నూటికొక్కటేనా! చూ‘చైనా’ కట్టలేరా?

చైనాలో జెస్ట్ టెన్ డేస్‌లోనే పేద్ద హాస్పిటలే కట్టేశారు. మన ఊర్లు, టౌన్లల్ల మాత్రం డబుల్ బెడ్రూం ఇండ్లు ఏండ్ల సంది ఎంతకూ పూర్తవడం లేదు. ఈడ ఆడ అని కాదు యాడ జూసినా గట్లనే ఉన్నది పరిస్థితి. ఎర్రవల్లిలో ఆ పొద్దే కొంతమందిని ‘ఒక్కింటి’ వారిని చేశారు. అలా సొంతిండ్ల హోదా కోసం లక్షలాది పబ్లిక్ కండ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. నిన్నియ్యాల అన్నట్టు కొన్నిచోట్ల నామ్‌కే వాస్తేగా గృహ యోగం కలిగించారు. స్టేట్ […]

Update: 2020-02-27 08:45 GMT

చైనాలో జెస్ట్ టెన్ డేస్‌లోనే పేద్ద హాస్పిటలే కట్టేశారు. మన ఊర్లు, టౌన్లల్ల మాత్రం డబుల్ బెడ్రూం ఇండ్లు ఏండ్ల సంది ఎంతకూ పూర్తవడం లేదు. ఈడ ఆడ అని కాదు యాడ జూసినా గట్లనే ఉన్నది పరిస్థితి. ఎర్రవల్లిలో ఆ పొద్దే కొంతమందిని ‘ఒక్కింటి’ వారిని చేశారు. అలా సొంతిండ్ల హోదా కోసం లక్షలాది పబ్లిక్ కండ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. నిన్నియ్యాల అన్నట్టు కొన్నిచోట్ల నామ్‌కే వాస్తేగా గృహ యోగం కలిగించారు. స్టేట్ లెవెల్‌లో చూస్తే 33 జిల్లాల్లో 20 జిల్లాల గరీబోళ్లకు రెండు పడక గదుల ఇండ్లు అందలేదు. 2019 సెప్టెంబరు నాటికి హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో 2.82 లక్షల ఇళ్లు సాంక్షనిచ్చారు. వాటిల్లో 1.79 లక్షల ఇండ్ల పనులు షురూ జేశిండ్రు. 90 శాతం రూపమొచ్చినవి 96 వేలు. అన్ని విధాలా పనులు జరిగినవి 34 వేల ఇండ్లే. కానీ, పంపిణీ చేసింది మాత్రం జెస్ట్ 4 వేలే. సూడుండ్రీ ఎక్కడ 2.82 లక్షలు, ఎక్కడ 4 వేలు! సింపుల్‌గా చెప్పాలంటే, జనానికి అందినవి నూటికి ఒక్కటే! నిజానికి మంజూరిచ్చిన ఇండ్ల కంటే కనీసం 10 రెట్ల గరీబులు ఇండ్ల కోసం ఆరాటపడుతున్నారు. పనులు చాలైనవి, పూర్తయినవి, ఇండ్లు అందజేసిన లెక్కలు చూస్తే నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా! ఇగ రాష్ట్రంలో ప్రతి ఒక్క బీదకూ డబుల్ బెడ్రూం ఇంటి యోగానికి ఎన్నాళ్లు పడుతుందో! చైనాను చూసైనా స్ఫూర్తి కలగడం లేదు.

జోగులాంబ నుంచి నారాయణపేట వరకు..

దరఖాస్తులు సమర్పించి, నాయకులు, అధికారుల చుట్టూ తిరిగిన లక్షల మంది నిరుపేదలు ‘సర్కారు గూడు’పై గంపెడాశలు పెట్టుకున్నారు. పేదోళ్ల ఆశలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూం హౌసెస్ పథకంపై ఆహో ఓహో్ అంటూ ప్రచారం చేసుకున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇళ్లు కట్టిస్తామని తియ్యటి కబుర్లు చెప్పింది. ప్రజలకు పైసా ఖర్చు లేకుండా సొంతింటి కల నెరవేరుస్తామని పాలకులు వాగ్దానం చేశారు. ఇల్లంటే గిట్లుండాలే అన్నట్టుగా నమూనాల పైనా పబ్లిసిటీ చేసేశారు. అదే అనేక మందిని ఉబలాటపెట్టింది. కానీ, వాస్తవంలో నిరాశే అనుభవంలోకి వచ్చింది. జోగులాంబ గద్వాల మొదలు నారాయణపేట వరకు 20 జిల్లాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో కనీస పురోగతి లేదు. సంగారెడ్డి, కరీంనగర్, పాలమూరు, ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో మాత్రం అక్కడక్కడా లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేర్చారు.

కాసుల కొరతే కారణమా?

శాసనమండలిలో ప్రభుత్వం ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ 1.30 లక్షల ఇండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిందని ప్రకటించింది. ఈ క్రమంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు ఏమైనా మిగిలి ఉంటే పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. తద్వారా లక్ష మంది లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇండ్లకు ఓనర్లయ్యామని గొప్పగా చెప్పుకొనేవారు. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇందుకు కాసుల కొరతే మూల కారణమా? అనే డౌటు మొదలైంది. మిగతా పనుల మాదిరి కాంట్రాక్టర్లకు లాభసాటి కాకపోవడమూ ప్రతిబంధకంగా మారింది. ఈ స్కీం కోసం నాబార్డు నుంచి తెచ్చిన రూ. 6 వేల కోట్ల అప్పును మిషన్ భగీరథకు డైవర్ట్ చేశారని విపక్షాలు ఆరోపించడం ప్రస్తావనార్హం.

కంప్లీట్ అయినవీ..

ఆయా చోట్ల పూర్తయిన ఇండ్లనైనా పేదలకు అప్పగిస్తే బాగుండేది. అదీ వాయిదాల పర్వమే. ఒకరికి ఇస్తే మరొకరితో కంటు అవుతామనే బెంగ కూడా అంతర్లీనంగా ఉన్నట్టున్నది. పేదల్లోకెల్లా పేదలకు నిజాయతీగా పంపిణీ చేస్తే సమాజం హర్షిస్తుంది. ఇవాళ కాకుంటే, రేపైనా తమకూ అందుతాయనే నమ్మకం ఇతరుల్లో ఏర్పడుతుంది. ఇండ్లు అందుబాటులోకి వచ్చి, ప్రారంభానికి నోచనివి మచ్చుకు చూస్తే.. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల సెగ్మెంట్‌లోని ముస్తాబాద్‌లో 2015 అక్టోబర్ 22న ఇండ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసారు. ఎట్టకేలకు 160 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. ఓ ఏడాది అటో ఇటో మొత్తానికైతే ఇండ్లు అప్పట్లో కంప్లీటయ్యాయి. పోయిన దసరాకే కొత్తిండ్లల్ల దావత్ చేసుకుందురనీ ఊరించారు. కండ్లెదుటే ఇండ్లు కానవస్తున్నా, అప్పగించే ముహూర్తమే అందని ద్రాక్షయింది. ఆ సామూహిక గృహాలపై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. ఎవరిని అదృష్టం వరిస్తుందన్నది నేటికీ సీక్రేటే. ప్రజలుగా మనం ఓట్లేశాక ఎవరు గెలుస్తారోనని.. ఓట్లేసిన మనం ఎట్లా ఉత్కంఠగా వేచి చూస్తామో స్థానికంగా సేమ్ అట్లే ఉద్విగ్నత నెలకొంది. ఉన్నంతలో యోగ్యతగల లబ్ధిదారులను సొంతింటి వారిని చేస్తే చాలు! ఆ సెలక్షన్ బెటర్‌గా ఉండాలని జనం కోరుకుంటున్నారు. ఇండ్లు పంచే దాకా ఆ లిస్టు గోప్యంగానే ఉండేట్లుంది. ఇంకా ఎపుడనేదే అక్కడ తేలాలి.

Tags:    

Similar News