కొత్త కరోనా వస్తే కంట్రోల్ చేయలేం.. 'దిశ'తో డీహెచ్ కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: శీతల వాతావరణ పరిస్థితులే కొత్త ముప్పును తెచ్చే ప్రమాదం ఉన్నదని హెల్త్ డైరెక్టర్ డా.జీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కరోనా వస్తే కంట్రోల్ చేయడం కష్టమవుతుందని ఆయన సూచించారు. దీంతో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారంతా వెంటనే టెస్టులకు వెళ్లాలని కోరారు. సీజనల్ వ్యాధుల లక్షణాలేనని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. వెంటనే వ్యాధి నిర్ధారణ […]
దిశ, తెలంగాణ బ్యూరో: శీతల వాతావరణ పరిస్థితులే కొత్త ముప్పును తెచ్చే ప్రమాదం ఉన్నదని హెల్త్ డైరెక్టర్ డా.జీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కరోనా వస్తే కంట్రోల్ చేయడం కష్టమవుతుందని ఆయన సూచించారు. దీంతో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారంతా వెంటనే టెస్టులకు వెళ్లాలని కోరారు. సీజనల్ వ్యాధుల లక్షణాలేనని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. చలికాలంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కరోనా సింప్టమ్స్ ఉన్నోళ్లంతా నిర్ధారణ కేంద్రాలను సంప్రదించాలన్నారు. దీంతో పాటు అర్హులంతా వ్యాక్సిన్లు వేసుకోవాలని మరోసారి కోరారు. విదేశాల్లో కేసులు పెరగుతున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై ఆయన శనివారం ‘దిశ ’తో మాట్లాడారు.
దిశ: కొత్త కరోనా వచ్చిందని ప్రచారం జరుగుతుంది? ఇది వాస్తవమేనా?
డైరెక్టర్: ప్రస్తుతానికి లేదు. వైద్యారోగ్యశాఖ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నాం. అనుమానం కల్గిన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సీకి పంపుతున్నాం. కానీ ఇప్పటి వరకు కొత్త మార్పులు రాలేదు. సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందిన డెల్టానే కొనసాగుతున్నది. దానిలో కూడా మార్పులు రాలేదు. అధికారికంగా ప్రకటించే వరకు ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు.
దిశ: వ్యాక్సినేషన్ ఎక్కువ జరిగిన దేశాల్లోనూ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి? మన దగ్గర పరిస్థితి ఎలా ఉండబోతున్నది?
డైరెక్టర్:యూకే, అమెరికాల్లో కేసులు పెరుగుతున్న మాట నిజమే. కానీ అవి కొత్త వేరియంట్లుగా నిర్ధారణ కాలేదు. ఆయా దేశాల్లోనూ 80 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. మన దగ్గర ఇప్పటి వరకు 78 శాతం ఫస్ట్ డోసు, 40 శాతం సెకండ్ డోసును పూర్తి చేశాం. మిగతా వారందరికీ వేగంగా పూర్తి చేస్తున్నాం. అంతేగాక శీతకాలం ప్రభావంతో ఎక్కవ మందిలో లక్షణాలు తేలే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రతీ పీహెచ్సీలో టెస్టింగ్ కిట్లను పెంచాం. వ్యాక్సినేషన్ తో పాటు కరోనా టెస్టులను కూడా స్పీడ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
దిశ: ఇతర దేశాల్లోని కరోనా రాష్ట్రానికి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
డైరెక్టర్: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోయినా, ఎయిర్ పోర్ట్లలో మళ్లీ స్క్రీనింగ్టెస్టులను ప్రారంభించాం. దీంతో పాటు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులకు వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశాం. విమానాశ్రయ విశ్రాంతి గదుల్లోనూ వ్యాక్సిన్, టెస్టులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉన్నా, లక్షణాలున్నోళ్లకు మరోసారి టెస్టులు నిర్వహిస్తున్నాం. పాజిటివ్ తేలితే హోం క్వారంటైన్ విధిస్తున్నాం. ఆ సౌకర్యం లేనోళ్లకు ప్రభుత్వ కేంద్రాలకు తరలిస్తున్నాం. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని కూడా నియమించాం. మరోవైపు ఇతర దేశాల్లో కేసులు తీవ్రత, వేరియంట్లపై ప్రత్యేక టీం ఎప్పడికప్పుడు అధ్యయనం చేస్తుంది. ఆయా దేశాల్లో కేసులు పెరగడానికి గల కారణాలనూ అన్వేషిస్తున్నాం.
దిశ: కేసులు పెరగడానికి గల ప్రధాన కారణాలు?
డైరెక్టర్: ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టగానే కొవిడ్ నిబంధనలను సడలింపులు చేశాం. అన్ని షాపులు, మాల్స్, స్కూళ్లను తెరిచాం. మార్కెట్ లో అన్ని కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి. వీటన్నింటిని కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని సూచించాం. కానీ తీవ్రత తగ్గిందనే నిర్లక్ష్యంతో చాలా మంది మాస్కు, భౌతిక దూరాన్ని మరిచారు. ఇదే వ్యాప్తికి ప్రధాన కారణం. అంతేగాక నిత్యం పార్టీలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లలోనూ చాలా మంది కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. దీంతో కొత్త కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నది.
దిశ: ప్రజలకు మీరిచ్చే సలహలు, సూచనలు?
డైరెక్టర్: ఇప్పటి వరకు 18పైబడిన వారందరికీ విస్తృతంగా టీకాలు అందిస్తున్నాం. కానీ చిన్నారులకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కేంద్రం అనుమతి ఇవ్వగానే వారికీ పంపిణీ చేస్తాం. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు కొవిడ్ నిబంధనలను తు.చ తప్పక పాటించాలి. మరోవైపు చిన్నపాటి జలుబు చేసినా, కరోనా టెస్టు చేసుకోవడం బెటర్. వ్యాధిని వేగంగా గుర్తిస్తే కోలుకోవడం సులువు. వ్యాక్సిన్, టెస్టులపై ఎలాంటి సందేహాలున్నా 104ను సంప్రదించాలి.