బీకేర్ ఫుల్.. చుక్కేసి చిక్కితే చుక్కలే

దిశ ప్రతినిధి, మేడ్చల్: వీకెండ్ కాదా..? ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారు.. రెండు పెగ్గులేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాంలే అనుకుంటే పొరపాటే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికారా.. అంతే సంగతి. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. బీకేర్ ఫుల్. మహా అయితే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే వెయ్యో.. రెండు వెయ్యిలో ఫైన్ కట్టేస్తే సరి అనుకుని లైట్ తీసుకుంటే కుదరదు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి విషయంలో న్యాయస్థానాలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఇటీవల సుచిత్ర చౌరస్తాలో […]

Update: 2021-02-26 20:24 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: వీకెండ్ కాదా..? ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారు.. రెండు పెగ్గులేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాంలే అనుకుంటే పొరపాటే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికారా.. అంతే సంగతి. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. బీకేర్ ఫుల్. మహా అయితే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే వెయ్యో.. రెండు వెయ్యిలో ఫైన్ కట్టేస్తే సరి అనుకుని లైట్ తీసుకుంటే కుదరదు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి విషయంలో న్యాయస్థానాలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఇటీవల సుచిత్ర చౌరస్తాలో పట్టుబడ్డ ఓ మందుబాబుకు కోర్టు రూ.10వేల జరినామాతోపాటు మూడ్రోజుల పాటు జైలు శిక్ష విధించింది. అదేవిధంగా నార్త్ జోన్ పరిధిలో చిక్కిన ‘నిషా’చరులకు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు జరినామాలు విధించారు. తాజాగా శుక్రవారం కూకట్ పల్లిలో 10మంది మందుబాబులకు జైలు శిక్ష విధించారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలు..

కరోనా వల్ల దాదాపు 10నెలల పాటు నగర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించలేదు. కేసులు తగ్గుముఖం పట్టడడంతో దాదాపు రెండు నెలలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలను మూడు రకాలుగా విభజిస్తుంటారు. వాహన చోదకుడికి మాత్రమే ముప్పుగా మారేవి. ఎదుటి వ్యక్తికి ముప్పుగా పరిగణించేవి. వాహన చోదకుడితోపాటు ఎదుటి వారికీ ముప్పు తెచ్చేవి. మిగిలిన రెండింటి కంటే మూడో కోవకు చెందిన వాటిని ట్రాఫిక్ పోలీసులు తీవ్ర నేరంగా పరిగణిస్తారు. మద్యం తాగి వాహనాలను నడుపడం మూడో కోవకు చెందినదే కావడంతో స్పెషల్ డ్రైవ్ సహా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ‘నిషా’చరులకు జరినామాతోపాటు జైలు శిక్ష విధించే అవకాశం మోటారు వాహన చట్టంలో ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రైవ్ ను మోటర్ వెహికిల్ యాక్టులోని సెక్షన్ల ప్రకారం చేస్తున్నారు.

పక్కా ఆధారాలతో శిక్షలు..

మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారిని కోర్టుకు తీసుకెళ్లాలంటే సెక్షన్ 185 ప్రకారం బుక్ చేసి, ఆధారాలతో వెళ్లడం అవసరం. చట్ట ప్రకారం ప్రతి 100మిల్లీ లీటర్ల రక్తంలో 30మిల్లీ గ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ట్రాఫిక్ పోలీసులు గతంలో మందుబాబులను ర్యాష్ డ్రైవింగ్ (సెక్షన్ 184-బీ) కిందే కేసు బుక్ చేసి ఫైన్ తో సరిపెట్టేవారు. ఇప్పుడు ఆ పై సెక్షన్ 185 ప్రకారం బుక్ చేసి కోర్టుకు తరలిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్ నుంచి వచ్చిన ఫ్రింట్ అవుట్ ను ఆధారంగా చూపి చిక్కిన వ్యక్తిని కోర్టులో ప్రవేశ పెడుతున్నారు.

కరోనా తర్వాత రెట్టింపు..

డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉల్లంఘనలను కరోనాకు ముందు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు జరినామా విధించేవారు. అయితే ప్రస్తుతం భారీస్థాయిలో జరినామాలు విధిస్తున్నారు. చోదకుడు అత్యంత ప్రమాదకరస్థాయిలో మద్యం తాగాడని లేదా పదేపదే మద్యం తాగి వాహనం నడుపుతున్నాడని న్యాయమూర్తి భావిస్తే 2 నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. దీనికితోడు డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా రద్దు చేస్తున్నారు. మద్యంతాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిలో ఎక్కువ మోతాదు వారికి, ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తుండడంతో భయపడిన కొందరు తమ వాహనాలను ట్రాఫిక్ పోలీసుల వద్దనే వదిలేస్తున్నారని ఓ అధికారి పేర్కొన్నాడు. ఈ తరహా పట్టుబడ్డ కార్లు, ద్విచక్ర వాహనాలతోపాటు ఆటోలు మూడు కమీషనరేట్ల పరిధిలో కొన్ని వేలు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

వారి ప్రాణాలు రక్షించేందుకే..

మద్యం తాగి వాహనాలను నడుపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వారితోపాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేకంగా టెస్టులు నిర్వహిస్తున్నాం. తాగి వాహనం నడుపొద్దని, సేఫ్ గా ఇళ్లకు చేరుకోవాలని ఆయా ప్రాంతాల్లో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం.

– రవికుమార్, ట్రాఫిక్ ఇన్‌‌స్పెక్టర్, తిరుమలగిరి

Tags:    

Similar News