పోచారం సొంత మండలంలో భారీ కుంభకోణం
దిశ ప్రతినిధి, నిజామబాద్/బాన్సువాడ: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాల్లో అవినీతి తతంగాలు రోజుకోచోట వెలుగుజూస్తున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు లాభాల్లో ఉన్న జిల్లా సహకార బ్యాంకు, దాని అనుబంధ సోసైటీలు ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తరువాత అవినీతి కూపంలో మునిగిపోయాయి. గత పాలకవర్గం హయాంలోనే అవినీతి జరిగినట్లు చెబుతోన్న నూతన పాలకవర్గం సభ్యులు, నూతన పాలకవర్గం ఏర్పాటైన ఏడాది తర్వాత బయటకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో తాళ్ల రాంపూర్ సోసైటీ […]
దిశ ప్రతినిధి, నిజామబాద్/బాన్సువాడ: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాల్లో అవినీతి తతంగాలు రోజుకోచోట వెలుగుజూస్తున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు లాభాల్లో ఉన్న జిల్లా సహకార బ్యాంకు, దాని అనుబంధ సోసైటీలు ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తరువాత అవినీతి కూపంలో మునిగిపోయాయి. గత పాలకవర్గం హయాంలోనే అవినీతి జరిగినట్లు చెబుతోన్న నూతన పాలకవర్గం సభ్యులు, నూతన పాలకవర్గం ఏర్పాటైన ఏడాది తర్వాత బయటకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో తాళ్ల రాంపూర్ సోసైటీ అప్పుల కుప్పగా మారింది. స్వయంగా పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలే అక్కడ అవినీతికి అవకాశం కల్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి తోడు కమ్మర్పల్లి మండలం చౌట్‌పల్లి సోసైటీ, తరువాత సిరికొండ సోసైటీ, ఆ తరువాత కోటగిరి సోసైటీ, ఎత్తొండ సోసైటీ, నవీపేట్ సోసైటీ, నాగేపూర్ సోసైటీలపై ఇలా వరుసగా అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమై విచారణ జరిపారు. తాజాగా డీసీసీబీ ఉమ్మడి జిల్లాల బ్యాంక్ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి సొంత మండలమైన బాన్సువాడ బోర్లం సోసైటీలో రూ.3 కోట్ల మేర అవినీతి జరిగిందని డైరెక్టర్ రాణి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం సహకార సంఘంలో గత పాలకవర్గంలో జరిగిన కోటి 80 లక్షల రూపాయల అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి, రాష్ట్ర గవర్నర్‌కి, ఉన్నత అధికారులకు, సొసైటీ డైరెక్టర్ రాణి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉండటంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సహకార సంఘం ద్వారా లారీ కొనుగోళ్లు, అమ్మకాల పేరుతో రూ. 12 లక్షల నిధులు దుర్వినియోగం చేశారని, డ్వాక్రా సంఘాల పేరుతో కొంతమంది అనుకూలమైన వ్యక్తులకు రుణాలు ఇచ్చి పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గృహ రుణాల పేరుతోనూ సహకార సంఘం నిధులను దుర్వినియోగం చేశారని, సహకార సంఘం ద్వారా 2012 నుండి ఇప్పటివరకు ఎల్‌టీ రుణాలు, నకిలీ పాస్‌బుక్‌ల ద్వారా భారీగా అవినీతికి పాల్పడడ్డారని ఆరోపించారు. అధికారులు సైతం తూతూ మంత్రంగా విచారణ చేస్తున్నారని అన్నారు. నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
సమగ్ర విచారణ జరపాలి : AIUWC రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొడాలి సురేష్
బాన్సువాడ మండలం బోర్లం సహకార సంఘంలో జరిగిన అవినీతిని ప్రజలకు తెలియజేసే విధంగా సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరపాలి. అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అందులో రెవెన్యూ రికవరీ యాక్టును అమలు చేయాలి. సహకార చట్టాల ప్రకారం అవినితీకి బాధ్యులైన వారిని భవిష్యత్తులో సహకార ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలి.
కుంభకోణంపై విచారణ షురూ..
బోర్లం సహకార సంఘంలో కోటి 80 లక్షల అవినీతి జరిగినట్లు డైరెక్టర్ రాణి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం శాఖ సీనియర్ ఆడిటర్ ఖలీం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖలీం మాట్లాడుతూ.. సహకార సంఘంలో అవినీతి జరిగినట్లు డైరెక్టర్ రాణి ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం అధికారులకు నివేదిక అందివ్వడం జరుగుతుందని అన్నారు. తదుపరి చర్యలు చట్టప్రకారం ఉంటాయని ఆయన అన్నారు.