కళ్లముందే గర్భిణి అల్లాడుతున్నా.. ప్రసవం చేయని వైద్యులు
దిశ, నాగర్ కర్నూల్: ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణికి డ్యూటీలో ఉన్న డాక్టర్, సిబ్బంది ముప్పుతిప్పలు పెట్టారు. ఆత్మాభిమానం దెబ్బతీసేలా కులం పేరుతో దూషిస్తూ వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చూపించారు. ఫలితంగా పుట్టిన బిడ్డను పురిలోనే కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. బిజినపల్లి మండలం అంకామ్‌పల్లి తండాకు చెందిన మూడవత్ జ్యోతి రెండో కాన్పు కోసం జిల్లా ఆసుపత్రిలో […]
దిశ, నాగర్ కర్నూల్: ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణికి డ్యూటీలో ఉన్న డాక్టర్, సిబ్బంది ముప్పుతిప్పలు పెట్టారు. ఆత్మాభిమానం దెబ్బతీసేలా కులం పేరుతో దూషిస్తూ వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చూపించారు. ఫలితంగా పుట్టిన బిడ్డను పురిలోనే కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. బిజినపల్లి మండలం అంకామ్‌పల్లి తండాకు చెందిన మూడవత్ జ్యోతి రెండో కాన్పు కోసం జిల్లా ఆసుపత్రిలో ఈ నెల 22న చేరింది. మొదట సాధారణ కాన్పు కావడం రెండో కాన్పు కూడా సాధారణ కాన్పు జరుగుతుందని వైద్యులు చెప్పడంతో సరే అని ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఈ నెల 24న రాత్రి 10గంటల నుండి తెల్లవారుజామున 4గంటల వరకు పురిటి నొప్పులతో అల్లాడుతున్నా.. వైద్యులు మాత్రం కనికరం కూడా చూపలేదు. చివరకు ఆపరేషన్ చేస్తామని సంతకాలు కూడా పెట్టించుకుని అలసత్వం చేశారు.
డ్యూటీలో ఉన్న వైద్యురాలు ప్రేమ కనీసం గదిలోనుండి బయటికి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కింది స్థాయి సిబ్బందే ప్రసవం చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీరా కులం పేరుతో దూషిస్తూ అవమాన పరిచారని మండిపడ్డారు. డ్యూటీ డాక్టర్ స్పందించి ఉంటే బాబు బతికేవాడన్నారు. డాక్టర్ నిర్లక్ష్యంతో ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు ఆసుపత్రిలోని ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. దీంతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యింది పోలీసులు వారిని సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. దీనిపై వైద్యురాలు ప్రేమను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.