‘డబుల్’ కల నెరవేరేనా!

సొంతిల్లు లేని వారికి డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. అందులో భాగంగా కొన్ని నిర్మాణాలను పూర్తి చేసింది. అవి తమకు ఎప్పడు వస్తాయో.. అని అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇండ్లు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేలు వెనుకంజ వేస్తున్నారు. కొందరికి ఇండ్లు పంపిణీ చేస్తే మిగిలిన వారి నుంచి అసంతృప్తి ఎదురవుతుందని ఆలోచిస్తున్నారు. ఇండ్ల పంపిణీ వల్ల రాజకీయంగా లబ్ధి చేకూరడం కన్నా నష్టమే ఎక్కువగా వచ్చే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. […]

Update: 2020-06-22 04:42 GMT

సొంతిల్లు లేని వారికి డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. అందులో భాగంగా కొన్ని నిర్మాణాలను పూర్తి చేసింది. అవి తమకు ఎప్పడు వస్తాయో.. అని అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇండ్లు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేలు వెనుకంజ వేస్తున్నారు. కొందరికి ఇండ్లు పంపిణీ చేస్తే మిగిలిన వారి నుంచి అసంతృప్తి ఎదురవుతుందని ఆలోచిస్తున్నారు. ఇండ్ల పంపిణీ వల్ల రాజకీయంగా లబ్ధి చేకూరడం కన్నా నష్టమే ఎక్కువగా వచ్చే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇదీ ఎమ్మెల్యేల పరిస్థితి.

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: డబుల్ బెడ్ రూం ఇండ్ల మాటెత్తితే చాలు భద్రాద్రి కొత్తగూడం జిల్లా ఎమ్మెల్యేల్లో గుబులు పుడుతోంది. నిర్మాణం పూర్తయినా పంపిణీ చేసేందుకు అక్కడి ఎమ్మెల్యేలు ముందుకు రావడం లేదు. ఇండ్ల పంపిణీ అంశం అస‌మ్మ‌తి రాజేస్తుందని ఎమ్మెల్యేలు వ‌ణికి పోతున్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ ఎమ్మెల్యేల‌కు రాజ‌కీయ సంక‌టంగా మారింది. ఇండ్లు ద‌క్క‌ని వారిలో అసమ్మ‌తి రగిలితే దాన్ని చ‌ల్లార్చ‌డం అంత ఈజీ కాదని ఎమ్మెల్యేలే త‌మ అనుచ‌రుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జ‌రిగితే రాజ‌కీయంగా లాభం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కవ జరిగే ప్రమాదముందని గులాబీ శ్రేణుల్లో అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌రికి ల‌బ్ధి చేకూరితే… ‘మాకు టీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం ఇల్లు ఇవ్వ‌లేదు’ అనే అస‌మ్మ‌తి చాలా కుటుంబాల్లో రగిలితే.. దాని కారణంగా పార్టీ అనేక మందికి దూరమయ్యే ప్రమాదముందని వారి అభిప్రాయం. దీంతో కొన్ని మండ‌లాల్లో ఇండ్లు పూర్తయి మూడేళ్లు కావ‌స్తున్నా… పంపిణీకి ఎమ్మెల్యేలు ముంద‌డుగు వేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వర్గ పోరు ఉన్న నియోజకవర్గాల్లో ‘డబుల్’ హీట్..

వ‌ర్గ పోరు, అస‌మ్మ‌తి ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో డ‌బుల్ హీట్ కొన‌సాగుతోంద‌నే చెప్పాలి. కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని సుజాత‌న‌గ‌ర్‌లో ఇటీవ‌ల డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో చెలరేగిన రాజ‌కీయ ర‌గ‌డే ఇందుకు నిద‌ర్శ‌నం. అక్కడ మొత్తం తొమ్మిది డ‌బుల్‌బెడ్‌రూం ఇండ్లకు లాట‌రీ ప‌ద్ధ‌తిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇదంతా క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే చేపట్టారు. ఇండ్లు ద‌క్క‌ని మిగతా లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు అన్యాయం చేశారంటూ, ప్ర‌భుత్వం సైతం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వారికి న్యాయం చేస్తాన‌ని చెప్పి ఎమ్మెల్యే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. కానీ స‌మ‌స్య‌కు నేటికీ ప‌రిష్కారం ల‌భించ‌లేద‌ని అర్హులు వాపోతున్నారు. గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల పథకం కింద అర్హులైన వారంద‌రికీ ప్రభుత్వం ఎంతో కొంత న‌గ‌దు అంద‌జేసేదని, కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యిలో ఒక‌రికి ‘డ‌బుల్’ ఇల్లు ఇచ్చి మిగతా వారి ఆశలను అడియాశలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భ‌ద్రాద్రి జిల్లాలో ‘డ‌బుల్’ లెక్క‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొద‌టి, రెండో ద‌శ‌లో క‌లిపి 5638 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూర‌య్యాయి. ప్ర‌భుత్వం ఇందుకోసం రూ.255కోట్ల‌ను మంజూరు చేసింది. వీటిలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,692 ఇండ్ల నిర్మాణాలకు టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తయింది. ఇందులో అన్న‌పురెడ్డిప‌ల్లి మండ‌లంలో 20, మ‌ణుగూరు మండ‌లంలో 30, బూర్గ‌పహాడ్ మండ‌లంలో 4 ఇండ్లకు సంబంధించిన నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లాలో మొత్తంగా గుంత‌ల ద‌శ‌లో 336 ఉండగా, పునాది ద‌శ‌లో 43, పునాది ద‌శ దాటిన‌వి 1059, వివిధ దశల్లో 1421 ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు 1821 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేసిన‌వి కేవ‌లం 524 మాత్రమే. ల‌బ్ధిదారుల ఎంపిక ప్ర‌క్రియ పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నవి 796 ఇండ్లు. 2011 జనాభా లెక్కలప్రకారం జిల్లా వ్యాప్తంగా 13,04,811 జనాభా ఉండగా, వీరిలో ఇల్లులేని కుటుంబాలు 18వేలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగినట్టు సమాచారం.

ఆక్రమణకు గురవుతున్న నిర్మాణాలు

రాజ‌కీయ బెడ‌ద‌తో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి ముందడుగు పడటం లేదు. ఫ‌లితంగా నిర్మాణం పూర్తయి ఏండ్లు గ‌డుస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికంగా ఉన్న వాళ్లే కొందరు వాటిని ఆక్రమిస్తున్నారు. ప్ర‌భుత్వం త‌మ‌కే ఇండ్లను కేటాయించాల‌ని కొందరు మొండి ప‌ట్టుద‌ల‌తో అధికారుల‌కే చుక్క‌లు చూపిస్తున్నారు. వారిని ఖాళీ చేయించ‌డం ఇప్పుడు అధికారుల‌కు త‌ల‌కు మించిన భారంగా మారుతోంది. ఇదిలా ఉండ‌గా మ‌రికొన్ని చోట్ల గృహ ప్ర‌వేశానికి ముందే డ‌బుల్ బెడ్ రూం ఇండ్లకు బీటలు వారుతుండటం గమనార్హం. కొత్త‌గూడెం ప‌ట్ట‌ణంతో పాటు దుమ్ముగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో పూర్త‌యిన నిర్మాణాల్లో లోపాలు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి. నిర్మాణం పూర్తయిన డబుల్‌ ఇండ్లను పేదలకు పంపిణీ చేయడంలో జిల్లా అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు అలసత్వం వహిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఇండ్లు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి.

Tags:    

Similar News