దుబ్బాక ప్రగతే నా లక్ష్యం -సోలిపేట సుజాత

దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, నా భర్త రామలింగారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. నేను ఎమ్మెల్యేగా గెలిచాక శక్తివంచన లేకుండా అభివృద్ధి గురించి ప్రయత్నం చేస్తా. ఆ విషయం ఇక్కడి ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు అని అంటున్నారు దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సోలిపేట సుజాత. కాంగ్రెస్, బీజేపీ  కలిసికట్టుగా తప్పుడు ప్రచారాలు చేసినా ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితి […]

Update: 2020-10-29 22:17 GMT

దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, నా భర్త రామలింగారెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. నేను ఎమ్మెల్యేగా గెలిచాక శక్తివంచన లేకుండా అభివృద్ధి గురించి ప్రయత్నం చేస్తా. ఆ విషయం ఇక్కడి ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు అని అంటున్నారు దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సోలిపేట సుజాత. కాంగ్రెస్, బీజేపీ కలిసికట్టుగా తప్పుడు ప్రచారాలు చేసినా ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించడానికి ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారని చెబుతున్నారు.

1. మీరు రాజకీయాలకు కొత్త కదా.. ఎలా ఎదుర్కొంటారు?

నేను రాజకీయాలకు కొత్తేం కాదు… నా భర్త రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. అనంతరం దుబ్బాక ప్రజల కోసం పనిచేశారు. ప్రతి సందర్భంలోనూ నేను ఆయన వెంటే నడిచా. ఆయన నాతో ప్రతి రోజూ బయట జరిగే రాజకీయాలపై ముచ్చటిస్తుంటుండే.. ముఖ్య మంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆశీస్సులతో ముందుకెళ్తా.

2. రామలింగారెడ్డి ఆశయాలు ఏమిటి?

రామలింగారెడ్డి ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే తపనతో వారి మధ్యే ఉండేవారు. దుబ్బాక అభివృద్ధి కోసం ఆరాటపడేవారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గొప్పది. ఎప్పుడు ప్రజా సేవకే సమయం కేటాయించేవారు.

3. నియోజకవర్గ అభివృద్ధికి మీ భర్త చేసిన కృషి ఏమిటి?

దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండాలని పోటీ పడేవారు. దుబ్బాక నియోజకవర్గం గత పాలకుల పాలనలో అభివృద్ధిలో వెనుకబడింది. రామలింగారెడ్డి దుబ్బాకకు చేసిన సేవ, అభివృద్ధి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందజేశారు. చెరువుల అభివృద్ధికి కృషిచేశారు. నియోజకవర్గంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ లు తెచ్చింది రామలింగన్నే.

4. మీరు సానుభూతితోనే గెలుస్తారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?

నాకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆశీర్వాదాలు ఉన్నాయి. అంతకు మించి దుబ్బాక ప్రజల ఆశీర్వాదం ఉంది. ప్రజల ఆశీర్వాదం తో భారీ మెజారిటీతో గెలుస్తానన్న నమ్మకం ఉంది.

5. మీరు గుర్తించిన సమస్యలు ఏమిటి? వాటిని ఎలా పరిష్కరిస్తారు?

దుబ్బాకలో ఎక్కువగా బీడీ కార్మికులు, చేనేత కార్మికులు వున్నారు. వారికి కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవం. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రికి కూడా ఇక్కడి వారే కావడం. ఈ నియోజకవర్గ సమస్యలు అన్ని వాళ్ళకి తెలుసు. వాళ్ళతో మాట్లాడి త్వరలోనే ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

6. మిమ్మల్ని గెలిపించినా మంత్రి హరీష్ రావు దగ్గరికి వెళ్లాల్సిందేనంటున్నారు కదా.. మీరేం అంటారు?

అలా ఏమీ లేదు. నేను ఎమ్మెల్యే అయితే నాతో అయ్యే ప్రతి సమస్యని పరిష్కరిస్తా. హరిశన్న కుడా ఈ జిల్లా మంత్రే కాబట్టి వారి సహాయం, సూచనలు ఎప్పుడు తీసుకుంటాను.

7. టీఆర్ఎస్ పార్టీలో రామలింగారెడ్డిని వ్యతిరేకించే గ్రూపు ఉందని ప్రచారం. వాళ్లను ఎలా కలుపుకుపోతున్నారు? వారితో ఎవరు మాట్లాడారు?

అది పూర్తిగా అవాస్తవం. టీఆర్ఎస్ గెలుపుని తట్టుకోలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం.

8. ప్రచారంలో నాయకులు, కార్యకర్తలను లాక్కోవడం తప్ప మరేం లేదని బీజేపీ, కాంగ్రెస్ విమర్శిస్తుంది. మీరేం అంటారు?

ఎన్నికల ప్రచారంలో ప్రజలు మా ( టీఆర్ఎస్) ప్రచారాన్ని చూసారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాలని చూసారు. టీఆర్ఎస్ కావాలని దుమ్మెత్తి పోస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటల ఇష్టం లేక, మనసు సంపుకొని అందులో ఉండటం ఇష్టం లేక స్వచ్ఛందంగా టీఆర్ఎస్ లో వస్తున్నారు. వారిని మా మంత్రి, మేము ఆహ్వానిస్తున్నాం. అంతే తప్ప వల్ల లాగా బెదిరించడం, దుష్ప్రచారం చేయడం మాకు రాదు.

9. బీజేపీ అభ్యర్ధిని ప్రచారం చేసుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వాదిస్తున్నారు. దీనికి అధికార పార్టీయే కారణం అంటున్నారు?

వాళ్ళు పోలీసులు. ఎన్నికల కమిషన్ కి లోబడి పని చేసే వాళ్ళు. టీఆర్ఎస్ చెబితే వాళ్ళు ఎందుకు పని చేస్తారు. ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ ఆడుతున్న కొత్త నాటకం. వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం వాళ్ళు సోదాలు చేశారు. అందులో డబ్బు పట్టుబడ్డది. పోలీసులు మా వాహనాలు కూడా చెక్ చేశారు. మేము వారికి సహకరించాము.

10. మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి?

రామలింగన్న ఆశయాలని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి నాకు గొప్ప అవకాశం కల్పించారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నది రామలింగరెడ్డి ఆశయం. ఆయన ఆశయాలని కొనసాగించడానికి నన్ను గెలిపించాలని ప్రజలను కోరుతున్న. ప్రచారానికి పోయిన ప్రతి చోట ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఆశీర్వదిస్తున్నారు.

11. ప్రజలకు మీరేం చెప్పదల్చుకున్నారు?

టీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకాలనీ ప్రజలకి తెలుసు. కానీ ప్రతి పథకం బీజేపీ కేంద్రం నుండి ఇస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగొద్దు. దయచేసి ప్రజలను నేను కోరేది ఒక్కటే బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మకుండా టీఆర్ఎస్ చేసిన, చేస్తున్న అభివృద్ధి ని చూసి నవంబర్3న కారు గుర్తు కి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న.

Tags:    

Similar News