Turkey: ఆస్పత్రిలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి

తుర్కియేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వైద్యులతో కూడిన ఓ హెలికాప్టర్ ఆస్పత్రి భవనాన్ని ఢీకొట్టి కూలిపోయింది.

Update: 2024-12-22 12:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తుర్కియే (Turkey)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వైద్యులతో కూడిన ఓ హెలికాప్టర్ (Helicopter) ఆస్పత్రి భవనాన్ని ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్లా ప్రావీన్స్ గవర్నర్ ఇద్రిస్ అక్బియిక్ (Idris Akbiyik) తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్లా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పటల్‌కు చెందిన వైద్య బృందం ఓ కార్యక్రమం నిమిత్తం ఆదివారం ఉదయం అంతల్యా ప్రావీన్సుకు బయలుదేరారు. ఈ క్రమంలోనే హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఆస్పత్రిలోని నాలుగో అంతస్థును ఢీకొట్టి కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు, ఒక వైద్యుడు, ఒక ఉద్యోగి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు ధ్రువీకరించారు. దీనిపై మరింత సమగ్రమైన విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హెలికాప్టర్ ప్రమాదంపై రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (Erdogan) స్పందించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, ఈ నెల 9న కూడా తుర్కియేలో రెండు సైనిక హెలికాప్టర్లు ఢీకొని ఆరుగురు జవాన్లు మరణించారు.

Tags:    

Similar News