తనిఖీల్లేవ్.. సోదాల్లేవ్.. అసలు ఈసీ ఏం చేస్తోంది..?
దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎన్నడూ లేనంత విచ్చలవిడిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో మద్యం, నగదు పంపిణీ అవుతున్నది. నిఘా పెట్టి నిలువరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. ప్రచారం ముగిసిన తర్వాత జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి. యధేచ్ఛగా నోట్ల పందేరం జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ఒక్కో ఓటు ధర ఆరు వేల రూపాయలు పలుకుతున్నట్లు వీడియోలు వెలుగులోకి వచ్చినా, నోట్లు అందలేదంటూ మహిళలు ధర్నాలు చేస్తున్నా ఇటు రాష్ట్ర […]
దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎన్నడూ లేనంత విచ్చలవిడిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో మద్యం, నగదు పంపిణీ అవుతున్నది. నిఘా పెట్టి నిలువరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. ప్రచారం ముగిసిన తర్వాత జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి. యధేచ్ఛగా నోట్ల పందేరం జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ఒక్కో ఓటు ధర ఆరు వేల రూపాయలు పలుకుతున్నట్లు వీడియోలు వెలుగులోకి వచ్చినా, నోట్లు అందలేదంటూ మహిళలు ధర్నాలు చేస్తున్నా ఇటు రాష్ట్ర రెవెన్యూ అధికారులు, అటు కేంద్ర ఎన్నికల కమిషన్ తరపున ఇక్కడ అబ్జర్వర్ల విధుల్లో ఉన్న అధికారులూ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్‌కు విచక్షణాధికారాలు, పూర్తి స్వేచ్ఛ ఉన్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్న ప్రాథమిక కర్తవ్యంలో విఫలమైంది. పోలింగ్ ప్రక్రియను రద్దు చేయాలని ఈసీకి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహణ కోసం రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తరపున వివిధ స్థాయిల్లోని అధికారులు వచ్చారు. ఒక్కో బృందానికి ఎనిమిది మంది చొప్పున మొత్తం ఐదు మండలాలకు కలిపి 40 మంది స్టాటిక్ బృందాల సభ్యులు చేరుకున్నారు. దీనికి తోడు ప్రతీ మండలానికి ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్, 35 మంది సెక్టోరల్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా మద్యం, గిఫ్టులు, నగదులాంటివి సరఫరా కాకుండా నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు చెక్ పోస్టుల్లాంటివి ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించడం, అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు చేయడం తదితర పనులు చేయడం వీరి బాధ్యత. కానీ దసరా పండుగ సందర్భంగా మనిషికి రెండు క్వార్టర్ల మద్యం, మాంసం, నగదు లాంటివి విచ్చలవిడిగా ఓటర్లకు పంపిణీ అయ్యాయి. ఇక మొత్తం ఉప ఎన్నిక ప్రక్రియకు ఒక (జనరల్) అబ్జర్వర్, ఒక స్పెషల్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్, ఒక పోలీసు అబ్జర్వర్, ఒక పోలింగ్ అబ్జర్వర్ కూడా ఉన్నారు. వీరంతా సైలెంట్‌గానే ఉండిపోయారు.
నిద్రపోతున్న ఎన్నికల యంత్రాంగం
ప్రచారం ముగిసిన తర్వాత ఉధృతంగా ప్రలోభాలు పెట్టేందుకు ఒక్కో ఓటుకు ధర నిర్ణయించి కవర్లలో పెట్టి మరీ నోట్లను పంచుతున్నా పట్టించుకోలేదు. గంటల వ్యవధిలోనే వందల కోట్ల రూపాయలు ఓటర్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అవి అందలేదనే అసంతృప్తితో ధర్నాలు కూడా జరిగాయి. అందరికీ ఇచ్చినట్లుగా తమకూ ఇవ్వాలని పలు గ్రామాల్లో మహిళా ఓటర్లు డిమాండ్ చేశారు. చివరకు తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా జరిగినా చలనం లేదు.
ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసే పేరుతో కరెన్సీ నోట్లను పంచుతూ ఉంటే, రోడ్ల మీదుగా వాహనాల్లో నోట్ల కట్టలను తరలిస్తూ ఉంటే కేంద్రం నుంచి వచ్చిన ఇరవై కంపెనీల పారామిలిటరీ బలగాలు, కేంద్ర ఎన్నికల సిబ్బంది, అబ్జర్వర్లు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారన్నది ప్రధానంగా మారింది. ఎన్నికల ప్రక్రియను నోట్ల పండుగలాగా మార్చినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్నా, క్షేత్రస్థాయిలో రాత్రి వేళల్లో చడీ చప్పుడు కాకుండా నోట్ల పంపిణీ జరుగుతున్నా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. నియోజకవర్గంలోకి నోట్లు, మద్యం రాకుండా నివారించేందుకు సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టినా అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. నియోజకవర్గంలోని వివిధ మండలాల సరిహద్దుల్లో, ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు లేనే లేవు.
గోనె సంచుల్లో నోట్ల కట్టలు బైకులమీదా, కార్లలో రవాణా అవుతున్నా పోలీసులు తనిఖీలు చేయడంలేదు. ప్రచారం గడువు ముగిసిన తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్ళిపోవాలనే ఆదేశాలు ఉన్నా పదుల సంఖ్యలో వివిధ పార్టీల నేతలు ఇంకా గెస్ట్ హౌసుల్లో, అద్దె ఇండ్లలోనే ఉన్నారు. కొద్దిమంది బంధువుల పేర్లతో కొనసాగుతున్నారు. పోలీసులు మాత్రం ఎక్కడా తనిఖీలు చేయడం లేదు. స్థానికేతరులను ఖాళీ చేయించే ప్రయత్నాలూ చేయలేదు. నిబంధనలు పటిష్టంగానే ఉన్నా అమలు విషయంలో రాష్ట్ర, కేంద్ర అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియే అపహాస్యం పాలవుతున్నది. కేంద్ర ఎన్నికల కమిషన్ తరపున రాష్ట్రంలో ప్రతినిధిగా ఉండే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సైతం నామ్ కే వాస్తేగా మారిపోయారు.
గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో నోట్ల పంపిణీ జరుగుతుండడంపై మేధావులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామిక విలువల కోసం తహతహలాడే సంఘాలు, స్వచ్చంద సంస్థలు ముక్కున వేలేసుకుంటున్నాయి. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి (రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్) సైతం ఎన్నికల సంఘం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసేనాటికి ఇంకా ఎన్ని ఉల్లంఘనలు చూడాల్సి వస్తుందోననే ఆవేదనను మేధావులు వ్యక్తం చేస్తున్నారు.