వరకట్న వధ్యశిలపై మహిళ

Update: 2022-08-15 18:45 GMT

సుందర ప్రపంచ సృష్టికి మూలం మహిళలు, పురుషుల సంగమమనేది సార్వ జనీన సత్యం. ఇదే సకల మతాలకు పునాదిగా కొనసాగుతున్న భావవాదంతో పాటు, డార్విన్ పరిణామ సిద్ధాంతంతో మనుగడలో నున్న భౌతికవాదం కూడా. ఈ నేపథ్యంలో తరతరాలుగా మహిళలు, పురుషుల సంగమం కోసం ఓ విశిష్ట సాంప్రదాయంలో అనివార్యంగా సృష్టించబడింది వైవాహిక బంధం. అలాంటిది మహిళలు పురుషులను అంగడిలో సరుకులా కొనుక్కోవాల్సి రావడం అత్యంత దురదృష్టకరం.

వివాహ సందర్భంగా వరుడికి వధువు తల్లిదండ్రులు ఇచ్చే నగదు, ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తు వాహనాలే వరకట్నం. నిజానికి ఈ సంప్రదాయం వివాహం తర్వాత తమ కూతురు అత్తారింటిలో ఎలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోకుండా వుండడానికి ఉద్దేశించినది. కూతురి మీద ప్రేమతో స్వచ్ఛందంగా ఇచ్చేదే తప్ప చట్టబద్ధం కాదు. మెజారిటీ తల్లిదండ్రులు వరకట్నం ఇవ్వకపోతే తాము తక్కువైపోతామనే భావనతోనే ఇస్తారు. ఓ ఆచారంగా ప్రారంభమైన వరకట్నం నేడొక తొలగించలేని దురాచారంగా మారింది.

చట్టరీత్యా నేరమే

వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని భారత ప్రభుత్వం 1962లో ప్రకటించింది. వరకట్న నిషేధ చట్టాన్ని తీసుకు వచ్చింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత నిరాదరణకు గురవుతున్న చట్టాలలో ఇది మొదటి స్థానంలో ఉంది. చట్టాలను జారీచేసే శాసనసభ్యులతో పాటు వాటిని అమలు చేసే కార్యనిర్వాహక వ్యవస్థ, అఖిల భారత సర్వీసుల అధికారులు, చట్టాల అమలు తీరుని పర్యవేక్షించే న్యాయమూర్తులు సైతం యథేచ్ఛగా వరకట్నాన్ని ప్రోత్సహిస్తుండడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. చట్ట ప్రకారం మేజర్ అయిన యువతీ యువకులు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోవాలి. కానీ, అనాదిగా సదరు ఒప్పందాలు ఇరు కుటుంబాల మధ్యే జరుగుతున్న వైనం బహిరంగ రహస్యమే.

గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన సంబంధాలను వెతుక్కోవడానికి పెళ్లిళ్ల పేరయ్యల సేవలను ఉపయోగించుకునేవారు. వారెంతో నిజాయితీగా తగు సంబంధాలను చూసి పెట్టేవారు. నేడు మ్యారేజ్ బ్యూరోలు పక్కా వ్యాపార సంస్థలుగా మారాయి. తప్పుడు సమాచారం, ఫొటోలతో మోసాలకు పాల్పడుతున్నాయి. మీడియా ప్రభావంతో సెలబ్రిటీలు, ధనవంతుల వివాహాల తాలూకు డాంభికాలకు మధ్యతరగతి కుటుంబాలవారు ఆకర్షితులవుతున్నారు. 'పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు' లక్షల రూపాయల ఖర్చుతో వివాహాల బడ్జెట్‌ను విపరీతంగా పెంచుకుంటున్నారు. ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌ల విపరీత ప్రవర్తనా వెగటు కలిగిస్తోంది. అసలే వరకట్నాల బాధతో కుంగిపోతున్న వధువు కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారుతోంది.

గృహహింసకు మూలాలుగా

'ఆజాదికా అమృతోత్సవాల' నడుమ కోట్లాది నవ వధువుల ఆక్రందనలు వినలేకపోతున్నామేమో కానీ, నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం వరకట్న వేధింపులే గృహహింస లో అధికంగా ఉన్నాయి. ప్రభుత్వాలు మాత్రం చట్టాల జారీతో సరిపెట్టుకుంటూ, అమలును గాలికి వదిలివేస్తున్నాయి. వరకట్న వేధింపులు, గృహహింస బారి నుంచి మహిళలను రక్షించడానికి జారీ చేసిన చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు.

పురుషులనూ వారి కుటుంబసభ్యులనూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలూ, న్యాయస్థానాలు అనివార్యంగా సదరు చట్టాల వాడిని తగ్గిస్తున్నాయి. ఫలితంగా వరకట్న వేధింపుల విషవలయంలోకి మహిళలు తమను తామే తెచ్చుకుంటున్నారని మహిళావాద ఉద్యమకారుల, మహిళా హక్కుల పరిరక్షణ సంస్థలు చెబుతున్నాయి.

ఏం చేయాలి?

వివాహం ఇరువురి వర్తమానానికీ, భవిష్యత్‌కే కాదు, ఈ సుందర ప్రపంచ సృష్టికీ, మనుగడకూ మూలమైనప్పుడు అంగడిలో సరుకులాగా పురుషులను కొనుక్కోవాల్సిన అవసరమేమిటో యువత ఆలోచించాలి. విశ్వవిద్యాలయాలలో, బహిరంగ వేదికలపై 'మేం వరకట్నం తీసుకోబోమనే' ఊకదంపుడు ఉపన్యాసాలు మాని వరకట్న రహిత వివాహాలకు త్రికరణ శుద్ధిగా నడుం కట్టాలి. వరకట్నం భయంకర సామాజిక దురాచారమని గుర్తించాలి.

దీంతో రాబోయే కాలంలో మహిళా జాతి అస్థిత్వమే ప్రమాదంలోకి నెట్టివేయబడి మానవ జాతి అర్ధంతరంగా అంతరించిపోక తప్పదనే కఠోర సత్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. యువతలో, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలి. ప్రభుత్వాలు చట్టాలను వంద శాతం అమలు చేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. మీడియా ప్రచారం కోసం, రేటింగ్‌ను పెంచుకోవడం కోసం కాకుండా చిత్తశుద్ధితో వరకట్న మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు సహకరించాలి. సోషల్ మీడియా సైతం నిజాయితీగా ఉండాలి. అప్పుడే వరకట్న రహిత సమాజ నిర్మాణం జరుగుతుంది.

నీలం సంపత్

సామాజిక కార్యకర్త

98667 67471

Tags:    

Similar News