ట్రంప్ పర్యటన.. ఎందుకు, ఎవరి కోసం?
దేశాధినేతల పర్యటనలంటే.. వాణిజ్య ఒప్పందాలు, బంధాల బలోపేతానికి చర్యలు, ఇరుదేశాల ప్రయోజనాలు అంతర్లీనంగా ఇమిడి ఉంటాయి. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ, 25వ తేదీలలో భారత్‌లో సాగించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనను ఓసారి పరిశీలిద్దాం.. ట్రంప్ పర్యటనపై భారత్ గంపెడాశలు పెట్టుకుంది. భారత్‌ను డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్ జాబితాలోకి అమెరికా మార్చింది. మన దేశ ఎగుమతులపై సుంకాలు […]
దేశాధినేతల పర్యటనలంటే.. వాణిజ్య ఒప్పందాలు, బంధాల బలోపేతానికి చర్యలు, ఇరుదేశాల ప్రయోజనాలు అంతర్లీనంగా ఇమిడి ఉంటాయి. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ, 25వ తేదీలలో భారత్‌లో సాగించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనను ఓసారి పరిశీలిద్దాం..
ట్రంప్ పర్యటనపై భారత్ గంపెడాశలు పెట్టుకుంది. భారత్‌ను డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్ జాబితాలోకి అమెరికా మార్చింది. మన దేశ ఎగుమతులపై సుంకాలు విధించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఒప్పందాలను చేసుకోవాలని మన ప్రభుత్వం భావించింది(డెవలపింగ్ కంట్రీస్ జాబితాలో ఉండగా.. 2017లో భారత్ దాదాపు రూ. 37 వేల కోట్ల దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు పొందడం గమనార్హం). అందుకోసం ఆ దేశంతో కొన్ని ప్రాజెక్టులపై ఒప్పందం కుదుర్చుకోవాలని యోచించింది. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన డిఫెన్స్ ప్రాజెక్టు(రోమియో మల్టీరోల్ హెలికాప్టర్లు, అపాచ్ చాపర్లు)ను ఫైనలైజ్ అయినట్టు సమాచారం. కేంద్ర క్యాబినెట్ ఆ ప్రాజెక్టుకు ఆమోదం కూడా తెలిపింది. అంతేనా! డెయిరీ, పౌల్ట్రీ రంగాల్లో అమెరికా ఎంట్రీకీ పచ్చజెండా ఊపింది. డిఫెన్స్ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన రోజే ట్రంప్ వ్యాఖ్యలు భారత ఆశలపై నీల్లు చల్లాయి. భారత్ తమను మంచిగా చూడలేదని ఆరోపిస్తూ భారత్‌తో కచ్చితంగా భారీ ఒప్పందాలుంటాయి. కానీ, ఇప్పుడు కాదని చెప్పారు. ట్రంప్ పర్యటనతో అమెరికాతో బిగ్‌డీల్స్ ఉండబోవని అర్థమవుతున్నది.
కానీ, భారత్ మాత్రం అమెరికా అధ్యక్షుడికి ఎక్కడా చివుక్కుమనే దృశ్యాలు, వాతావరణం లేకుండా చూసుకునే పనిలో తలమునకలైంది. ఇప్పటికే అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియం వరకు ట్రంప్ ప్రయాణించేదారి నీట్‌గా ఉంది. చెత్తా చెదారమే కాదు, మురికివాడలూ ఆయన కంటికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మన పాలకులు. ఆ దారిలో మురికివాడలను కప్పిపెట్టే గోడలను నిర్మించిన విషయం తెలిసిందే. ట్రంప్ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. అయితే, తాజ్‌మహల్ పక్కనే ఉన్న యమునానది నుంచి మురుగువాసన వస్తుండటంతో దాన్ని అరికట్టేందుకు సుమారు 14 వేల లీటర్ల నీటిని ఆ నదిలో గుమ్మరించేశారు. దీంతో తాజ్‌మహల్ దగ్గర దుర్వాసన చాలా మేరకు తగ్గుతుందని(తాత్కాలికంగా!) ఓ అధికారి తెలిపారు. రోడ్డు పక్కన గోడలు రంగులతో తళుకులీనుతున్నాయి. ట్రంప్‌నకు స్వాగత పలుకులూ గోడలనెక్కాయి.
అయితే, పెద్దగా వాణిజ్య ఒప్పందాలు లేకున్నా ఇక్కడి పాలకుల హడావిడీ కొన్ని సందేహాలను లేపుతున్నాయి. గతేడాది చివర్లో మోడీ టెక్సాస్ నగరంలో నిర్వహించిన ‘హౌడీ మోడీ’ కార్యక్రమం దిగ్విజయమైన సంగతి తెలిసిందే. అమెరికా రెండో అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్‌లో ట్రంప్‌పై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నది. 45 శాతం కన్నా తక్కువ మందే ట్రంప్ వైపు మొగ్గుతున్నట్టు వాషింగ్టన్‌పోస్టు కథనం పేర్కొంది. కాగా, 2016లో ట్రంప్‌ను కాదని హిల్లరీ క్లింటన్‌కు ఆ రాష్ట్రంలోని 84 శాతం మంది ప్రవాస భారతీయులు ఓటేసినట్టు ఓ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో వివరించింది. ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో ప్రవాస భారతీయులు హాజరైన హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్‌కే తన సమ్మతి అనే సూచన వచ్చేలా చేతిలో చేయి వేసి మోడీ ప్రవాస భారతీయుల దగ్గరకు తీసుకెళ్లారు. అసలు కిటుకు ఇక్కడే ఉంది. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహిస్తామని తరుచూ ప్రకటించిన ట్రంప్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు, అంతర్జాతీయంగా తమ నిర్ణయానికి సమ్మతి ఉన్నదని చెప్పుకునేందుకు మోడీ ఆ వేదికను(370 ఆర్టికల్ ఆగస్టులో రద్దయింది. ‘హౌడీమోడీ’ కార్యక్రమం సెప్టెంబర్‌లో జరిగింది.) ఉపయోగించుకున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ట్రంప్ తాజా పర్యటన కీలక సందర్భంలో జరుగుతున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించిన తరుణంలో ఆయన భారత్‌కు విచ్చేస్తున్నారు. అదీ మోడీతో తన సాన్నిహిత్యాన్ని వెల్లడించేందుకా అన్నట్టు ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్‌తోనే పర్యటనను ప్రారంభిస్తున్నారు. ‘హౌడీ మోడీ’(ఒక రకమైన పలకరింపు) కార్యక్రమంలాగే గుజరాత్‌వాసులు ట్రంప్‌ను ‘కెమ్ చో ట్రంప్’(నమస్తే ట్రంప్) అని స్వాగతించనున్నారు. కాగా, 70 లక్షల ప్రజలు తన పర్యటనకు హాజరవుతున్నట్టు ట్రంప్ చెప్పినట్టు గుర్తు చేయడం.. భారత్ తనకు మద్దతిస్తున్నదని ప్రకటించుకోవడానికేనా? అనే కోణాల్లోనూ వ్యాఖ్యలు వినవస్తున్నాయి. భారత పర్యటనను ట్రంప్ తన ఎన్నికల క్యాంపెయిన్‌లా వాడుకోవాలనుకుంటున్నాడా? అనే సందేహాలూ ఉన్నాయి. భారత సర్కారు ఈ పర్యటనకు పెద్దపీట వేయడం వెనుకా.. అదే కశ్మీర్ అంశంతోపాటు భారత ఆర్థిక స్థితిని ముందుకు తెస్తున్నారు. 370 ఆర్టికల్‌ను నీరుగార్చి, జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత కశ్మీర్‌తో ఎలా డీల్ చేయాలో అర్థం కాని స్థితిని కేంద్రం ఎదుర్కొంటున్నది. అడుగైతే వేసింది కానీ, ఎలా తీయాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తరచూ కశ్మీర్ అంశాన్ని తెరమీదకు తెస్తున్న అమెరికా అధ్యక్షుడిని ప్రసన్నం చేసేందుకు మోడీ సర్కారు ఈ హడావిడీ చేస్తున్నదని చర్చ జరుగుతున్నది. దీంతోపాటు ఆర్థిక మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న భారత్ ట్రంప్ పర్యటనతో అమెరికా సహకారాన్ని అందిపుచ్చుకోగలదా? అన్నది వేచిచూడాల్సిందే. మొత్తంగా ట్రంప్ పర్యటన అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న, భారత్‌లో ఆర్థిక మందగమనం నెలకొన్న సందర్భంలో జరుగుతున్నది.