తిరుమల వేంకటేశ్వర స్వామి కళ్లు ఎందుకు మూసి ఉంచుతారు.. దాని వెనుక రహస్యం ఇదేనా..

విభిన్న విశ్వాసాలకు, సంప్రదాయాలకు పేరుగాంచిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి.

Update: 2024-03-13 08:41 GMT

దిశ, ఫీచర్స్ : విభిన్న విశ్వాసాలకు, సంప్రదాయాలకు పేరుగాంచిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. ఆ దేవాలయాల్లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. తిరుపతి బాలాజీ ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా పిలుస్తారు. వెంకటేశ్వర స్వామిని శ్రీనివాస, బాలాజీ, గోవింద అనే పేర్లతో భక్తులు పిలుస్తారు. రోజుకు లక్షలాది మంది భక్తులు ఈ ఆలయంలో వెలసిన బాలాజీని దర్శించుకుంటారు. కొలిచిన వారికి కొంగుబంగారమై, భక్తుల కోరికలు తీర్చే కలియుగ దైవం వేంకటేశ్వరుడు. తిరుపతి బాలాజీ విష్ణుమూర్తి అవతారమని ఆయన కలియుగంలో ఉన్నంత కాలం కలియుగం అంతం కాదని భక్తుల నమ్మకం.

అయితే ఏడుకొండలపై వెలసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ మూసి ఉంటాయని ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి. ఎందుకు తిరుపతి బాలాజీ కళ్ళు మూసి ఉంటాయో అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుపతి బాలాజీ కళ్లు ఎందుకు మూసి ఉంచుతారు ?

తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వేంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలోని తిరుమలలో ఉంది. శ్రీ హరి అవతారమైన వేంకటేశ్వరుడు శక్తివంతమైన, ప్రకాశవంతమైన కళ్ళను మూసే ఉంచుతారు. ఎందుకంటే ఆయన భక్తులు వెంకటేశ్వర స్వామి కళ్లలోకి నేరుగా చూడలేరు. ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవని పండితులు చెబుతున్నారు. ఈ కారణంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్లను మూసి ఉంచుతారని చెబుతున్నారు. ఒక్క గురువారం మాత్రం వెంకటేశ్వర స్వామి కన్నుల ముసుగును మారుస్తారట. ఆ సమయంలో మాత్రమే భక్తులు వేంకటేశ్వరుని నేత్రాలను ఒక్క క్షణం చూడగలరు.

బాలాజీ కళ్ళు ఎలా కప్పి ఉంటాయి.. ?

ఆలయంలో వేంకటేశ్వరుని కన్నులను పచ్చ కర్పూరంతో కప్పి ఉంచుతారు. ధార్మిక గ్రంధాల ప్రకారం తిరుపతి బాలాజీ కళ్లు ఎప్పుడూ తెరిచి ఉంటాయని, ఆయన కళ్లు చాలా తీక్షణంగా ఉంటాయని, నేరుగా చూడలేమని చెబుతున్నారు. అందుకే భగవంతుని కన్నులు ఎప్పుడూ కర్పూరంతో మూసి ఉంచుతారట. కేవలం గురువారం మాత్రమే వేంకటేశ్వరుని నేత్రాలను భక్తులు చూడవచ్చని చెబుతారు.

గురువారం స్వామి వారి అలంకరణ..

వారంలో ప్రతి గురువారం, వెంకటేశ్వర స్వామికి చందనంతో అభిషేకం చేసి, ఆపై ఆయన విగ్రహానికి చందనం పూస్తారు. ఆయన గుండెల పై చందనం పూత పూయడం వల్ల లక్ష్మీదేవి ప్రతిమ కనిపిస్తుంది.

బాలాజీ దండలో 27 రకాల పూలు..

తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి రోజూ 100 అడుగుల పొడవైన దండను అలంకరిస్తారు. ఆ మాలను 27 రకాల పూలతో కడతారట. అన్ని దండలలోని పూలను వివిధ తోటల నుండి సేకరిస్తారట. అలాగే వైకుంఠోత్సవం, బ్రహ్మోత్సవాల సందర్భంగా విదేశాల నుంచి కూడా పూలను ఆర్డర్ చేస్తారని పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News