నిర్మాణం పూర్తయినా.. ప్రవేశాలు ఎప్పటికో?

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణ పథకం రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండలా మారింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ నెరవేర్చడంతో ముందుకెళ్లలేక, వెనక్కి రాలేక అపసోపాలు పడుతోంది. అసలే నిధుల కొరత ఉండగా నిర్మాణంలో ఆశించిన మేర ప్రగతి కనిపించడం లేదు. వేల సంఖ్యలో ఇండ్లు మంజూరుకాగా, ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమయ్యాయి. మెజారిటీ గ్రామాల్లో అసలు టెండర్లే కాకపోగా, చాలా చోట్ల పనులు ప్రారంభం కాలేదు. పునాదుల దశలోనే […]

Update: 2021-01-28 23:32 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణ పథకం రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండలా మారింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ నెరవేర్చడంతో ముందుకెళ్లలేక, వెనక్కి రాలేక అపసోపాలు పడుతోంది. అసలే నిధుల కొరత ఉండగా నిర్మాణంలో ఆశించిన మేర ప్రగతి కనిపించడం లేదు. వేల సంఖ్యలో ఇండ్లు మంజూరుకాగా, ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమయ్యాయి. మెజారిటీ గ్రామాల్లో అసలు టెండర్లే కాకపోగా, చాలా చోట్ల పనులు ప్రారంభం కాలేదు. పునాదుల దశలోనే నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. సర్కారు ఇచ్చే నిధులు సరిపోక కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. మౌలిక వసతుల కోసం ఇచ్చే రూ.1.25 లక్షలకు కోత పెట్టడంతో.. నిర్మాణం పూర్తయిన ఇండ్లలోకి ప్రవేశాలు చేసే పరిస్థితి లేకుండా పోయింది.

ప్రభుత్వానికి భారంగా..

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రభుత్వానికి భారంగా మారింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.05 లక్షల నుంచి రూ.5.25 లక్షల మేర ఇస్తున్నాయి. వేల సంఖ్యలో ఇండ్లు మంజూరు చేసినా, నిర్మాణానికి నిధులు సరిపోక కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో టెండర్లు కూడా పూర్తి కావడం లేదు. నిర్మల్ జిల్లాకు మొత్తం 6,686 ఇండ్లకు గాను 3,426 ఇండ్లు మంజూరుకాగా, రూరల్​కు, 3,260 ఇండ్లు అర్బన్​కు కేటాయించారు. వీటిలో 96 స్థలాలను గుర్తించి.. 5,641 ఇండ్లకు పరిపాలనా అనుమతులిచ్చారు. ఇందులో 3,176 ఇండ్లకు టెండర్లుకాగా, 2,465 ఇండ్లకు టెండర్లు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికీ పట్టణాలకు 2,660 ఇండ్లు, గ్రామాలకు 2,981 ఇండ్లు మంజూరుకాగా, పట్టణాల్లో 652, గ్రామాల్లో 299 ఇండ్లు పూర్తయ్యాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్వగ్రామమైన ఎల్లపెల్లిలో 45 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయగా.. ఉమ్మడి జిల్లాలోనే అన్ని వసుతులతో కూడిన తొలి మోడల్ కాలనీ ఏర్పాటు చేశారు. మరో 24 ఇండ్లు కూడా నిర్మాణం పూర్తవగా.. ప్రవేశాలకు సిద్ధం చేశారు. జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టగా.. మరికొన్ని గ్రామాల్లో టెండర్ల దశలోనే ఆగిపోయాయి.

ముందుకురాని కాంట్రాక్టర్లు

జిల్లాలోని కొన్ని గ్రామాలు, పట్టణాల్లో డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం చేసినా.. మౌలిక వసతులు కల్పించకపోవడంతో గృహ ప్రవేశాలకు నోచుకోవడం లేదు. ఇండ్ల నిర్మాణ సామాగ్రికి రాయితీలు ఇస్తున్నా.. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుండగా, సిమెంట్, స్టీల్ ధరల్లో రాయితీ ఇస్తున్నారు. అయినప్పటికీ జిల్లాలో ఇండ్ల నిర్మాణంలో పురోగతి లేదు. గతంలో అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాల్వలు, సెప్టిక్ ట్యాంకు, విద్యుత్​సౌకర్యం లాంటి మౌలిక వసతుల కల్పనకు ప్రతి ఇంటికి అదనంగా రూ.1.25లక్షల మేర చెల్లించారు. నిధుల కొరతతో తాజాగా మౌలిక వసతుల కల్పనకు ఒక్కో ఇంటికి ఇచ్చే రూ.1.25 లక్షలు తీసేయడంతో ఇండ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. మౌలిక వసతుల నిధుల కోత పెట్టడంతో స్థానిక సంస్థల నుంచి తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు స్థానిక, మౌలిక వసతుల కల్పనకు సంస్థలు ముందుకు రావడంలేదు. కొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తయినా.. మౌలిక వసతులు లేక మధ్యలోనే వదిలేశారు. ఇండ్ల నిర్మాణానికి నిధులు సరిపోవడంలేదని కాంట్రాక్టర్లు పేర్కొంటుండగా.. మౌలిక వసతుల నిధులు తీసేయడంతో తామేం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో కొత్త ఇండ్లలోకి ప్రవేశాలు లేక.. లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు. నిర్మల్​లోని నాగనాయిపేట, బంగల్ పేట్, రత్నాపూర్, కాండ్లితో పాటు వివిధ గ్రామాల్లో ప్రవేశాల ముహూర్తం నాలుగు నెలలుగా తరచూ వాయిదా పడుతూ వస్తోంది.
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.

కాగితాలకే పరిమితం

నిధులు సరిపోక.. నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఇండ్లు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక కొన్ని చోట్ల నిర్మించగా, మౌలిక వసతుల కల్పనకు నిధులు తొలగించడంతో ప్రవేశాలకు అడ్డంకిగా మారింది. ముధోల్ నియోజక వర్గంలో 54 గ్రామాలకు 1,440 ఇండ్లు మంజూరవగా.. కేవలం 209 ఇండ్లకే టెండర్లు పిలిచారు. 177 ఇండ్లు వివిధ దశలో ఉండగా.. రెండు గ్రామాల్లో 30 ఇండ్లు పూర్తయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. ఖానాపూర్ నియోజకవర్గానికి 685 ఇండ్లు మంజూరవగా.. 400 ఇండ్లకు టెండర్లు పిలిచారు. ఖానాపూర్ పట్టణంలో 180 ఇళ్ల గోడలు పూర్తవగా, 220 ప్లాస్టరింగ్ పూర్తయ్యాయి. పెంబి మండలంలో ఐదు గ్రామాలకు 85 మంజూరవగా.. కడెం మండలం పెద్దూర్​కు 200 ఇండ్లు మంజూరయ్యాయి. రెండు మండలాల్లోని ఆరు గ్రామాల్లో ఒక్క చోట కూడా టెండర్లు, నిర్మాణాలు కాలేదు. నిర్మల్ నియోజకవర్గంలో మామడ, దిలావర్పూర్, లక్ష్మణచాంద, నర్సాపూర్(జి), సారంగాపూర్ మండలాల్లో 509 ఇండ్లు మంజూరవగా.. ఒక్క ఇంటికి టెండరు కాలేదు. పీఆర్ ఆధ్వర్యంలో 747 ఇండ్లకుగాను.. 269ఇండ్లు పూర్తయ్యాయి. పట్టణంలో 1460ఇండ్లకు 652పూర్తి చేయగా.. మిగతావి చివరి దశలో ఉన్నాయి.

* నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లిలో 50 ఇండ్ల నిర్మాణం చేశారు. ఇది ఇరిగేషన్ స్థలం కావడంతో వేరే చోట స్థలం కేటాయించారు. ఎలాగోలా ఇండ్లు నిర్మాణం చేస్తే.. మౌలిక వసతులు ‘కల్పన‘ గా మారాయి. సీసీరోడ్లు, డ్రైనేజీలు లేవు. కేవలం విద్యుత్​లైన్లు వేసి వదిలేశారు. లబ్ధిదారులు ఇళ్లల్లోకి ప్రవేశాలు చేయకపోవడంతో కిటికీల అద్దాలు పగులగొడుతున్నారు. తలుపులకు వేసిన తాళాలు పగులగొట్టి.. రాత్రుల్లో మందుబాబుల అడ్డాగా మార్చుకుంటున్నారు. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు సంబంధించి వేర్వేరు జాబితాలు ఇవ్వడంతో వివాదం నెలకొంది.

* ముధోల్ నియోజకవర్గం కుభీర్ మండలం వీరేగాంలో 15 ఇండ్లు నిర్మించి గృహ ప్రవేశాలు కూడా చేసి.. దాదాపు ఏడాది పూర్తయింది. ఇందులో నివాసం ఉంటున్నా.. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం, విద్యుత్​ లైన్లు లేవు. నిర్మల్​లోని నాగనాయిపేట, బంగల్పేట్​లో 652ఇండ్ల నిర్మాణం పూర్తవగా.. ఇక్కడ మౌలిక వసతులు కల్పించలేదు. ప్రవేశాల ముహూర్తం నాలుగు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరణ, పరిశీలన పూర్తయింది.

* కుభీర్ మండలం సాంవ్లీకి 17 ఇండ్లు, పాత సాంవ్లీకి 16 ఇండ్లు మంజూరయ్యాయి. పథకం ప్రారంభ సమయంలో ఇండ్లు మంజూరైన సాంవ్లీలో ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పటికీ పిల్లర్లు, బీమ్​ల దశలో నిలిచిపోయాయి. లబ్ధిదారుల నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేయగా.. ఏళ్లు గడుస్తున్నా ఇండ్లు మాత్రం పూర్తి కాలేదు. పాత సాంవ్లీలో 16 ఇండ్లు మంజూరుకే పరిమితమవగా.. నిర్మాణాలకు నోచుకోలేదు.

* తానూరు మండలంలోని ఐదు గ్రామాలకు 154 ఇండ్లు మంజూరవగా.. నిర్మాణం మాట అటుంచితే అసలు ఒక్క ఇంటికి టెండర్లు పిలవలేదు. ముధోల్​లో ఆరు గ్రామాలకు 241 ఇండ్లు ఇవ్వగా.. 24కు టెండర్లు పిలువగా ఒక్క ఇల్లు పూర్తికాలేదు. బాసరలో మూడు గ్రామాల్లో 116 ఇండ్లకు 20 ఇండ్లకే టెండర్లవగా ఒక్క ఊరిలో కడుతున్నారు. కుభీర్​లో 16 గ్రామాల్లో 346 ఇండ్లకు గాను 85 ఇండ్లకే టెండర్లు పిలిచారు. ఐదు గ్రామాల్లో పనులు చేపట్టగా.. ఓ గ్రామంలో 15 ఇండ్లు పూర్తయ్యాయి. లోకేశ్వరంలో 10 గ్రామాలకు 210 ఇండ్లకు 15 ఇండ్లకే టెండర్లు పిలిచి నిర్మాణం పూర్తి చేశారు. భైంసాలో ఎనిమిది గ్రామాలకు 240 ఇండ్లు మంజూరవగా.. రెండు గ్రామాల్లో 30 ఇండ్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు.

Tags:    

Similar News