ఈటలపై వేటే? సీరియస్‌గా తీసుకుంటున్న టీఆర్ఎస్
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అధిష్టానం వేటుకు రంగం సిద్ధమవుతోంది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయా పరిణామాలు ఆసక్తిగా మారాయి. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి గానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ పార్టీకి తలనొప్పిగా మారారు. తాజాగా బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఈటల… బీజేపీ జాతీయ నేతలతో […]
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అధిష్టానం వేటుకు రంగం సిద్ధమవుతోంది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయా పరిణామాలు ఆసక్తిగా మారాయి. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి గానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ పార్టీకి తలనొప్పిగా మారారు.
తాజాగా బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఈటల… బీజేపీ జాతీయ నేతలతో భేటీ అవుతుండటంతో ఇక వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతల్లో టాక్. త్వరలోనే చర్యలు తీసుకోనున్నారనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా మంగళవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ఈటలపై వేటు వేయనున్నారంటూ సంకేతాలిచ్చినట్లేనని భావిస్తున్నారు.
సీరియస్ గా టీఆర్ఎస్ అధిష్టానం
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తర్వాత కొంత దూకుడు పెంచిన ఈటల… టీఆర్ఎస్ వ్యతిరేకులు, బహిష్కృత నేతలతో సమావేశమయ్యారు. ఇతర పార్టీల నేతలను సైతం సంప్రదించారు. దీంతో కొత్త పార్టీ పెడుతారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా బీజేపీవైపు మొగ్గు చూపడటంతో రాజకీయ పరిణామాలు మారినట్లు అయ్యాయి. మరోవైపు టీజేఎస్ కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి నేతలు మాత్రం ఐక్యంగా పోరాడుదామని, బీజేపీలో చేరే ఆలోచన వద్దంటూ సూచించిన మరుసటి రోజే ఈటల ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు చర్చగా మారింది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బీజేపీతో మంతనాలు చేస్తుండటంతో అధికార పార్టీ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంటోంది.
గులాబీ నేతల విమర్శనాస్త్రాలు
ఈటల బీసీకాదు… ఓసీ అని.. పెట్టుబడి దారి అని.. ప్రజాసంక్షేమం కాదు… ఆస్తులను పెంచుకోవడమే ధ్యేయమని టీఆర్ఎస్ మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆత్మగౌరవం లేదని… ఈటలకు కమ్యూనిజం భావాలు లేవని, బహుజనవాదాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాజకీయబిక్షపెట్టిన కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సరికాదని.. ఈటల మాటలకు.. చేతలకు పొంతనలేదని ఆరోపించారు. ఈటలను బహుజనులంతా ఛీ కొడుతున్నారని.. ఆయన సమాధిని ఆయనే తవ్వుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈటల మద్దతుదారులపై ఆరా
మాజీ మంత్రి ఈటలకు వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలతో పాటుగా రాష్ట్రంలో ఇంకా ఎవరైనా మద్దతు తెలుపుతున్నారా… టచ్‌లో ఉంటున్నారనే అనే వివరాలను గులాబీ నేతలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈటలతో అంటకాగే వారిని కూడా పార్టీ నుంచి బయటకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈటలకు అండగా ఉంటామనే ఇతర పార్టీల నేతలు, పలు సంఘాల నేతలతో కూడా టీఆర్ఎస్ నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈటలను ఒంటరి చేయాలనే ప్లాన్ అమలు చేస్తున్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ మాటల తూటాలు
పల్లా ఆత్మగౌరవం పేరిట ఈటలపై చేసిన ఆరోపణలు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అగ్గిని రాజేసినట్లయింది. ఈటలకు ఆత్మగౌరవం లేదని… బీజేపీ నేతల కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని పల్లా ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నేత డీకే అరుణ ధీటైన కౌంటర్ ఇచ్చారు. పల్లాకు, టీఆర్ఎస్ లో ఉండే నేతలకు ఆత్మగౌరవం లేదన్నారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత పల్లా రాజేశ్వర్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. రూ.150 కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ అయిన పల్లాకు ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ ఇతరులను ఆత్మగౌరవం లేదని చెప్పడం అవివేకం అన్నారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ‘ఆత్మగౌరవం’ రాజకీయ వేదికైంది. ఇది ఎటుదారి తీస్తుందో వేచిచూడాల్సిందే.