బరాక్, ట్రంప్.. ఎంతో ఫరక్!
దిశ, వెబ్‌డెస్క్: సరిగ్గా ఐదేండ్ల కిందట గణతంత్ర దినోత్సవానికి అతిథిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు వచ్చారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం నిన్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఇండియాలో కాలుమోపారు. ఆ ఇద్దరూ అగ్రరాజ్య పెద్దన్నలే కానీ, ఇద్దరి వైఖరులు చాలా భిన్నమైనవి. మౌలికంగా ట్రంప్ బిజినెస్‌మ్యాన్, ఒబామా సెనెటర్. అయితే, ట్రంప్ తుంటరివాడని విమర్శకులు పేర్కొంటుండగా, ఒబామాను మాత్రం రాజకీయ శాస్త్రవేత్తనీ, రాజనీతిజ్ఞుడని అభివర్ణిస్తుంటారు. ఒబామా మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడు. వీరిద్దరికి […]
దిశ, వెబ్‌డెస్క్: సరిగ్గా ఐదేండ్ల కిందట గణతంత్ర దినోత్సవానికి అతిథిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు వచ్చారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం నిన్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఇండియాలో కాలుమోపారు. ఆ ఇద్దరూ అగ్రరాజ్య పెద్దన్నలే కానీ, ఇద్దరి వైఖరులు చాలా భిన్నమైనవి. మౌలికంగా ట్రంప్ బిజినెస్‌మ్యాన్, ఒబామా సెనెటర్. అయితే, ట్రంప్ తుంటరివాడని విమర్శకులు పేర్కొంటుండగా, ఒబామాను మాత్రం రాజకీయ శాస్త్రవేత్తనీ, రాజనీతిజ్ఞుడని అభివర్ణిస్తుంటారు. ఒబామా మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడు. వీరిద్దరికి భారత్ తరఫున మన ప్రధాని మోడీ ఆయా సందర్భాల్లో అద్భుతమైన ఆహ్వానం పలికారు. ‘దోస్త్ మేరా దోస్త్’ అంటూ వెళ్లి తన బాల్య స్నేహితున్ని పలకరించిన మాదిరి ‘బరాక్, బరాక్’ అని పిలుస్తూ స్వాగతం పలికి, స్వయంగా ఒబామాకు ఛాయ్ అందించి అలరించారు మోడీ. నిన్న కూడా ‘తుంటరి’ ట్రంప్ వస్తున్నారని ప్రధాని మోడీ ‘ఒంటరి’గానే వెళ్లి ఆత్మీయ ఆలింగనంతో ఆహ్వానించారు. వీరిద్దరూ భారత పర్యటనల సందర్భంగా ప్రస్తావించిన అంశాలను పరిశీలిద్దాం.
న్యూఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఫౌండేషన్ ఆడిటోరియంలో బరాక్ ఒబామా మాట్లాడారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌కు రావడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. తనకు వ్యక్తిగతంగా భారత్ అనగానే ఇద్దరు వ్యక్తుల మననంలోకి వస్తారనీ, వారిలో ఒకరు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మరొకరు మహాత్మాగాంధీ అని చెప్పారు. గాంధీ నేల భారతమనీ, అహింసానే ఆయుధంగా ధరించి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీజీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌కు, తనకు ఆదర్శమని పేర్కొన్నారు.
స్వామి వివేకానంద వందేండ్ల కిందట చికాగోకు వెళ్లి సర్వమత సమారాధన గురించి చేసిన అద్భుతమైన బోధనను ప్రస్తావించారు. ఆయన అక్కడ చేసిన ప్రసంగంలోని ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ పదాలు ఉటంకిస్తూ బరాక్..‘‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆప్ ఇండియా’’ అని పలికారు. దాంతో ఆడిటోరియంలోని సందర్శకులు చప్పట్లు కొట్టారు. భారత్, అమెరికా సంబంధాలు, సమాజాల గురించి, రాజ్యాంగాల గురించి మాట్లాడుతూ,‘‘వి ద పీపుల్’’తో ప్రారంభమైన రాజ్యాంగ పీఠికను ప్రస్తావిస్తూ న్యాయం, మానవ విలువల గురించి చెప్పారు. దేశ పురాతన వారసత్వాన్ని కొనియాడారు. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిజం భిన్న మతాల గురించి చెబుతూ గాంధీ చెప్పిన ‘తనకు భిన్న మతాలు ఒకే గార్డెన్‌లో ఉన్న అందమైన పువ్వుల వంటివి’’ అన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా ‘‘భారతదేశంలో పెరుగుతున్న మతపరమైన అసహన సంఘటనలు మహాత్మాగాంధీని కూడా దిగ్భ్రాంతి కలిగించేవి’’ అని ఘాటుగా స్పందించారు.
సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన తాను అధ్యక్షుడిగా ఎదిగిన విషయాన్ని ప్రస్తావిస్తూనే సమాజంలో అసమానతలున్న విషయాన్ని గుర్తిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఇదంతా ఉన్నప్పటికీ అసమానతలు అధిగమిస్తూ ఒక వంటవాడి మనవడైన తాను అధ్యక్షుడినయ్యాననీ, ఓ దళితుడు రాజ్యాంగ నిర్మాణంలో తనదైన కృషి చేశాడనీ, ఓ ఛాయ్‌వాలా ప్రధాని కాగలిగాడని తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని, పురుషులతో సమానంగా హక్కుల కల్పన, అవకాశాలుండాలని ఆకాంక్షించారు.
భారతదేశంలో భిన్న మతాలు, సంస్కృతులు, భాషలున్న నేపథ్యంలో భిన్నత్వంలో ఏకత్వంగా ప్రజలు మెలగడాన్ని కొనియాడారు. చిన్నపిల్లల హక్కుల కోసం కృషి చేసిన కైలాష్ సైత్యార్థికి నోబెల్ శాంతి బహుమతి రావడాన్ని ప్రస్తావించారు. తాను తన సతీమణి మిచెల్లి ఒబామా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచే వచ్చామనీ, ఒక లక్ష్యంతో కృషి చేయడం వల్లే ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. యువ భారతం (35 ఏండ్ల వయస్సు లోపు) ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, ఆ దిశగా కృషి జరగాలని ఆశిస్తున్నానని తెలిపారు. భారత్‌కు మిత్రదేశంగా భాగస్వామిగా ఉన్నందుకు అమెరికా గర్వపడుతున్నదని చెప్పి ప్రసంగాన్ని ముగించారు.
ట్రంప్ మాటలు..
అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో సోమవారం ట్రంప్ మాట్లాడుతూ భారత్‌ను అమెరికావాసులు ప్రేమిస్తారని చెప్పారు. ఈ పర్యటనతో తమ హృదయంలో భారత్‌కు ప్రత్యేక స్థానముంటుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రారంభించడం ఆనందంగా ఉన్నదని అన్నారు. రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు వివరించారు. అయితే, ఛాయ్‌వాలాగా ప్రారంభమైన మోడీని ఛాంపియన్‌గా అభివర్ణిస్తూ ఆకాశానికెత్తారు. తన గొప్ప మిత్రుడంటూ కొనియాడారు. సచిన్, విరాట్ కొహ్లీ, డీడీఎల్‌జే షారుఖ్ ఖాన్‌లను ప్రస్తావించారు. మోడీ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని తెలిపారు.
హే..గాంధీ!
సబర్మతీ ఆశ్రమ సందర్శన అనంతరం సందర్శకుల పుస్తకంలో తన గొప్ప మిత్రుడు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెబుతున్నాననీ, ఇదొక అద్భుత సందర్శన అని రాశారు. దీని పట్ల నెటిజన్లు విమర్శించారు. గాంధీజీ ఆశ్రమంలో చరఖా తిప్పి, ఆయన చిత్ర పటానికి నూలు మాలవేసి, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలపడం ఏంటని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అయితే, ఇవాళ ఢిల్లీలోని బాపూ ఘాట్ సందర్శన అనంతరం మాత్రం అమెరికా ప్రజలు సార్వభౌమ దేశమైన భారత్, మహానేత గాంధీ సిద్ధాంతాలకు బలమైన మద్దతుదారులుగా ఉంటారని సందర్శకుల పుస్తకంలో ట్రంప్ పేర్కొన్నారు. రాజ్ ఘాట్ సందర్శించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని వివరించారు.
అయితే, ట్రంప్, బరాక్ ఒబామాలు ఇద్దరూ అగ్ర రాజ్యఅధిపతులే అయినప్పటికీ వారిద్దరి మధ్య తేడాలున్న మాట వాస్తవమని అందుకు వారి పార్టీలు(డెమోక్రటిక్, రిపబ్లిక్), నేపథ్యాలు కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపార, టెలివిజన్ రంగ నేపథ్యం నుంచి వచ్చిన ట్రంప్‌కు ‘‘ది గ్రేట్ నెగోషియేటర్’’ అని పేరున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టే ఆయన వ్యాపార సంబంధ సంకేతాలు ఇస్తూ, మోడీని పొగిడే కార్యక్రమం పెట్టకున్నారని విశ్లేషిస్తున్నారు. బరాక్ ఒబామా ఆశలు, ఆకాంక్షలు, యువ భారతం, ప్రజాస్వామ్యం వంటి అంశాలు ప్రస్తావించడం ద్వారా తనలోని తత్వవేత్తను బయటకు తీసుకొచ్చాడనీ, ట్రంప్ మాత్రం నిన్న మోడీ సారథ్యంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందంటూ ఈ ఏడాది చివర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తనదే గెలుపు అంటూ జోస్యం చెప్పకుంటూ బిజినెస్ డీల్ చేసుకునేందుకే వచ్చినట్టు కనబడుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.