PM Modi : వేదాంతవేత్తగా మారిన బ్రెజిల్ ఇంజినీర్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు
వేదాంత ఉపాధ్యాయుడిగా మారిన బ్రెజిల్ దేశ మెకానికల్ ఇంజినీర్ జోనస్ మాసెట్టి(Jonas Masetti).. భారత ప్రధాని మోడీని కలిశారు.
దిశ, నేషనల్ బ్యూరో : కరీబియన్ దేశాలతో వివిధ రంగాల్లో సహకార బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) అన్నారు. గయానాలో తనకు లభించిన అపూర్వ స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ - కారికోం’ రెండో సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ బుధవారం ఉదయం బ్రెజిల్ నుంచి నేరుగా గయానా రాజధాని నగరం జార్జ్ టౌన్‌కు చేరుకున్నారు. విమానం దిగిన వెంటనే మోడీకి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, ప్రధానమంత్రి మార్క్ ఆంటోనీ ఫిలిప్స్ ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా భారత్ - గయానా సంబంధాలకు గుర్తుగా జార్జ్ టౌన్ తాళం చెవి నమూనాను ప్రధాని మోడీకి ఆ నగర మేయర్ బహూకరించారు. అనంతరం ‘భారత్ - కారికోం’ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కరీబియన్ దేశాల ప్రభుత్వాధినేతలతో ఆయన భేటీ అయ్యారు. ఆర్థిక, వ్యవసాయ, ఆహార భద్రత, ఆరోగ్య, ఫార్మా, సైన్స్ అండ్ ఇన్నోవేషన్ రంగాల్లో ఆ దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ తెలిపారు. గురువారం కూడా గయానాలోనే ప్రధాని మోడీ ఉండనున్నారు. గత 56 ఏళ్లలో గయానాలో పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రి మోడీయే. ఈ దేశంలో దాదాపు 3.20 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. అంతకుముందు బ్రెజిల్‌లో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌లతో మోడీ భేటీ అయ్యారు. బ్రెజిల్, ఇటలీ, ఇండోనేషియా, పోర్చుగల్, నార్వే, చిలీ, అర్జెంటీనా, ఈజిప్ట్, దక్షిణ కొరియా దేశాల ప్రభుత్వాధినేతలతోనూ సమావేశమయ్యారు.
వేదాంతవేత్తగా మారిన బ్రెజిల్ ఇంజినీర్‌పై మోడీ ప్రశంసలు
వేదాంత ఉపాధ్యాయుడిగా మారిన బ్రెజిల్ దేశ మెకానికల్ ఇంజినీర్ జోనస్ మాసెట్టి(Jonas Masetti).. భారత ప్రధాని మోడీని కలిశారు. బ్రెజిల్‌లో జీ20 సదస్సులో పాల్గొనేందుకు మోడీ వెళ్లగా ఆయనను మాసెట్టి కలిశారు. బ్రెజిల్‌లో వేదాంతం, భగవద్గీతలపై ప్రచారం చేస్తున్నందుకు మాసెట్టిని ఈసందర్భంగా ప్రధాని మోడీ కొనియాడారు. గతంలో తాను ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ మాసెట్టి గురించి ప్రస్తావించానని గుర్తు చేశారు. ఆధునిక టెక్నాలజీని వాడుకొని వేదాంతం, భగవద్గీతలను ప్రచారం చేస్తుండటం చాలా గొప్ప విషయమన్నారు. జోనస్ మాసెట్టి టీమ్‌లోని వారంతా కలిసి రామాయణంలోని వివిధ పాత్రల వేషధారణల్లో ప్రధాని మోడీ ఎదుట స్టేజీపై కొన్ని ఘట్టాలను ప్రదర్శించారు. బ్రెజిల్‌లోని పెట్రోపోలిస్ పట్టణంలో ‘విశ్వ విద్య’ పేరుతో ఒక సంస్థను మాసెట్టి నడుపుతున్నాడు. వేదాంతం, భగవద్గీతలతో కూడిన షార్ట్ టర్మ్ కోర్సును గత ఏడేళ్లలో ఉచితంగా దాదాపు 1.5 లక్షల మందికిపైగా విద్యార్థులకు అతడు బోధించాడు.