మందెక్కడికీ పోదు.. రెండ్రోజులాగితే దాహం తీరిపోతుంది: అవంతి

ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటి నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మద్యం దుకాణాలపై మందుబాబులు ఎగబడ్డారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న స్పృహ ఏమాత్రం లేకుండా సామాజిక దూరం నిబంధనని పక్కనపెట్టి బారులు తీరారు. దీనిపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, మద్యం తాగే వ్యక్తులు దాదాపు నలభై రోజులుగా దానికి దూరంగా ఉన్నారన్నారు. అందుకే షాపులు తెరవడంతో మద్యం తాగాలన్న ఆత్రంతో భారీ సంఖ్యలో దుకాణాల వద్దకు చేరుకున్నారని సర్దిచెప్పారు. ఒకటి రెండ్రోజులు పోతే వారి […]

Update: 2020-05-04 21:56 GMT

ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటి నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మద్యం దుకాణాలపై మందుబాబులు ఎగబడ్డారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న స్పృహ ఏమాత్రం లేకుండా సామాజిక దూరం నిబంధనని పక్కనపెట్టి బారులు తీరారు. దీనిపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, మద్యం తాగే వ్యక్తులు దాదాపు నలభై రోజులుగా దానికి దూరంగా ఉన్నారన్నారు. అందుకే షాపులు తెరవడంతో మద్యం తాగాలన్న ఆత్రంతో భారీ సంఖ్యలో దుకాణాల వద్దకు చేరుకున్నారని సర్దిచెప్పారు.

ఒకటి రెండ్రోజులు పోతే వారి దాహం తీరిపోతుందని అంచనావేశారు. ఇప్పుడింత రద్దీగా కనిపిస్తున్న మద్యం దుకాణాలు రెండు రోజులు దాటితే ఫ్రీ అయిపోతాయని అన్నారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు తెరిచి, మళ్లీ మూసేస్తారేమోనన్న అనుమానంతో కూడా మద్యం దుకాణాల వద్దకు భారీ సంఖ్యలో మందుబాబులు చేరుకుని, మద్యం సీసాలు ముందుగానే కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుందామని అనుకున్నారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ పరిస్థితులలో తాను మందుబాబులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే.. ఈ దేశం వదిలేసి మందు ఎక్కడికీ పారిపోదు. ఇక్కడే ఉంటుంది. కనుక తొందరపడకండి.. అన్ని జాగ్రత్తలు తీసుకుని మద్యం కొనుగోలు చెయ్యండి అంటూ జాగ్రత్తలు చెప్పారు. విశాఖపట్టణం జిల్లాలో 15 కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం సూచనల మేరకు మరో రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగుతాయని అన్నారు.

కంటైన్ మెంట్ జోన్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కంటైన్ మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు చేసినట్టు చెప్పారు. కంటైన్ మెంట్ కాని జోన్లలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపులు ఉన్నాయని వివరించారు. మండల స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఆంక్షల మినహాయింపులపై అక్కడికక్కడే నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు.

Tags: ysrcp, ap, liquor shopes, avanthi srinivas

Tags:    

Similar News