మంత్రి మల్లారెడ్డి, సబితకు నిరసన సెగ
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మంత్రులకు రాష్ట్రంలో అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. ఏక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో నిరసనకారులు మంత్రులను అడ్డుకుంటూనే ఉన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బాలుర పాలిటెక్నిక్ హాస్టల్‌ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవితో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులను DYFI నాయకులు అడ్డుకున్నారు. […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మంత్రులకు రాష్ట్రంలో అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. ఏక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో నిరసనకారులు మంత్రులను అడ్డుకుంటూనే ఉన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బాలుర పాలిటెక్నిక్ హాస్టల్‌ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవితో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులను DYFI నాయకులు అడ్డుకున్నారు. మేడ్చల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మేడ్చల్‌లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రూ.127 కోట్లతో 17 పాలిటెక్నిక్ భవనాలు నిర్మించినట్లు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో నాలుగు బాలికలకు, ఒకటి ఎస్టీ బాలురకు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 22 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో సుమారు 2,200 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్నట్లు పేర్కొన్నారు.
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. విదేశాల్లో చదివే వారికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రపంచంతో మన తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అత్యాధునికంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో సీఎస్ఆర్ నిధులతో ఐటీఐ నూతన భవనాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.