ఆర్టీసీలో దసరా ఆఫర్.. ప్రయాణికుల ఇంటికే బస్
దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లు అంటూ.. వారిని ఆకర్షించేందుకు ఎండీ సజ్జనార్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం శ్రేయస్కారం కాదని, ప్రజారవాణాని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో పండుగల సీజన్ నేపథ్యంలో ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేలా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులను ఆకర్షించి ప్రతి ఒక్కరూ ప్రజా రవాణాను […]
దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లు అంటూ.. వారిని ఆకర్షించేందుకు ఎండీ సజ్జనార్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం శ్రేయస్కారం కాదని, ప్రజారవాణాని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో పండుగల సీజన్ నేపథ్యంలో ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేలా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
ఈ క్రమంలో ప్రయాణికులను ఆకర్షించి ప్రతి ఒక్కరూ ప్రజా రవాణాను వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడమే ధ్యేయంగా ఆర్టీసీ రేపటి నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. అంతేకాకుండా ప్రయాణికుల చెంతకే బస్సులు వచ్చి వారిని పికప్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకురానున్నారు.
పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వారు 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒకే ప్రాంతానికి వెళ్లే వారు ఉంటే ప్రత్యేకంగా ఓ బస్సును పంపిస్తామని ఆర్టీసీ తెలిపింది. అయితే, దీనికోసం 24 గంటల ముందే డిపోలకు తెలియజేస్తే బస్సును ఏర్పాటు చేయనున్నారు. దసరా ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రజలంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్యాకేజీని కాలనీవాసులు, కాంట్రాక్టర్ వద్ద పనిచేసే కార్మికులు, విద్యార్థులు తదితరులు ఎవరైనా వినియోగించుకోవచ్చు.
ఈ సదుపాయం కోసం.. రేతిఫైల్ బస్ స్టాప్- 9959226154, కోఠి – 9959226160, ఎంజీబీఎస్- 9959226257, జేబీఎస్-9959226246 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది. అంతేకాకుండా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ అధికారులు పోలీసుల సహాయం తీసుకోనున్నారు. ప్రతి బస్ డిపో, ప్రయాణికులు అధికంగా ఉండే ప్రాంతాలలో పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.