?
ప్రధాని అయిన తర్వాత నాలుగైదు సందర్భాలలో మోడీ భావోద్వేగానికి గురయ్యారు. బాధపడ్డారు. కంట తడి పెట్టుకున్నారు. ఆ మాటకొస్తే డయానా చనిపోయినప్పుడు కూడా ఆ దేశ నేతలు ఏడ్చారు. మన దేశంలో కోట్లాది మంది నాలుగైదేళ్లుగా ఏడుస్తూనే ఉన్నారు. వారి ఏడుపులకు కారణం ఎవరు? నల్ల ధనాన్ని వెలికి తీయడానికి నాలుగేళ్ల క్రితం, నోట్ల రద్దు చేసినప్పుడు కోట్లాది మంది నిద్రాహారాలు మాని బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు క్యూ కట్టారు. మోడీ తీసుకున్న నిర్ణయం ఫలితం ఎలా ఉన్నా ప్రజల బాధలకు జవాబుదారీ ఎవరు? ఆ రోజు ప్రజలు పడిన బాధలను కళ్లారా చూసిన మోడీకి కన్నీరెందుకు రాలేదు? కరోనా కారణంగా గతేడాది అనూహ్యంగా లాక్‌డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజలకు ఊపిరి తీసుకునే సమయాన్ని కూడా ఇవ్వలేదు. బతుకు జీవుడా అంటూ కోట్లాది మంది కాలి నడకనే వేలాది కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు చేరుకున్నారు. గుక్కెడు నీటి కోసం, పిడికెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడ్డారు. తనువు చాలించారు. పట్టాలపై పడుకున్న వందలాది మంది రైలు చక్రాల కింద నలిగిపోయారు. మానవజాతి చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఘట్టాలను దేశ ప్రజలు కళ్లారా చూశారు. ఇవేవీ ప్రధాని మోడీకి ఎందుకు కంట తడి పెట్టించలేకపోయాయి?
శవాలు కాలుతున్నపుడు భావోద్వేగం ఎక్కడ?
సెకండ్ వేవ్‌లో ఆస్పత్రులలో బెడ్‌లు అందక, మందులు లేక, ఊపిరాడక వేలాది మంది చనిపోయారు. నీటిలోంచి ఒడ్డున పడిన చేప గిలగిలా కొట్టుకున్నట్లుగా ఆక్సిజన్ లేక కళ్ల ముందు ప్రాణాలొదిలారు. ఆప్తులు, బంధువులు నిస్సహాయులుగా మిగిలిపోయారు. వేలాది మంది చిన్నారులు అనాథలయ్యారు. లక్షలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. జానెడు పొట్ట కోసం ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ అందక భర్తను కాపాడుకోడానికి నోట్లో నోరు పెట్టి ఊపిరి పోయడానికి భార్య ప్రయత్నించాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఇవేవీ మోడీ కంట తడి పెట్టించలేదు. విధాన నిర్ణయాలు తీసుకునే మోడీ నిస్సహాయులుగా మిగిలిపోయారా? నిర్లక్ష్యంగా ఉండిపోయారా? కార్పొరేట్ ఆస్పత్రులు పేషెంట్లను డబ్బుల కోసం జలగల్లా పీడిస్తున్నాయి. డెడ్ బాడీలకు కూడా చికిత్స చేస్తున్నాయి. బిల్లు కట్టకుండే మృతదేహాన్ని కూడా ఇవ్వనని సహాయకులకు నిర్బంధించాయి. ప్రజల కష్టాన్ని సొమ్ముచేసుకునే డ్రగ్ మాఫియా, బ్లాక్ మార్కెటీర్లను ప్రధాని కట్టడి చేయలేకపోయారు. ప్రజల కన్నీళ్లకు ఇవన్నీ కారణం కాదా? కోట్లాది మందిని ఏడిపించిన ప్రధాని ఇప్పుడు ఏడ్వడం దేనికి సంకేతం? ఏడ్పించినవారే ఏడిస్తే లోకం ఏమనుకోవాలి? ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? కరోనాతో చనిపోయినవారి శవాలను కాల్చడానికి శ్మశానాలలో స్థలం లేదు. కట్టెలు లేవు. వందలాది శవాలు దహనం కోసం క్యూలో ఉండిపోయాయి. దేశమంతా ఇదే పరిస్థితి. రోడ్లమీద ఆంబులెన్సుల సైరన్ శబ్దాలు. ఆస్పత్రులకు, శ్మశానాలకు చక్కర్లు. సైరన్ శబ్దం వింటేనే గుండెల్లో గుబులు. అంబులెన్సులు దొరకకపోవడంతో సైకిళ్ళమీద, భుజాల మీద మోసుకెళ్ళే దృశ్యాలు. గంగా నది ఒడ్డున వందలాది కుళ్లిన కళేబరాలను కుక్కలు పీక్కుతినే దృశ్యాలు. చితికి కట్టెల్లేక కిరోసిన్ పోసి కాల్చే దృశ్యాలు. ఇవేవీ మోడీకి కంట తడి పెట్టించలేదు.
ప్లానింగ్ లేని ప్రధాని
సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు, సలహాదారులు, శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆక్సిజన్ కష్టాలు వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేయాలంటూ పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఇవేవీ మోడీ చెవికి ఎక్కలేదు. వైరస్ వ్యాప్తి చెందకుండా మార్గదర్శకాలను రూపొందించిన ప్రధాని, ఆయనతో పాటు ఉన్న మంత్రులే ఉల్లంఘించారు. తొలి వేవ్‌లో ఎదురైన లోపాలను చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు. ప్రజారోగ్య వ్యవస్థను గాడిన పెట్టే చర్యలు తీసుకోలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భారీ స్థాయి ప్రచార సభలనే నిర్వహించారు. ప్రజలను కూడా భారీగానే తరలించారు. వారిని చూసిన మోడీ, అమిత్ షా సంతోషంగా ఉందంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. ఆ ప్రజలంతా ఈ ఇద్దరికీ ఓటర్లుగానే కనిపించారు. వారికి కరోనా సోకుతుందనేది గుర్తుకే రాలేదు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయ లబ్ధి కోసం పాకులాడిన మోడీకి వారిని కరోనా పేషెంట్లుగా మారుస్తున్నామన్న భావన ఏ మాత్రం ఎందుకు కలగలేదు? తగినన్ని టీకాలు లేకుండానే 'టీకా ఉత్సవ్' ప్రకటించారు. తొలి వేవ్ నుంచి బైట పడడాన్ని గొప్పగా చెప్పుకుని తన వల్లనే అని క్రెడిట్‌ను సొంతం చేసుకున్న మోడీ సెకండ్ వేవ్ విషయంలో మాత్రం చేతులెత్తేశారు. రాష్ట్రాలమీదకు నెట్టారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో బిజీ అయిపోయారు. ప్రజలు సుఖంగా లేని పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థ గురించి తపనపడ్డారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం నుంచి, ప్రధాని నుంచి ప్రజలు పరిష్కారాన్ని కోరుకున్నారు. కరోనా నుంచి దూరంగా ఉండేందుకు టీకాలను కోరుకున్నారు. ఆపదలో ఆదుకోడానికి ఆస్పత్రులలో బెడ్‌లను కోరుకున్నారు. ఆర్థిక స్థోమతకు తగినట్లుగా వైద్య చికిత్సను కోరుకున్నారు. కన్నీళ్లను కోరుకోలేదు. ప్రజలను తన బిడ్డలుగా భావించే పెద్దగా మాత్రమే కాక, గురుతర బాధ్యతతో పాలకుడిగా ఉన్న ప్రధానిగా కన్నీరు పెట్టడం కన్నా కార్యాచరణ దిశగా అడుగులు వేయడం తక్షణావసరం. తన ఏడుపే కాదు.. ప్రజల ఏడుపు కూడా ఇదే చివరిదిగా ఉండాలి.
ఎన్. విశ్వనాథ్