రాష్ట్రానికి ఏడేండ్ల శని

దిశ, తెలంగాణ బ్యూరో : “ తెలంగాణ రాష్ట్రం రాచరిక పాలనకు మారుపేరుగా మారింది. నియంత పోకడలతో రాష్ట్రాన్ని నిలువు దోపిడి చేస్తున్నారు. ఒక్క మనిషికి ఏడేండ్ల శని ఉంటుందని గతంలో విన్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ మొత్తానికి కేసీఆర్​రూపంలో ఏడేండ్ల శని పట్టుకుంది. ఇప్పుడు ఈ శనిని తరిమికొట్టేందుకు ప్రజల్లోకి వెళ్తున్నాం. జరిగే పరిస్థితులన్నీ ప్రజలకు వివరిస్తాం. స్వరాష్ట్రం వస్తే రాష్ట్రం బాగుపడుతుందనుకుంటే కేవలం కేసీఆర్​కుటుంబం మాత్రమే ఆర్థికంగా బలపడింది. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో తేల్చే రోజు […]

Update: 2021-06-01 14:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : “ తెలంగాణ రాష్ట్రం రాచరిక పాలనకు మారుపేరుగా మారింది. నియంత పోకడలతో రాష్ట్రాన్ని నిలువు దోపిడి చేస్తున్నారు. ఒక్క మనిషికి ఏడేండ్ల శని ఉంటుందని గతంలో విన్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ మొత్తానికి కేసీఆర్​రూపంలో ఏడేండ్ల శని పట్టుకుంది. ఇప్పుడు ఈ శనిని తరిమికొట్టేందుకు ప్రజల్లోకి వెళ్తున్నాం. జరిగే పరిస్థితులన్నీ ప్రజలకు వివరిస్తాం. స్వరాష్ట్రం వస్తే రాష్ట్రం బాగుపడుతుందనుకుంటే కేవలం కేసీఆర్​కుటుంబం మాత్రమే ఆర్థికంగా బలపడింది. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో తేల్చే రోజు వస్తోంది..” అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఏడేండ్ల తెలంగాణ పాలనపై ‘దిశ’ ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.

ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే తలెత్తుకుని బతుకుతామనుకున్నాం. ఆత్మ గౌరవంతో ఉందామనుకున్నాం. కానీ ఆత్మ గౌరవం అంటే బతికే పరిస్థితి లేదు. గౌరవం అనేది కూడా తెలియని స్థితికి వచ్చాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నేతలకు ఎలాంటి గౌవరం దక్కుతుందో చూస్తున్నాం. కనీసం సీఎంను కలువాలంటేనే అదో మహా యజ్ఞం. ఎక్కడ, ఎప్పుడు కలువాలో ఇంత వరకూ ఎవరికి తెలియని గండికోట రహస్యం. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఎం ప్రగతిభవన్​కు, ఫాంహౌస్​కే పరిమితమవుతున్నాడు. ఎవరైనా ఎదురు తిరిగితే ఏదో విధంగా అణిచివేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి దాకా అలా ఎంతో మంది కనిపించకుండా పోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్ఠితిని చూస్తున్నాం. అసలు స్వరాష్ట్రంలో సగౌరవంగా బతికే పరిస్థితి లేదు.

త్రీ ఎన్… అన్నింటా ఫెయిల్​

తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు.. నిధులు.. నియామకాలు. కానీ ఇవన్నీ కేవలం కేసీఆర్​కుటుంబానికి దక్కాయి. నిధులు వాళ్లకే, నియామకాలు వాళ్లవే. ప్రశ్నించే వాళ్లను ఎలాగో ఉండనీయడం లేదు. కానీ దేనికోసం పోరాటం చేసి, ఎందుకోసం తెలంగాణను సాధించుకున్నామో వాటిని కనీసం అమలు చేయడం లేదు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో 2 లక్షల ఉద్యోగాల ఖాళీలున్నాయి. ఒక్కటి కూడా నోటిఫికేషన్​రావడం లేదు. అవసరం లేకున్నా 61 ఏండ్లకు పదవీ విరమణ వయస్సును పెంచి నిరుద్యోగుల నోళ్లలో మట్టి కొట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలైతే రాలేదు కానీ కేసీఆర్​కుటుంబంలో అందరికీ పదవులున్నాయి.

అప్పుల తెలంగాణ ఇది

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామంటూ చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్​… అప్పుల తెలంగాణగా మార్చారు. ఘనమైన ఆదాయ వనరులున్న రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో పెట్టారు. రూ.2.30 లక్షల కోట్ల బడ్జెట్​ను చూపించారు. కానీ రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇంత అప్పులు తీసుకువచ్చినా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. ఇదంతా ఎక్కడికి పోయిందో ప్రజలు కూడా గమనించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కామధేనువు

కేసీఆర్​కు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కామధేనువు. డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా డిజైన్​మార్చడం, ప్రతిపాదనలు పెంచడం, లోన్లు తీసుకోవడం వాటిని విడుదల చేసుకోవడం… వాటిని ఆయన దోపిడి ఖాతాల్లో వేసుకోవడం ఇదే జరుగుతోంది. ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకున్నా… లక్షల కోట్లు మాత్రం ఖర్చు అయ్యాయి. వీటిలో కేసీఆర్​కమీషన్లే ఎక్కువ. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వాలని ఎన్నోసార్లు కోరాం. కానీ ఇప్పటి వరకు ఒక్క డీపీఆర్​బయటకు ఇవ్వడం లేదు. డీపీఆర్​బయటకు వస్తే కేసీఆర్​అవినీతి చరిత్ర మొత్తం తెలిసిపోతోంది. సాధారణంగా ఒక్క ప్రాజెక్టును నిర్మించాలంటూ డిటేల్​ప్రాజెక్టు రిపోర్టులో అన్ని వివరాలుంటాయి. కానీ ఏడేండ్ల కాలంలో టీఆర్ఎస్​ ప్రాజెక్టులన్నీ రీ డిజైన్లు చేసింది. వాటికి సంబంధించిన ఒక్క డీపీఆర్​ను బయటకు ఇవ్వడం లేదు. ఎప్పుడైనా కాళేశ్వరం ప్రాజెక్టుతో బంగారం పండుతుందని చెప్పుకోవడమే తప్ప… దీని ద్వారా ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా అనేది చెప్పడం లేదు. గోదావరి నదిపై బరాజ్​లు కడుతున్నామంటున్నారు. కానీ ఒక్క రిజర్వాయరు నుంచైనా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు తవ్వారా… కాల్వలు తవ్వకుంటా కాళేశ్వరం జలాలతో రాష్ట్రం సస్యశ్యామలం అయిందని దొంగ మాటలు చెప్పుతున్నారు. కేవలం కమీషన్ల కోసమే అనుకూలంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.

కనీసం మందులైనా ఉన్నాయా..?

రాష్ట్రంలో కరోనాతో చస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది. బ్లాక్​ ఫంగస్​ వస్తే మందులు కూడా లేవు. కరోనా బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నాలే లేవు. ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలతో వైద్యం అందడం లేదు. ఏడేండ్ల నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో రెగ్యులర్​ఉద్యోగులను నియమించడం లేదు. దీంతో సరైన వైద్య సేవలు అందక కరోనాతో ఇప్పుడు సచ్చిపోతున్నారు. చనిపోయిన వారికి కూడా ఆర్థిక సాయం ఇవ్వడం లేదు.

బయటకు వస్తే బాధలు తెలుస్తయి

ఏండ్ల చరిత్రలో ప్రజలకు దూరంగా ఉన్న సీఎం కేవలం కేసీఆర్​ మాత్రమే. ప్రజలకు కాదు… ప్రజాప్రతినిధులకు కూడా దొరకడు. గడీల పాలన ఎలా ఉంటుందో ఇప్పటి తరానికి సినిమాలాగా చూపిస్తున్నాడు. ఆ గడీల నుంచి బయటకు వచ్చి చూస్తే ప్రజల బాధలు తెలుస్తయి. గడీల గోడలను బద్దలు కొట్టి కేసీఆర్​ను బయటకు తీసుకుచ్చే రోజులు వస్తాయి. దానికోసం కాంగ్రెస్​ పార్టీ నేతలు ప్రజలను సంసిద్ధుల్ని చేస్తున్నారు.

ఏడేండ్ల శని వదిలిస్తాం

రాష్ట్రానికి ఏడేండ్ల శని పట్టింది. ఎందుకోసం తెలంగాణను సాధించుకున్నామో అందులో ఒక్కటి కూడా నెరవేరలేదు. ఉద్యోగాలు రాలేదు. నీళ్లు ఇవ్వలేదు. నిధులన్నీ సొంత ఆదాయం పెంచేందుకు వాడుకున్నారు. తెలంగాణ పల్లెల్లో జనాల దగ్గర రూపాయి లేకుండా మొత్తం గుంజుకుని కేసీఆర్​కుటుంబం వేల కోట్లు సంపాదించుకుంది. స్వరాష్ట్రం సాధించుకుని ఏడేండ్లు అవుతున్న ప్రజలకు పట్టిన శని పోవడం లేదు. ఇక వచ్చే రోజుల్లో కేసీఆర్ అవినీతి పాలన, రాచరిక వ్యవస్థ, నియంత పాలనను ప్రజలకు వివరిస్తాం. కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ప్రతి అంశాన్ని గ్రామ గ్రామాన తేల్చి చెప్పుతాం. ఏడేండ్ల శనిని వదిలిస్తాం.

Tags:    

Similar News